వరదకు ముందే అప్రమత్తత

ప్రధానాంశాలు

వరదకు ముందే అప్రమత్తత

నాగార్జునసాగర్‌ క్రస్ట్‌గేట్లకు మరమ్మతులు పూర్తి

ఈనాడు, నల్గొండ: కృష్ణా పరివాహకంలో భారీ వరదల దృష్ట్యా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌పీ) అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు రబ్బర్‌ సీల్స్‌, గ్రీజింగ్‌, ఆయిల్‌ మార్చడం వంటి పనులను సోమవారం పూర్తి చేశారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం 539 అడుగులు ఉంది. క్రస్ట్‌గేట్లకు నీళ్లు తాకాలంటే నీటిమట్టం 546 కనీసం అడుగులు ఉండాలి. శ్రీశైలం నుంచి నిలకడగా వరద వస్తుండటంతో రెండు, మూడు రోజుల్లో ఎన్‌ఎస్‌పీ నీటిమట్టం క్రస్ట్‌గేట్లను తాకే అవకాశముంది. గతంలో ప్రాజెక్టు నీటిమట్టం 550 అడుగులకు చేరగానే 26 క్రస్ట్‌గేట్లలో దాదాపు పదింటి నుంచి నీళ్లు లీకవుతుండేవి. మూడేళ్లుగా ఆటోమేషన్‌ ద్వారా గేట్లను ఎత్తి, దించుతున్నారు. గతేడాది ఎమర్జెన్సీ గేటు దెబ్బతినడంతో రూ.50 లక్షలతో కొత్తదాన్ని అమర్చారు. ఈదఫా రెండు కంపెనీలు మరమ్మతులను నిర్వహిస్తున్నాయి.గేట్ల తర్వాత ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే మరమ్మతులు సాగడం లేదు. క్రస్ట్‌గేట్ల నుంచి నీళ్లు నేరుగా స్పిల్‌వేను తాకి కాంక్రీట్‌ కొట్టుకుపోతోంది. వీటి మరమ్మతులకు రూ.17.5 కోట్లు అవసరమని ఎన్‌ఎస్‌పీ అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాలేదు. వరదలు భారీగా వస్తాయన్న అంచనాతో క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగిస్తే స్పిల్‌వే మరింత దెబ్బతినే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని