36.. పరువు కంగారు పాలు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 20/12/2020 02:08 IST

36.. పరువు కంగారు పాలు

భారత టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు
కుప్పకూలిన కోహ్లీసేన
తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం

అడిలైడ్‌

వాడేకర్‌ ఊపిరి తీసుకోవచ్చు. గావస్కర్‌ హమ్మయ్య అనుకోవచ్చు. 46 ఏళ్లుగా వాళ్లు మోస్తున్న అవమాన భారం ఎట్టకేలకు తొలగిపోయింది. ఘనత వహించిన కోహ్లీసేన అడిలైడ్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో  ‘భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు’ సాధించిన జట్టుగా రికార్డు సొంతం చేసుకుంది.
పిచ్‌ కఠినంగానే ఉండొచ్చు.. ప్రత్యర్థి బౌలర్లు గొప్పగా బంతులేసి ఉండొచ్చు.. కానీ జట్టు జట్టంతా కలిసి 36 పరుగులు చేయడమేంటి..? ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోరు చేయకపోవడమేంటి..? అసలు క్రీజులో నిలవడమే పాపం అన్నట్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌ చేరిపోవడమేంటి..? కనీస పోరాటం లేకుండా వికెట్లు ఇచ్చేయడమేంటి..?
అదే వేదిక.. అదే పిచ్‌.. అదే బౌలర్లు.. అవే బంతులు..! కానీ తొలి ఇన్నింగ్స్‌లో ఒక రోజుకు పైగా, 93.1 ఓవర్లాడిన అదే జట్టు.. కేవలం గంటన్నర సమయంలో, 128 బంతులే ఆడి, 36 పరుగులే చేసి ఇన్నింగ్స్‌ను ముగించేసింది. కొద్దిసేపటికే ఆస్ట్రేలియా ఓపెనర్లు భారత బౌలర్లను అలవోకగా ఆడేసి పిచ్‌లో ‘ఏమీ లేదు’ అని చాటి చెప్పి, మన బ్యాటింగ్‌ డొల్లతనాన్ని బయటపెట్టారు.

అడిలైడ్‌లో రెండో రోజు వరకు భారత్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం. దీనికి ఇంకో 200-250 మధ్య పరుగులు జోడిస్తే మ్యాచ్‌ మనదే అని ఆశ! తొలి ఇన్నింగ్స్‌ తప్పులు దిద్దుకుని బ్యాట్స్‌మెన్‌ తమ బాధ్యత నిర్వర్తిస్తే.. ఆ తర్వాత బౌలర్లు చూసుకుంటారులే అని ధీమా! కానీ ఆ ఆశలు కూలిపోవడానికి, ఆ ధీమా సడలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిన వేళ.. చెత్త రికార్డు కోహ్లీసేన సొంతమైంది. ఓవర్‌నెట్‌ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కేవలం 36 పరుగులకే కుప్పకూలి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. హేజిల్‌వుడ్‌ (5-3-8-5), కమిన్స్‌ (10.2-4-21-4) భారత్‌ పని పటారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 53 పరుగుల ఆధిక్యం కలిపితే ప్రత్యర్థి ముందు నిలిచిన లక్ష్యం 90. దాన్ని ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. భారత జట్టంతా కలిపి 36 పరుగులు చేసిన పిచ్‌ మీదే.. కాసేపటికి ఆస్ట్రేలియా ఓపెనర్‌ బర్న్స్‌ (51 నాటౌట్‌; 63 బంతుల్లో 7×4, 1×6) అలవోకగా బ్యాటింగ్‌ చేసి ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ (33; 53 బంతుల్లో 5×4) కూడా రాణించాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడం విశేషం. 18వ ఓవర్లో కానీ వికెట్‌ పడలేదు. అది కూడా రనౌట్‌ (వేడ్‌). తర్వాత లబుషేన్‌ (6)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. బర్న్స్‌తో పాటు స్మిత్‌ (1) అజేయంగా నిలిచాడు. గులాబి బంతితో డేనైట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ముగించేసిన ఆస్ట్రేలియా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు సాధించడంతో పాటు వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు ఈ నెల 26న మొదలవుతుంది.

60 నిమిషాల పీడకల: ఉదయం కాస్త లేటుగా నిద్ర లేచే అలవాటున్న భారత అభిమానులు.. శనివారం స్కోరెంతో చూద్దామని టీవీ పెట్టాక అక్కడ కనిపించిన దృశ్యాలకు, గణాంకాలకు ఎంతగా షాకై ఉంటారో! ఆట మొదలయ్యాక దాదాపు గంట వ్యవధిలోనే అంతా అయిపోయింది. ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 9.. మూడో అత్యల్ప స్కోరు 4.. ఆ స్కోరు మీదే నలుగురు ఔటయ్యారు.. ఖాతా తెరవని బ్యాట్స్‌మన్‌ ముగ్గురు.. ఒకే స్కోరు వద్ద నాలుగు వికెట్లు పడ్డాయి.. బ్యాటింగ్‌ మూల స్తంభాలైన కోహ్లి, పుజారా, రహానె కలిసి చేసిన పరుగులు నాలుగు.. 5 ఓవర్లే వేసిన హేజిల్‌వుడ్‌ పడగొట్టిన వికెట్లు 5.. భారత బ్యాటింగ్‌ దుస్థితిని తెలియజేసే కొన్ని గణాంకాలివి. నైట్‌ వాచ్‌మన్‌ బుమ్రా (2)ను రిటర్న్‌ క్యాచ్‌తో కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చడంతో మొదలైంది పతనం. ఓవైపు కమిన్స్‌, మరోవైపు హేజిల్‌వుడ్‌ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షకు గురి చేశారు. పన్నెండో ఓవర్లో  పుజారా (0)ను వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో బలిగొన్న కమిన్స్‌.. భారత్‌కు ఇక తేలిక కాదని హెచ్చరికలు జారీ చేశాడు. హేజిల్‌వుడ్‌ తర్వాతి ఓవర్లో తన ప్రతాపం చూపించాడు. మయాంక్‌ (9), రహానె (0)లను ఔట్‌ చేశాడు. ఈ స్థితిలో ఆశలన్నీ కోహ్లి (4) మీదే నిలిచాయి. అతను టెయిలెండర్లతో కలిసి పోరాడతాడని, జట్టును పోటీలో నిలబెడతాడని అభిమానులు ఆశించారు. దూకుడుగా ఆడి బౌలర్ల లయను దెబ్బ తీద్దామన్న ఉద్దేశంతో అతను కమిన్స్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టే ప్రయత్నం చేయగా.. గ్రీన్‌ పాయింట్‌లో చక్కటి క్యాచ్‌ అందుకుని అతడి కథ ముగించాడు. డైవ్‌ చేసినపుడు బంతి చేజారినట్లే చేజారి అతడి చేతుల్లో పడింది. కోహ్లి ఔటయ్యే సమయానికి స్కోరు 19/6. విహారి (8), సాహా (4), ఉమేశ్‌ (4) కాసిన్ని పరుగులు చేసి టెస్టుల్లో అత్యల్ప స్కోరు రికార్డు భారత్‌ పేరిట నమోదు కాకుండా చూశారు. కానీ భారత్‌  తరఫున రికార్డు మాత్రం బద్దలు కాక తప్పలేదు.
* కోహ్లి టాస్‌ గెలిచిన మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 25 మ్యాచ్‌ల్లో విరాట్‌ టాస్‌ గెలిచాడు.
* ఆస్ట్రేలియాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ముందు వరకూ ఓ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా చేసిన అత్యల్ప స్కోరు 42. 1974లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో మ్యాచ్‌లో అప్పటి భారత జట్టు ఆ ప్రదర్శన చేసింది.

మాటలు రావట్లేదు

‘‘ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 50కి పైగా ఆధిక్యాన్ని సాధించి కూడా రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలాం. రెండు రోజులు కష్టపడి.. ఒకే ఒక్క గంట ఆటతో గెలిచే అవకాశం లేని పరిస్థితికి చేరుకున్నాం. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ బౌలర్లు ఒకే ప్రాంతంలో బంతులేశారు. కానీ మా ఆలోచన అంతా పరుగులు చేయడంపైనే ఉంది. ఐతే పరుగులు రాక కష్టమవడంతో బౌలర్లకు ఆత్మవిశ్వాసం పెరిగింది. బౌలింగ్‌ మరీ గొప్పగా లేకపోయినా.. మా దృక్పథం సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాం. ఇంత అధ్వాన్నంగా బ్యాటింగ్‌ చేయడం ఇదే తొలిసారి. నష్టం చాలా వేగంగా జరిగిపోయింది’’

- కోహ్లి

సెంచరీ చేయకుండానే..

తన అరంగేట్ర ఏడాది (2008) తర్వాత ఒక్క అంతర్జాతీయ శతకం కూడా లేకుండా ఓ సంవత్సరాన్ని ముగించబోతుండడం కోహ్లీకిదే తొలిసారి.2020లో 9 వన్డేలు, 10 టీ20లు, 3 టెస్టులు ఆడిన కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

షమికి గాయం.. సిరీస్‌కు దూరం!

పేసర్‌ మహ్మద్‌ షమి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమైనట్లే. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సందర్భంగా కమిన్స్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతి అతని కుడి మోచేతి పైన బలంగా తాకింది. జట్టు వైద్య సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేసినప్పటికీ విపరీతమైన నొప్పి కారణంగా అతను బ్యాటింగ్‌ చేయలేని పరిస్థితుల్లో మైదానాన్ని వీడాడు.  అతని మణికట్టులో పగళ్లు వచ్చినట్లు స్కానింగ్‌లో తేలిందని బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. అతని స్థానంలో సిరాజ్‌ టెస్టు   అరంగేట్రం చేసే వీలుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 191
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ (బి) కమిన్స్‌ 4; మయాంక్‌ (సి) పైన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 9; బుమ్రా (సి) అండ్‌ (బి) కమిన్స్‌ 2; పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 0; కోహ్లి (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 4; రహానె (సి) పైన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 0; విహారి (సి) పైన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 8; సాహా (సి) లబుషేన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 4; అశ్విన్‌ (సి) పైన్‌ (బి) హేజిల్‌వుడ్‌ 0; ఉమేశ్‌ నాటౌట్‌ 4; షమి రిటైర్డ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (21.2 ఓవర్లలో ఆలౌట్‌) 36; వికెట్ల పతనం: 1-7, 2-15, 3-15, 4-15, 5-15, 6-19, 7-26, 8-26, 9-31; బౌలింగ్‌: స్టార్క్‌ 6-3-7-0; కమిన్స్‌ 10.2-4-21-4; హేజిల్‌వుడ్‌ 5-3-8-5
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ రనౌట్‌ 33; బర్న్స్‌ నాటౌట్‌ 51; లబుషేన్‌ (సి) మయాంక్‌ (బి) అశ్విన్‌ 6; స్మిత్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (21 ఓవర్లలో 2 వికెట్లకు) 93; వికెట్ల పతనం: 1-70, 2-82; బౌలింగ్‌: ఉమేశ్‌ 8-1-49-0; బుమ్రా 7-1-27-0; అశ్విన్‌ 6-1-16-1Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన