close
అవినీతి రహిత పాలనే లక్ష్యం  

అయిదేళ్లలో 50 శాతానికి పట్టణ జనాభా
శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పట్టణ పరిపాలనను అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రానున్న అయిదేళ్లలో తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకోనుందని, ఈ మేరకు అక్కడి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. పురపాలక బిల్లు ఆమోదం కోసం శుక్రవారం శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమై ఆమోదించింది. మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌... కొత్తగా ఎన్నికైన 13 మంది సభ్యులను మిగతా సభ్యులకు పరిచయం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మండలి సభ్యులుగా పనిచేసిన గుండా రాంరెడ్డి మరణం పట్ల మండలి సంతాపం తెలిపింది. అనంతరం తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం(వైద్య కళాశాలల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు), పురపాలక చట్టం, రుణవిముక్తి కమిషన్‌, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా ఆయుష్‌ వైద్యులకు పదవీ విరమణ వయసు పెంచాలని భాజపా మండలి పక్షనేత రామచందర్‌రావు కోరగా మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణాలపై పావలా వడ్డీ బకాయిలు చెల్లించాలని, ప్రభుత్వం పూచీకత్తుగా వ్యవహరించి రుణాలు రీషెడ్యూలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని వేముల తెలిపారు.

ఎస్‌కేఎస్‌కు చట్టబద్ధత లేదు..
పురపాలక బిల్లుపై చర్చ సందర్భంగా... ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం బీసీల జనాభా 51 శాతం ఉందని, మైనార్టీలతో కలిపి 65 శాతం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపదికన మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎస్‌కేఎస్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం, ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేలా ఉన్న సెక్షన్‌ను వ్యతిరేకిస్తూ జీవన్‌రెడ్డి మండలి నుంచి వాకౌట్‌ చేశారు.
హైదరాబాద్‌కు తాగునీటి కొరత లేకుండా చేస్తామని మంత్రి వేముల తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయరు నుంచి నీటిని హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. రాజధాని చుట్టూ కొత్తగా ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పురపాలక బిల్లు-2019 ఆమోదం తర్వాత మండలిని డిప్యూటీ ఛైర్మన్‌ నిరవధికంగా వాయిదా వేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.