
తాజా వార్తలు
ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
ఆయన మాటలే స్ఫూర్తినిచ్చాయి: శార్దూల్
ఇంటర్నెట్‌డెస్క్: బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన ఏకాగ్రత దెబ్బతీయడానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారని టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. 186/6 స్కోరుతో కష్టాల్లో ఉన్న జట్టును సుందర్ (62)తో కలిసి శార్దూల్ (67) ఆదుకున్న విషయం తెలిసిందే. ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధశతకాన్ని సాధించాడు. కాగా, మూడో రోజు ఆట ముగిసిన అనంతరం తన ప్రదర్శనపై శార్దూల్ మీడియాతో మాట్లాడాడు.
‘‘మైదానంలోకి వచ్చినప్పుడు నా ముందు కఠిన పరిస్థితులు ఉన్నాయి. స్టేడియంలోని జనాలు ఆస్ట్రేలియా బౌలర్లకు మద్దతు ఇస్తున్నారు. అయితే వన్డే సిరీస్ సమయంలో కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘ఆసీస్‌లో గొప్ప ప్రదర్శన చేస్తే, ప్రత్యేక ఘనత సాధించినట్లే’ అని ఆయన చెప్పాడు. మరోవైపు మంచి ప్రదర్శన చేస్తే ప్రజలు తప్పక ఆదరిస్తారనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఈ రెండు విషయాలు నా మదిలో మెదిలాయి. మొత్తంగా ఆట ముగిసేసరికి జట్టుకు అండగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది గొప్ప సానుకూలత’’ అని శార్దూల్ పేర్కొన్నాడు.
‘‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ నేను బదులివ్వలేదు. కొన్ని సాధారణ ప్రశ్నలకు రెండు సార్లు జవాబిచ్చాను. అయితే వాళ్లు కవ్వించడానికి ఎంత ప్రయత్నించినా నేను పట్టించుకోలేదు. నా దృష్టంతా ఆటపైనే ఉంచా. ఇక నా ప్రదర్శన విషయానికొస్తే.. నేను బ్యాటింగ్ చేయగలను. ప్రాక్టీస్ కూడా చేస్తాను. అయితే సుందర్‌తో కలిసి గతంలో బ్యాటింగ్ చేసిన అనుభవం చాలా తక్కువ. కానీ, మా ఇద్దరి మధ్య సమన్వయం ఉంది. ఆసీస్ బౌలర్లు అలసిపోతున్నారని మాకు తెలుసు. అందుకే ఎక్కువసేపు క్రీజులో ఉండాలనుకున్నాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పరుగులు సాధించాం’’ అని శార్దూల్ తెలిపాడు.
కాగా, బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 21/0తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 336 పరుగులు చేసింది. భారత్ కంటే ఆతిథ్యజట్టు 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి
గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్