close

ప్రధానాంశాలు

Updated : 19/10/2020 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపరో సూపర్‌

ఒకే రోజు మూడు సూపర్‌ ఓవర్లు
ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు స్కోర్లు సమం
ముంబయిపై పంజాబ్‌ గెలుపు
కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్‌ ఓటమి

అనూహ్యం.. అసాధారణం.. అద్భుతం! ఇది ఇంతకుముందెన్నడూ చూడనిది. బహుశా ఇంకెప్పుడూ చూడలేనిది!క్రికెట్లో రెండు జట్ల స్కోర్లు సమమై మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడమే అరుదు. అలాంటిది ఆదివారం ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లూ సూపర్‌ ఓవర్లకు మళ్లాయి. అంతేనా.. ఒక మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ కూడా టై అయింది. అంటే.. ఒక్క రోజులో మూడు సూపర్‌ ఓవర్లన్నమాట. ఇలా రెండుసార్లు స్కోర్లు సమమైన మ్యాచ్‌లో పంజాబ్‌ అనూహ్య విజయాన్నందుకుంది. మొదట సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను టై చేసుకున్న ఆ జట్టు.. సూపర్‌ ఓవర్లో బుమ్రా ధాటికి తేలిపోయినట్లే కనిపించింది. కానీ తర్వాత షమి అద్భుత ప్రదర్శనతో సూపర్‌ ఓవర్‌ను టై చేయగలిగింది. రెండో సూపర్‌ ఓవర్లో బంతితో, బ్యాటుతో రాణించి ముంబయికి షాకిచ్చింది. అంతకుముందు తొలి మ్యాచ్‌ కూడా సూపర్‌ఓవర్‌కు దారి తీయగా, ఫాస్ట్‌బౌలర్‌   ఫెర్గూసన్‌ అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా.. సన్‌రైజర్స్‌ను ఓడించింది.

20 ఓవర్లలో..  ముంబయి 176/6.. పంజాబ్‌ 176/6

దుబాయ్‌: ఎన్ని మలుపులు.. ఎన్ని మెలికలు! ఎంత ఉత్కంఠ.. ఎంత ఒత్తిడి! ఇదొక అరుదైన, అద్భుతమైన మ్యాచ్‌! రెండు సూపర్‌ ఓవర్లు పడినా.. రెండుసార్లు మ్యాచ్‌ చేజారినట్లే కనిపించినా.. ఒత్తిడిలో నిలిచిన పంజాబ్‌ అత్యావశ్యక విజయాన్నందుకుంది. ఆదివారం మొదట ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్‌ (53)తో పాటు పొలార్డ్‌ (34 నాటౌట్‌), కౌల్టర్‌నైల్‌ (24 నాటౌట్‌) రాణించారు. అనంతరం రాహుల్‌ (77) మెరుపులతో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్లో బుమ్రా ధాటికి మొదట పంజాబ్‌ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా.. ఛేదన నాటకీయంగా సాగింది. షమి బుమ్రాను మించి కట్టుదిట్టంగా బంతులేశాడు. దీంతో తొలి అయిదు బంతులకు ముంబయి నాలుగు పరుగులే చేయడంతో.. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి వచ్చింది. ఈ స్థితిలో డికాక్‌ రెండో పరుగు తీస్తూ రనౌటవడంతో స్కోర్లు మళ్లీ సమమై మ్యాచ్‌ మరో సూపర్‌ ఓవర్‌కు మళ్లింది. ఈ సూపర్‌ఓవర్లో మొదట ముంబయి 11 పరుగులు చేసింది. జోర్డాన్‌ వేసిన ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేసిన ముంబయి.. పాండ్య వికెట్‌ కోల్పోయింది. అయిదో బంతికి పరుగేలేమీ చేయని పొలార్డ్‌.. చివరి బంతికి భారీ షాట్‌ కొట్టినా.. బౌండరీ లైన్‌లో మయాంక్‌ కళ్లు చెదిరే రీతిలో సిక్స్‌ ఆపడంతో ఆ జట్టుకు రెండే పరుగులు లభించాయి. 12 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ నాలుగు బంతుల్లోనే పూర్తి చేసింది. తొలి బంతికే గేల్‌ సిక్స్‌ కొట్టగా.. మూడు, నాలుగు బంతులకు మయాంక్‌ ఫోర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇంతకుముందు సూపర్‌ ఓవర్‌ టై అయితే బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించేవారు. కానీ గత ఏడాది ప్రపంచకప్‌లో ఈ నిబంధన వివాదాస్పదం కావడంతో.. సూపర్‌ ఓవర్‌ టై అయితే మళ్లీ సూపర్‌ ఓవర్‌ ఆడేలా నిబంధనలు మార్చారు.
రాహుల్‌ రాణించినా..: పంజాబ్‌ ఛేదనలో రాహుల్‌ అద్భుతంగా ఆడినా.. అతడికి ఆశించిన సహకారం అందలేదు. గేల్‌ (24), పూరన్‌ (24) కాసేపు నిలిచినా కీలక సమయంలో ఔటయ్యారు. ఈ స్థితిలో హుడా (23 నాటౌట్‌)తో కలిసి రాహుల్‌ జట్టును నడిపించాడు. గెలుపు సమీకరణం 18 బంతుల్లో 27 పరుగులుగా మారింది. కానీ ఓ యార్కర్‌తో రాహుల్‌ను బౌల్డ్‌ చేసిన బుమ్రా మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పాడు. కానీ హుడా , జోర్డాన్‌ (13) పంజాబ్‌ ఆశలు నిలిపారు. చివరి ఓవర్లో గెలవాలంటే 9 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతుల్లోనే 5 పరుగులొచ్చాయి. చివరి బంతికి రెండు అవసరం కాగా.. రెండో పరుగు తీయబోతూ జోర్డాన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయింది.  

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) ఆర్ష్‌దీప్‌ 9; డికాక్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 53; సూర్యకుమార్‌ (సి) మురుగన్‌ (బి) షమి 0; ఇషాన్‌ కిషన్‌ (సి) మురుగన్‌ (బి) అర్ష్‌దీప్‌ 7; కృనాల్‌ (సి) హుడా (బి) బిష్ణోయ్‌ 34; హార్దిక్‌ (సి) పూరన్‌ (బి) షమి 8; పొలార్డ్‌ నాటౌట్‌ 34; కౌల్టన్‌నైల్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-23, 2-24, 3-38, 4-96, 5-116, 6-119; బౌలింగ్‌: మాక్స్‌వెల్‌ 4-0-24-0; షమి 4-0-30-2; ఆర్ష్‌దీప్‌ 3-0-35-2; జోర్డాన్‌ 3-0-32-1; మురుగన్‌ 3-0-28-0; హుడా 1-0-9-0; బిష్ణోయ్‌ 2-0-12-1
పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) బుమ్రా 77; మయాంక్‌ (బి) బుమ్రా 11; గేల్‌ (సి) బౌల్ట్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 24; పూరన్‌ (సి) కౌల్టర్‌నీల్‌ (బి) బుమ్రా 24; మాక్స్‌వెల్‌ (సి) రోహిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 0; హుడా నాటౌట్‌ 23; జోర్డాన్‌ రనౌట్‌ 13 ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176;  వికెట్ల పతనం: 1-33, 2-75, 3-108, 4-115, 5-153,   6-176; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-0; కృనాల్‌ 2-0-12-0; బుమ్రా 4-0-24-3; కౌల్టర్‌నైల్‌ 4-0-33-0; పొలార్డ్‌     2-0-26-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-2


20 ఓవర్లలో.. కోల్‌కతా 163/5.. హైదరాబాద్‌ 163/6

అబుదాబి:  సన్‌రైజర్స్‌కు మరోసారి నిరాశ. ఐపీఎల్‌-13లో ఆ జట్టు హ్యాట్రిక్‌ ఓటములు చవిచూసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు సూపర్‌ ఓవర్లో కోల్‌కతా చేతిలో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (36; 37 బంతుల్లో 5×4), మోర్గాన్‌ (34; 23 బంతుల్లో 3×4, 1×6), దినేశ్‌ కార్తీక్‌ (29 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 2×6), నితీశ్‌ రాణా (29; 20 బంతుల్లో 3×4, 1×6) తలో చేయి వేశారు. ఛేదనలో సన్‌రైజర్స్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. కెప్టెన్‌ వార్నర్‌ (47 నాటౌట్‌; 33 బంతుల్లో 5×4) గొప్పగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. సూపర్‌ ఓవర్లో సన్‌రైజర్స్‌ 3 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా.. కోల్‌కతా నాలుగో బంతికి విజయాన్నందుకుంది. మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీయడమే కాక.. సూపర్‌ఓవర్లో మూడు బంతుల్లోనే ఇద్దరిని బౌల్డ్‌ చేసి సన్‌రైజర్స్‌కు అవకాశం లేకుండా చేసిన ఫెర్గూసన్‌ (3/15) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.
ఆరంభం అదిరినా..: ఛేదనలో సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభమే దక్కినప్పటికీ మరోసారి మిడిలార్డర్‌ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. మిడిలార్డర్‌ బలోపేతం కోసం తన ఓపెనింగ్‌ స్థానాన్ని వార్నర్‌ త్యాగం చేయడంతో బెయిర్‌స్టో (36; 28 బంతుల్లో 7×4)తో కలిసి విలియమ్సన్‌ (29; 19 బంతుల్లో 4×4, 1×6) ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఈ కొత్త జోడీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. పవర్‌ప్లే అయ్యేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ ఫెర్గూసన్‌ బంతి అందుకోవడంతో కథ మారిపోయింది. తన తొలి బంతికే విలియమ్సన్‌ను ఔట్‌ చేసి షాకిచ్చిన అతను.. తన తర్వాతి రెండు ఓవర్లలో వరుసగా ప్రియమ్‌ గార్గ్‌ (4), మనీశ్‌ పాండే (6)ను బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ను నైట్‌రైడర్స్‌ వైపు తిప్పాడు. 13 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ 89/4తో నిలవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పది దాటింది. ఆ పరిస్థితుల్లో కెప్టెన్‌ వార్నర్‌ క్రీజులో ఉండడంతో జట్టు విజయంపై ఆశలు నిలిచాయి. విజయ్‌ శంకర్‌ (7) ఔటయ్యాక వచ్చిన అబ్దుల్‌ సమద్‌ (23; 15 బంతుల్లో 2×4, 1×6) అండతో వార్నర్‌ చెలరేగడంతో సన్‌రైజర్స్‌ విజయానికి చేరువైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా.. వార్నర్‌ షాట్‌ ఆడలేకపోవడంతో ఒక్క పరుగే వచ్చి మ్యాచ్‌ టై అయింది.

మెల్లగా మొదలై...: మొదట కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. దూకుడుగా ఆడిన త్రిపాఠి (23; 16 బంతుల్లో 2×4, 1×6) ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. గిల్‌ మరీ నెమ్మదిగా ఆడాడు. బంతికో పరుగు చొప్పున చేశాడు. విజయ్‌ శంకర్‌ (1/20), రషీద్‌ ఖాన్‌ (1/28) కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం మరీ నెమ్మదించింది. కుదురుకున్న గిల్‌, రాణా స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. రసెల్‌ (9) మరోసారి విఫలమవడంతో 15 ఓవర్లకు ఆ జట్టు 105/4తో నిలిచింది. ఆ దశలో కెప్టెన్‌ మోర్గాన్‌తో దినేశ్‌ కార్తీక్‌ జత కలవడంతో ఇన్నింగ్స్‌ జోరందుకుంది. కోల్‌కతా చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు పిండుకుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 36; త్రిపాఠి (బి) నటరాజన్‌ 23; నితీశ్‌ రాణా (సి) గార్గ్‌ (బి) శంకర్‌ 29; రసెల్‌ (సి) శంకర్‌ (బి) నటరాజన్‌ 9; మోర్గాన్‌ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 29; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1-48, 2-87, 3-88, 4-105, 5-163; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-27-0; బాసిల్‌ థంపి 4-0-46-1; నటరాజన్‌ 4-0-40-2; విజయ్‌ శంకర్‌ 4-0-20-1; రషీద్‌ ఖాన్‌ 4-0-28-1
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 36; విలియమ్సన్‌ (సి) రానా (బి) ఫెర్గూసన్‌ 29; గార్గ్‌ (బి) ఫెర్గూసన్‌ 4; వార్నర్‌ నాటౌట్‌ 47; పాండే (బి) ఫెర్గూసన్‌ 6; శంకర్‌ (సి) గిల్‌ (బి) కమిన్స్‌ 7; సమద్‌ (సి) గిల్‌ (బి) మావి 23; రషీద్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1-58, 2-70, 3-70, 4-82, 5-109, 6-146; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-28-1; శివమ్‌ మావి 3-0-34-1; వరుణ్‌ 4-0-32-1; రసెల్‌ 2-0-29-0; ఫెర్గూసన్‌ 4-0-15-3; కుల్‌దీప్‌ 3-0-18-0


ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా డేవిడ్‌ వార్నర్‌ రికార్డు సృష్టించాడు 



 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.