‘తితిదే’ కేసులో మీరెలా పిల్‌ వేస్తారు?
close

ప్రధానాంశాలు

‘తితిదే’ కేసులో మీరెలా పిల్‌ వేస్తారు?

ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సభర్వాల్‌లకు హైకోర్టు ప్రశ్న

ఈనాడు, అమరావతి: తితిదేపై 2019లో ఓ పత్రిక ప్రచురించిన కథనంపై కేసులో ఎలా పిల్‌ దాఖలు చేస్తారని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్‌/న్యాయవాది సత్య సభర్వాల్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసుపై విచారణ జరిపింది. తితిదేపై ఓ పత్రిక ప్రచురించిన కథనంపై తితిదే విజిలెన్స్‌ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతిలో 2019 డిసెంబరు 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేదంటూ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సభర్వాల్‌ ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ సందర్భంగా.. ఎలా పిల్‌ వేస్తారని వారిని ధర్మాసనం ప్రశ్నించింది. లక్షలాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్‌ దాఖలు చేశామని సత్య సభర్వాల్‌ తెలిపారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని