close

ప్రధానాంశాలు

Published : 29/11/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమయం లేదు.. సమం చేయాలి

టీమ్‌ఇండియాకు చావోరేవో
ఆస్ట్రేలియాతో రెండో వన్డే నేడే
ఉదయం 9.10 నుంచి
సిడ్నీ

‘‘ముందుగానే చెప్తున్నా.. ఈ పర్యటనలో అన్ని సిరీస్‌ల్లోనూ భారత్‌పై ఆస్ట్రేలియా సులభంగా గెలుస్తుంది’’.. ఇవీ ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా తొలి వన్డేలో ఓడిన తీరు చూశాక భారత అభిమానుల్లోనూ అదే భయం కలుగుతోంది. ఆ ఓటమి కంటే కూడా ఓడిన విధానమే తీవ్ర నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో స్థాయికి తగ్గ ఆటతీరుతో ఆదివారం రెండో వన్డేలో ఆసీస్‌ను ఓడించి తిరిగి అభిమానులకు నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత జట్టు మీద ఉంది. ఈ మ్యాచ్‌ ఓడితే సిరీస్‌ పోతుంది కాబట్టి ఈ పోరు భారత్‌కు చావోరేవో!

స్ట్రేలియా గడ్డపై ఒక్క రోజు వ్యవధిలోనే టీమ్‌ఇండియాకు మరో కఠిన పరీక్ష ఎదురుకానుంది. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో జరిగిన తొలి వన్డేలో ఓటమితో పర్యటనను మొదలెట్టిన భారత్‌.. అదే స్టేడియంలో రెండో వన్డే ఆడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజార్చుకోకూడదంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ నెగ్గాల్సిందే. కరోనా విరామం తర్వాత తిరిగి తొలిసారిగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైన జట్టు ఆ ఓటమి నుంచి బయటపడి బలంగా పుంజుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో హార్దిక్‌, ధావన్‌ మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించలేకపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి తేడా చూస్తే 66 పరుగులే కావొచ్చు.. కానీ జట్టుగా దాని ప్రదర్శన మాత్రం తీసికట్టుగా ఉంది. టాప్‌ఆర్డర్‌, మిడిలార్డర్‌లో బౌలింగ్‌ చేసే బ్యాట్స్‌మెన్‌, లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే బౌలర్‌ లేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది.
వాళ్లు ఆడాలి..: సుదీర్ఘ పర్యటనను  పరాజయంతో మొదలెట్టడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదే. కానీ 2019 జనవరిలో, ఇదే ఆస్ట్రేలియాలో ఇలాగే తొలి వన్డేలో ఓడిన భారత్‌.. తర్వాత మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకుంది. మరోసారి ఆ ప్రదర్శనను జట్టు పునరావృతం చేయాల్సి ఉంది. అలా జరగాలంటే బ్యాటింగ్‌ విభాగం సమష్టిగా రాణించాలి. తొలి వన్డేలో షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడడంలో విఫలమై పెవిలియన్‌ బాట పట్టిన కెప్టెన్‌ కోహ్లితో పాటు మయాంక్‌, శ్రేయస్‌  ఆ బలహీనతను అధిగమించాలి. ముఖ్యంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. టాప్‌ఆర్డర్లో ఏ ఇద్దరు క్రీజులో నిలబడ్డ జట్టుకు తిరుగుండదు. ఇక తొలి వన్డేలో పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా సత్తాచాటిన హార్దిక్‌తో పాటు ధావన్‌ ఫామ్‌ కొనసాగించాలి.  
బుమ్రా.. ఏవీ మెరుపులు?: బుమ్రా, షమి లాంటి ప్రపంచ స్థాయి పేసర్లతో టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉందని సిరీస్‌కు ముందు చాలా మాటలే వినిపించాయి. కానీ తీరా తొలి వన్డేలో చూస్తే మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. షమి మెరిసినప్పటికీ.. బుమ్రా మాత్రం సాధారణ బౌలర్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన అతను.. అదే జోరును టీమ్‌ఇండియా తరపున చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక జట్టులో ఆరో బౌలర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత బౌలింగ్‌ వేసేందుకు హార్దిక్‌ ఇంకా పూర్తిగా సిద్ధమవ్వలేదు. తొలి వన్డేలో గాయపడ్డ చాహల్‌, ధారాళంగా పరుగులిచ్చిన సైని స్థానాల్లో కుల్‌దీప్‌, నటరాజన్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది.
జోరుమీద ప్రత్యర్థి: ఆస్ట్రేలియా రెండో వన్డేలో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ దుర్భేద్యంగా ఉంది. ముఖ్యంగా స్మిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌, ఫించ్‌ చక్కటి బ్యాటింగ్‌తో శతకాలు బాదేశారు. వీళ్లను కట్టడి చేయడం మీదే భారత్‌ గెలుపు ఆధారపడి ఉంది. తొలి వన్డేలో గాయపడ్డ స్టాయినిస్‌ స్థానంలో గ్రీన్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే వీలుంది. పేసర్లు హేజిల్‌వుడ్‌, స్టార్క్‌, కమిన్స్‌తో పాటు స్పిన్నర్‌ జంపాతో కూడిన ఆ జట్టు బౌలింగ్‌ విభాగమూ బలంగానే ఉంది.


పిచ్‌ ఎలా ఉంది..

తొలి వన్డేలో బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌ స్వభావంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే మరో వన్డే జరుగుతుండడంతో కాస్త నెమ్మదించే వీలుంది. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువ.


11.40

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో వన్డేల్లో కోహ్లి సగటు. కనీసం అయిదు ఇన్నింగ్స్‌లు ఆడిన మైదానాల పరంగా చూసుకుంటే ఇదే అత్యల్పం. ఇక్కడ ఆరు వన్డేల్లో అతను 57 పరుగులు మాత్రమే చేశాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన