ధరణిలో మరికొన్ని సేవలు
close

ప్రధానాంశాలు

ధరణిలో మరికొన్ని సేవలు

అందుబాటులోకి అసైన్డ్‌ సర్వే నంబర్లు

సెమీ అర్బన్‌లో నాలా దరఖాస్తుకు అవకాశం

‘లాక్‌డౌన్‌’ స్లాట్లకు తాజాగా అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా మే నెలకు సంబంధించి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌ స్లాట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తిరిగి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ధరణి పోర్టల్‌లో మరికొన్ని సేవలకు గురువారం కొత్త ఐచ్ఛికాలు ఇచ్చారు. పట్టాపాసుపుస్తకం లేని వారు తమ భూమిని వ్యవసాయేతరమైనదిగా మార్చడానికి ‘నాలా’కు దరఖాస్తు చేసినవారు, కోర్టు ఆదేశాల అనంతరం పాసుపుస్తకం పొందేందుకు అర్జీ పెట్టుకున్నవారు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో పరిశీలించుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. నిషేధిత జాబితాలో పట్టాభూములు చేరిన వారికి దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. అసైన్డ్‌ భూముల సర్వే నంబర్లూ పోర్టల్‌లో(ల్యాండ్‌ మ్యాటర్స్‌ గ్రీవెన్స్‌) ఉంటాయి. ఐచ్ఛికాలను రోజువారీ పరిశీలించి మార్పుచేర్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ప్రభుత్వం ధరణి జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించింది.
ముఖ్యమైన ఐచ్ఛికాల్లో కొన్ని..
పట్టా భూముల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు ఉన్న వారికి నాలా అనుమతికి ఐచ్ఛికం. నాలా కింద సర్వే నంబరు మార్పిడి కాని వారికి (ఈ ఏడాది అక్టోబరు 27 వరకు) దరఖాస్తుకు అవకాశం. పౌరులు మొదటి కిస్తీ చెల్లించి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి వచ్చాక రెండో కిస్తీ చెల్లించాలి. అనంతరం స్లాటు నమోదు చేసుకోవాలి. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో నాలా కింద సర్వే నంబరు మార్పిడి కాని వారు కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. డిజిటల్‌ సంతకాలు పూర్తికాని వివిధ రకాల పట్టా భూముల వివరాలు కూడా పోర్టల్‌లో కనిపిస్తాయి. ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించి సమస్యలున్న రైతులు ధరణిలో దరఖాస్తు చేస్తే సరిపోతుంది.  రిజిస్ట్రేషన్‌ సందర్భంగా భూ యజమానుల బయోమెట్రిక్‌, ఐరిస్‌ గుర్తింపు విఫలమైతే వారి సెల్‌ఫోన్‌కు పంపిన ఓటీపీ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక ఈసీ పరిశీలించుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐ లాగిన్‌లో రిజిస్ట్రేషన్‌ పేరుతో ఉన్న ఐచ్ఛికాన్ని ‘పాసుపుస్తకం/ మ్యుటేషన్‌కు దరఖాస్తు’గా మార్పు. వ్యవసాయేతర భూ మార్పిడిలో ఎన్‌ఆర్‌ఐ పాసుపుస్తకానికి అనుమతి. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సంస్థలకు అనుమతి. గతేడాది నవంబరు 2నుంచి నిర్వహించిన దస్త్రాల్లో తప్పుల సవరణకు ‘రాటిఫికేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్స్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని