
తాజా వార్తలు
ఆఖరి రోజు ఓపిక పడితే..!
బ్రిస్బేన్: టీమ్ఇండియాతో నాలుగో టెస్టు ఆఖరి రోజు సహనంతో ఉండాలని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ తమ బౌలర్లకు సూచించాడు. గబ్బా పిచ్ విచిత్రంగా మారిందని పేర్కొన్నాడు. ఏది ఏమయినా మంగళవారం పర్యాటక జట్టు పట్టుదలతో బ్యాటింగ్ చేస్తుందని అంచనా వేశాడు. సోమవారం ఆట ముగిశాక స్మిత్ మీడియాతో మాట్లాడాడు. చివరి టెస్టులో టీమ్ఇండియాకు ఆసీస్ 328 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సంగతి తెలిసిందే.
‘ప్రస్తుతం ఆట మాకు అనుకూల పరిస్థితుల్లో ఉంది. గబ్బా పిచ్ వింతగా ప్రవర్తించడం మొదలైంది. కొన్ని బంతులు అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. అంటే ఆఖరి రోజు మేం చక్కని ప్రాంతాల్లో బంతులు వేయాలి. వికెట్ స్వభావాన్ని ఉపయోగించుకోవాలి. అన్ని అవకాశాలను ఒడిసిపడతామన్న నమ్మకం ఉంది’ అని స్మిత్ అన్నాడు. వర్షం ప్రభావం కీలకమవుతుందా అని ప్రశ్నించగా ‘ఎవరికి తెలుసు? ఇది చాలా కఠిన ప్రశ్న’ అని బదులిచ్చాడు.
‘సిడ్నీలో భారత బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. 130+ ఓవర్లు నిలిచారు. ఆ వికెట్‌తో పోలిస్తే గబ్బా ఎంతో భిన్నం. ఏదేమైనా మేం కొత్త దారులు వెతక్కుండా ఓపికగా ఉండాలి. మంచి ప్రాంతాల్లో బంతులు విసిరి ఏమవుతుందో చూడాలి. ఆఖరి రోజు కావడంతో కుర్రాళ్లు ఆసక్తిగా ఉన్నారు’ అని స్మిత్ అన్నాడు.
ఆసీస్ ఇంకాస్త ముందుగా డిక్లేర్ చేస్తే బాగుండేదా అని ప్రశ్నించగా.. ‘వర్షం కురుస్తున్నప్పుడు ఎంత స్కోరు మంచిదో తెలియదు. వాతావరణాన్ని మేం అంచనావేయలేం కదా. చివరి రోజు ఏం జరుగుతుందో తెలియదు’ అని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ పిక్క కండరాల గాయం గురించి తనకు తెలియదని స్మిత్ అన్నాడు. మంగళవారం స్పిన్నర్ నేథన్ లైయన్ కీలకమవుతాడని తెలిపాడు.
ఇవీ చదవండి
ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్ చేసిన సుందర్