
ప్రధానాంశాలు
ఉపకార వేతనాల్లో ఆలస్యం
బోధన రుసుములూ పెండింగ్లోనే..
రాష్ట్రంలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, బోధన ఫీజులు మరింత ఆలస్యం కానున్నాయి. సంక్షేమ శాఖలు నిధులు విడుదల చేసినప్పటికీ.. బిల్లులన్నీ ఖజానాలో నిలిచిపోయాయి. ఉపకార వేతనాలకు సెప్టెంబరులో, బోధన రుసుం (ట్యూషన్ ఫీజు)లకు అక్టోబరులో జారీచేసిన టోకెన్లకు నేటికీ చెల్లింపులు లేక బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులకు సంబంధించిన బోధన రుసుంలు అందలేదు. 2019-20 విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ రుసుంలు మంజూరు కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించి ద్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలని చెబుతున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ముగిసిన కొత్త దరఖాస్తుల గడువు
2020-21 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుంల దరఖాస్తు గడువు మార్చి 31తో ముగిసింది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రవేశాలు ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువును ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఇప్పటివరకు 12.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నవీకరణకు అర్హులైన విద్యార్థులు 7.99 లక్షల మంది ఉండగా.. 7.37 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 5 లక్షలకుపైగా ఉండగా.. 4.91 లక్షల మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు దరఖాస్తు సంఖ్యతో మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ ధ్రువీకరణ సకాలంలో చేసుకోవాలని అధికారులు సూచించారు.
రూ.800 కోట్ల బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం ఏటా గడిచిన విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, బోధన రుసుంలను ప్రస్తుత విద్యాసంవత్సరంలో చెల్లిస్తోంది. 2019-20 సంవత్సరానికి సంబంధించిన బకాయిలను 2021 మార్చి 31లోగా చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు 12.5 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తులు పరిష్కరించి.. బోధన రుసుంలు, ఉపకార వేతనాలకు రూ.2,250 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశాయి. ఇప్పటివరకు కేవలం రూ.1450 కోట్లు మాత్రమే చెల్లించాయి. ఇంకా రూ.800 కోట్ల బకాయిలున్నాయి. మంజూరు చేసినట్లు చూపించిన నిధుల్లోనూ ఉపకార వేతనాలు మాత్రమే చెల్లించాయి. బోధన రుసుంలు మంజూరైనట్లు చూపించినా కళాశాలల ఖాతాల్లో జమ కాలేదు. ‘‘2019-20 సంవత్సరానికి సంబంధించి బోధన రుసుంలు చెల్లించేందుకు కళాశాలకు సెప్టెంబరులో టోకెన్లు జారీ చేశారు. ఇప్పటికీ బ్యాంకుల్లో నిధులు జమ కాలేదు. ఉపకార వేతనాలూ చెల్లించలేదు. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా కుంగిపోయాం. నిర్వహణ ఖర్చులు భరించలేక బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన బోధన రుసుంలు విడుదల చేయాలి’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ కోరారు.
- ఈనాడు, హైదరాబాద్
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ