close

ప్రధానాంశాలు

కుర్ర కెరటాలు

అండర్‌-19 ప్రపంచకప్‌
మరో 2 రోజుల్లో
ఈనాడు క్రీడావిభాగం

సీనియర్‌ జట్టులోకి వచ్చే ముందు చివరి అడుగు అండర్‌-19..! ఇక్కడ అద్భుత ప్రదర్శన చేస్తే భారత జట్టులో స్థానానికి రేసులో ఉన్నట్లే! రాబోయే అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్న కుర్రాళ్లలో కొంతమంది గొప్ప ప్రతిభావంతులు ఉన్నారు. భవిష్యత్‌ తారలుగా రాణిస్తారనే అంచనాలు ఉన్న వాళ్లు ఉన్నారు. జట్టులో అలాంటి అంచనాలున్న ఆటగాళ్లెవరో చూద్దామా...!


అతడే వెన్నెముక

అండర్‌-19 జట్టుకు వెన్నెముక ప్రియమ్‌ గార్గ్‌. ఈ జట్టుకు కెప్టెన్‌ అయిన గార్గ్‌.. అంతకంటే కీలకమైన బ్యాట్స్‌మన్‌ కూడా. 2018లో దేశవాళీ అరంగేట్రం చేసిన ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ కుర్రాడు ఇప్పటిదాకా 12 మ్యాచ్‌ల్లో 66.69 సగటుతో 867 పరుగులు సాధించాడు. ఇందులో  2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 206. లిస్ట్‌-ఎలో 90.87 స్ట్రయిక్‌ రేట్‌తో 707 పరుగులు చేశాడీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌. ఇటీవల దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, జింబాబ్వే పాల్గొన్న నాలుగు దేశాల టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో   కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా గార్గ్‌ పాత్ర ఎంతో ఉంది.


సంచలన యశస్వి

యశస్వి జైస్వాల్‌.. 2019లో భారత క్రికెట్లో సంచలనం రేపాడీ 18 ఏళ్ల కుర్రాడు. విజయ్‌ హజారె టోర్నీలో ముంబయి తరఫున జార్ఖండ్‌పై 154 బంతుల్లోనే 203 పరుగులు చేసి లిస్ట్‌-ఎలో డబుల్‌ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ధనాధన్‌ ఆటకు పేరొందిన యశస్వి.. సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్‌.  ఒకవైపు పానీపురి అమ్ముతూ మరోవైపు క్రికెట్‌ శిక్షణ తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి పైకొచ్చిన యశస్వి.. అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 13 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 70.81 సగటుతో 779 పరుగులు చేశాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌.


ఆల్‌రౌండర్‌

ధ్రువ్‌ జురెల్‌.. అండర్‌-19 జట్టులో అతనో ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌తో పాటు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు 18 ఏళ్ల ధ్రువ్‌.  ఇప్పటిదాకా ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడని ధ్రువ్‌.. అండర్‌-19 జట్టు తరఫున 81.02 స్ట్రయిక్‌ రేట్‌తో 47.44 సగటుతో పరుగులు సాధించాడు. ధ్రువ్‌ది సైనిక నేపథ్యం. అతని నాన్న నేమ్‌సింగ్‌ 1999 కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నాడు.  ఏబీ డివిలియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకునే ధ్రువ్‌.. అతనిలాగే ధనాధన్‌ ఆటను ఇష్టపడతాడు. అతని వీడియోలు చూసి ఏబీలా షాట్లు కొట్టే ప్రయత్నం చేస్తుంటాడు.


మలుపు ‘తిప్పేస్తాడు’

అండర్‌-19 జట్టులో ప్రభావవంతమైన స్పిన్నర్‌ అథర్వ అంకోలేకర్‌. చక్కటి వైవిధ్యంతో పాటు ఫ్లయిట్‌తో ఈ ముంబయి బౌలర్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తాడు. అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్లో 5 వికెట్లు తీసి జట్టుకు టైటిల్‌ అందించడంతో అథర్వ వెలుగులోకొచ్చాడు. అథర్వ నాన్న చిన్నప్పుడే చనిపోగా.. అతడి తల్లే అథర్వను క్రికెటర్‌గా తయారు చేసింది. బస్‌ కండక్టర్‌గా పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడి అతడి ఎదుగుదలలో కీలకపాత్ర పోషించింది. ఇప్పటివరకు 10 అండర్‌-19 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ 9.51 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు.


మన తిలక్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టులో తెలుగుతేజం ఠాకూర్‌ తిలక్‌వర్మ కూడా ఉన్నాడు. దేశవాళీ మ్యాచ్‌లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికైన ఈ హైదరాబాద్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌.. ఈ టోర్నీ తప్పక చూడదగ్గ ఆటగాడు. మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మన్‌ అయిన తిలక్‌.. ఇప్పటిదాకా అండర్‌-19 తరఫున 10 మ్యాచ్‌ల్లో 41.07 సగటుతో 575 పరుగులు సాధించాడు. ఉపయుక్తమైన ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ కూడా అయిన తిలక్‌.. ఏడు వికెట్లు పడగొట్టాడు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.