ఐరన్- ప్రత్యేక పోషకం
రక్తహీనత లేకపోయినా ఐరన్ లోపం గల పిల్లలు 71% మంది. అంటే దాదాపు మూడొంతుల మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారన్నమాట.
సూక్ష్మ పోషకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఐరన్ గురించే. మన శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అవసరం. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ ద్వారా అందుతుంది. హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ను మోసుకొచ్చే శక్తి ఎక్కడ్నుంచి వస్తుంది? ఐరన్ నుంచే! అంటే ఒకరకంగా మన శరీర భవనానికి ఇదే పునాది అన్నమాట. ఇంతటి కీలకమైన దీని గురించి, దీని ప్రయోజనాల గురించి మనకు అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐరన్ లోపం అనగానే రక్తహీనత ఒక్కటే గుర్తుకొస్తుంది. నిజమే, ఇది పెద్ద సమస్యే. మనదేశంలో ఐదేళ్ల లోపు పిల్లల్లో 58% మంది రక్తహీనతతో బాధపడుతున్నవారే. కణాల్లో శక్తి విడుదల కావటానికి సైటోకోమ్ ఆక్సిడేజ్ ఎంజైమ్ కావాలి. శక్తిని విడుదల చేసే ఏటీపీ మాలిక్యుల్ దీంతోనే తయారవుతుంది. ఐరన్ లోపిస్తే సైటోకోమ్ ఆక్సిడేజ్ ఎంజైమ్ సైతం తగ్గిపోతుంది. ఫలితంగా శక్తి విడుదల కాదు. దీంతో శరీర సామర్థ్యం, ఉత్సాహం సన్నగిల్లుతాయి. నీరసం, నిస్సత్తువ, మందకొడితనం ఆవహిస్తాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే- రక్తహీనత అనేది ఐరన్ లోపం చివరిదశలో మొదలయ్యే సమస్య. అంతకన్నా ముందే చాలా దుష్ప్రభావాలు పొడసూపుతాయి.
|
నిర్ధారణ ఎలా?
హిమోగ్లోబిన్ తగ్గటంతోనే కాదు. ఫోలిక్ యాసిడ్, రాగి, విటమిన్ బి6, బి12.. ఇలా దేని లోపంతోనైనా రక్తహీనత రావొచ్చు. అందువల్ల రక్తహీనత లక్షణాలు కనిపించినప్పుడు ఫెర్రిటిన్, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ (టీఐబీసీ) పరీక్షలు చేస్తారు. ఐరన్ లోపంలో ముందుగా తగ్గేది ఫెర్రిటిన్. ఆ తర్వాత టీఐబీసీ స్థాయులు పెరగటం ఆరంభిస్తాయి. చివర్లో హిమోగ్లోబిన్ మోతాదులు తగ్గుతాయి. ఫెర్రిటిన్ తక్కువుండి (డెసీలీటర్‌కు 12 నానోగ్రామ్‌ల కన్నా తక్కువ), టీఐబీసీ ఎక్కువుంటే (డెసీలీటర్‌కు 450 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ) ఐరన్ లోపం ఉన్నట్టే. విదేశాల్లో ఈ పరీక్షలను అందరికీ కచ్చితంగా చేస్తారు. మనదేశంలోనూ 9వ నెలలో అందరికీ ముందస్తుగా వీటిని చేయటం మంచిది.
|
చికిత్స- సిరప్, మాత్రలు, ఆహారం
ఐరన్ లోపానికి చికిత్స తేలికే. కావాల్సిందల్లా దీనిపై ఒకింత అవగాహన. ఐరన్ సిరప్ లేదా మాత్రలతో లోపాన్ని భర్తీ చేయొచ్చు. ప్రతి కిలో బరువుకు 6 మి.గ్రా. చొప్పున ఐరన్ ఇస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో పరీక్ష చేస్తూ.. లోపం పూర్తిగా భర్తీ అయ్యేవరకూ ఐరన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐరన్ నార్మల్ స్థాయికి వచ్చినా అదనంగా మరో మూడు నెలలు ఇవ్వాలి. ఇదొక్కటే కాదు, ఐరన్‌తో నిండిన పదార్థాలు ఇవ్వటమూ కీలకమే. తాజా ఆకుకూరలు, పండ్లు, ఎండు ఫలాలు, గింజ పప్పులు విధిగా తినేలా చూసుకోవాలి. ధాన్యాల మీది పొట్టులోనే సూక్ష్మపోషకాలు ఉంటాయి. బాగా పాలిష్ పట్టిన బియ్యం, గోధుమ పిండి వంటి వాటికి బదులు పొట్టుతీయని ధాన్యాలు వాడుకోవాలి. మాంసాహారులైతే మేక, గొర్రె కార్జం (కాలేయం) తినొచ్చు. ఇందులో ఐరన్ దండిగా ఉంటుంది.
|
నివారణ మన చేతుల్లోనే..
ఐరన్ లోపాన్ని సరి చేసుకున్నా దాని పర్యవసానాలు, ప్రభావాలు మున్ముందు కనిపిస్తాయి. అందువల్ల సమస్య రాకుండా చూసుకోవటంలోనే గొప్పతనముంది. గర్భిణులంతా ఐరన్, ఫోలిక్ యాసిడ్ విధిగా తీసుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులూ ఐరన్ తీసుకోవాలి. దీంతో పిల్లల్లో ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. గర్భిణికి ఐరన్ సమృద్ధిగా ఉన్నప్పుడు కడపులోని బిడ్డ దాన్ని గ్రహించి, కాలేయంలో దాచుకుంటుంది. ఇది పుట్టిన తర్వాత 3-6 నెలల వరకు ఉపయోగపడుతుంది. తల్లిపాలలో ఐరన్ ఉన్నా 3 నెలల తర్వాత అది సరిపోకపోవచ్చు. అందువల్ల తగినంత బరువుతో పుట్టినప్పటికీ.. పిల్లలందరికీ 3 నెలలు నిండగానే రోజూ ఐరన్ చుక్కల మందు ఇవ్వటం తప్పనిసరి. ప్రతి కిలో బరువుకు 1 మి.గ్రా. చొప్పున మూడు నెలల పాటు.. అంటే అదనపు ఆహారం మొదలెట్టేంతవరకు పట్టించాలి. అదే నెలలు నిండకముందే పుట్టినవారికైతే రెండో నెల నుంచే ఐరన్ ఆరంభించాలి. వీరికి ప్రతి కిలో బరువుకు 2 మి.గ్రా. చొప్పున ఆరు నెలలు నిండేంతవరకు ఇవ్వాలి. హిమోగ్లోబిన్ మోతాదులు నార్మల్‌గా ఉన్నా కూడా ఐరన్ చుక్కలు ఇవ్వాలి. దీంతో ఐరన్ లోపాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. ఏడాది వరకు ఆవు పాలు, గేదె పాలు పిల్లలకు ఇవ్వద్దు. వీటిల్లో ఐరన్ ఉండదు. పైగా ఇవి పిల్లల పేగులను దెబ్బతీయొచ్చు. అలర్జీలూ రావొచ్చు.
|
రక్తహీనతకు మించి..
ఒక్క హిమోగ్లోబిన్ తయారీకే కాదు.. మెదడు కణాల వృద్ధికి, మెదడు పరిమాణం పెరగటానికి, మెదడులో నాడీ సమాచార రసాయనాల ఉత్పత్తికి, నాడుల మీదుండే రక్షణ పొర ఏర్పడటానికీ ఐరన్ అత్యవసరం. ఐరన్ లోపం ఒకింతే ఉన్నప్పుడు మెదడు ఎదుగుదల కుంటుపడుతుంది, కాస్త ఎక్కువగా తగ్గితే ఒంట్లోని కణాల సామర్థ్యం సన్నగిల్లుతుంది. లోపం మరీ ఎక్కువైతే రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఐరన్ లోపంతో తలెత్తే ఇతరత్రా సమస్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. వీటిల్లో కొన్ని జీవితాంతమూ వెంటాడుతూ వస్తాయి మరి.
* మేధో శక్తి తగ్గటం: గర్భిణికి ఐరన్ లోపముంటే అది పుట్టబోయే పిల్లలకూ శాపంగా పరిణమిస్తుంది. మెదడు కణాలు సరిగా వృద్ధి చెందవు. నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే గాబా, అసిటైల్ కొలీన్, డోపమైన్ వంటి రసాయనాల ఉత్పత్తి, పనితీరు అస్తవ్యస్తమవుతాయి. మన మెదడులో దాదాపు 200 కోట్ల నాడీ కణాలుంటాయి. ఇవి ఒకదాంతో మరోటి అనుసంధానం కావటానికి ఐరన్ అత్యవసరం. లేకపోతే అనుసంధాన వ్యవస్థ దెబ్బతిని మేధో శక్తి సన్నగిల్లుతుంది. మెదడులో హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గటం వల్ల జ్ఞాపకశక్తి, తెలివి తేటలు (ఐక్యూ), విషయగ్రహణ సామర్థ్యం మందగిస్తాయి. * ఎదుగుదల ఆలస్యం: పుట్టిన తొలి ఏడాదిలోనే మెదడు చాలావరకు ఎదుగుతుంది. ఈ సమయంలో ఐరన్ లోపిస్తే మెదడుతో పాటు ఎదుగుదల దశలూ ఆలస్యమవుతాయి. పారాడటం, కూర్చోవటం, మాట్లాడటం, నిలబడటం వంటివి మందగిస్తాయి. చేత్తో రాయటం వంటి నైపుణ్యం గల పనుల్లో నిలకడ లోపిస్తుంది. కుదరు, స్థిరత్వం ఉండవు. దృశ్యాలుగా ఊహించుకోవటానికి వీల్లేని ఆలోచనలు దెబ్బతినటం వల్ల లెక్కలు చేయటంలో ఇబ్బంది పడతారు. * రోగనిరోధకశక్తి తగ్గుముఖం: ఐరన్ లోపిస్తే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాల వంటి వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. దీంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడుతుంటారు. * జ్వరంలో ఫిట్స్: ఐరన్ లోపం గల పిల్లల్లో మెదడు పనితీరు అస్తవ్యస్తం కావటం వల్ల జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. * తినకూడనివి తినటం: మట్టి, చాక్‌పీస్‌లు, బలపాల వంటి తినకూడనివి తినాలనే కోరిక (పైకా) పుట్టుకొచ్చే అవకాశముంది. ఇది పోషణ లోపం వంటి రకరకాల సమస్యలకూ దారితీసే ప్రమాదముంది. * ఊపిరి బిగపట్టటం: ఆరు నెలల నుంచి 3-4 సంవత్సరాల వయసు పిల్లలు ‘ఈ ప్రపంచానికి నేనే చక్రవర్తిని. నేను చెప్పినట్టే లోకమంతా వినాలి’ అని భావిస్తుంటారు. కొందరు ఊపిరి బిగపట్టి మరీ తడాఖా చూపించటానికి ప్రయత్నిస్తుంటారు. ముందు కావాలని ఊపిరి బిగపట్టినా కొద్దిసేపటి తర్వాత తమకు ఏమవుతుందనేది వారికి తెలియదు. తగినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల నీలంగా అయిపోతారు. కార్బన్ డయాక్సైడ్ మోతాదులు పెరుగుతున్నాయని గుర్తించి మెదడు శ్వాసకోశ వ్యవస్థను ప్రేరేపిస్తే గానీ శ్వాస తీసుకోలేరు. ఇలాంటి ధోరణి ఐరన్ లోపం గల పిల్లల్లో ఎక్కువ. * మొండితనం: యుక్తవయసులో చంచలత్వం ఎక్కువ. ఐరన్ లోపం గలవారికిది మరింత ఎక్కువ. నియమాలను పట్టించుకోరు. క్రమశిక్షణ పాటించరు. ప్రమాదాలను లెక్కచేయరు. కొందరు సిగరెట్లు, మద్యం, మాదక ద్రవ్యాల వ్యసనాలకూ లోబడొచ్చు. హింసాధోరణీ పెరగొచ్చు. లైంగిక కార్యక్రమాల్లోనూ పాల్గొనొచ్చు. * ప్రవర్తన సమస్యలు: భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం కొరవడొచ్చు. నేలకు తల బాదుకోవటం, కిందపడి పొర్లడం, మొండితనం, మాటిమాటికీ వస్తువులు విసిరేయటం వంటి పనులు చేయొచ్చు. ఐరన్ లోపం గల పిల్లలకు ఆటిజమ్ ముప్పూ ఎక్కువే. * జన్యు వ్యక్తీకరణ అస్తవ్యస్తం: జన్యువులు వ్యక్తం కావటంలో పరిసర వాతావరణ (ఎపిజెనెటిక్స్) ప్రభావమే ఎక్కువ. మంచి పోషకాహారం, సరైన వాతావరణం, జీవనశైలి వంటివన్నీ ఇందులో పాలు పంచుకుంటాయి. ఈ పరిసర వాతావరణ మార్పుల విషయంలో ఐరన్ కీలకపాత్ర పోషిస్తుంది. * కుదురు లేకపోవటం: ఐరన్ లోపం గలవారికి ఏకాగ్రతను దెబ్బతీసే అతి చురుకుదనం సమస్య (ఏడీహెచ్‌డీ) రావొచ్చు. దీంతో ఒక దగ్గర కుదురుగా కూర్చోరు.
|
పెద్దయ్యాకా వదలదు..
* నాడులు దెబ్బతినటం: చిన్నప్పుడు ఐరన్ లోపిస్తే నాడుల మీద రక్షణగా ఉండే మైలీన్ పొర సరిగా ఏర్పడదు. దీంతో నాడులు దెబ్బతింటాయి. దీని ప్రభావం పెద్దయ్యాకా కనిపిస్తుంది.
* మానసిక సమస్యలు: మెదడు ఎదగాల్సిన సమయంలో ఎదగకపోవటం వల్ల పెద్దయ్యాక అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటివి త్వరగా ముంచుకురావొచ్చు. స్కిజోఫ్రినియా, బైపోలార్ డిజార్డర్ సమస్యల ముప్పు పెరగొచ్చు. కుంగుబాటు బారినపడే అవకాశమూ ఉంది. ఆత్మహత్య ఆలోచనలూ వేధించొచ్చు. ప్రేమ, కరుణ, దయ, దాక్షిణ్యం, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు సైతం మారిపోవచ్చు. ఫలితంగా మొత్తం జీవితమే అస్తవ్యస్తమైపోతుంది. * నిద్ర సమస్యలు: చిన్నప్పుడు ఐరన్ లోపం వల్ల పెద్దయ్యాక నిద్ర సమస్యలు బయలుదేరొచ్చు. దీంతో కలత నిద్రతో సతమతమవుతుంటారు. * నిరంతర ఒత్తిడి: ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు రక్తంలోకి పెద్దఎత్తున అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది అక్కడ్నుంచి పారిపోవటానికి, లేదంటే ఎదిరించి పోరాడటానికి అవసరమైన శక్తి అందిస్తుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే ఐరన్ లోపం గలవారికి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అడ్రినలిన్ వంటి స్టిరాయిడ్ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కావు. దీంతో పారిపోవటం, పోరాడటం చేతకాదు. నిరంతరం ఒత్తిడి కొనసాగుతూ వస్తుంది.
|
ఇతర సూక్ష్మ పోషకాలు ఐరన్‌తో పాటు ఇతర సూక్ష్మ పోషకాలూ చాలా కీలకమే..
* కొలీన్: నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాల తయారీకి ఇది చాలా ముఖ్యం. * అయోడిన్: ఇది లోపిస్తే గాయిటర్, థైరాయిడ్ పనితీరు తగ్గటం, బుద్ధిమాంద్యం వంటివి తలెత్తుతాయి. అయోడిన్ ఉప్పు తీసుకుంటే వీటిని నివారించుకోవచ్చు. * జింక్: జన్యు వ్యక్తీకరణకు, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి, కణాల మరమ్మతుకు ఇది అవసరం. ఇది లోపిస్తే తెలివి తేటలు తగ్గొచ్చు, చర్మం మీద దద్దుర్లు, నోరు పొక్కటం తలెత్తొచ్చు. * విటమిన్ బి1: మనం తీసుకున్న పిండి పదార్థం శక్తిగా మారటానికిది తోడ్పడుతుంది. కండరాలు, నాడుల సంకోచ వ్యాకోచాలకు, మెదడుకు తగినంత గ్లూకోజు అందటానికి ఇది అవసరం. దీని లోపంతో నాడులు చచ్చుపడతాయి, మెదడు కణజాలం, గుండె కండరాలు దెబ్బతింటాయి. * విటమిన్ ఎ: దీన్ని అవయవాల్లోని పైపొరల (ఎపిథీలియల్) టానిక్ అనుకోవచ్చు. ఎందుకంటే నోరు, కళ్లు, పేగులు, శ్వాసకోశంలోని పొరలు దెబ్బతినకుండా కాపాడుతుంది మరి. అందుకే దీన్ని మ్యాజిక్ బుల్లెట్ అంటారు. పిల్లలందరికీ 9 నెలల వయసు నుంచి 2.5 సంవత్సరాలు వచ్చేవరకు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఎ మందు మోతాదు ఇవ్వాలి. * ఫోలిక్ యాసిడ్: ఇది లేకపోతే కణాలు వృద్ధి చెందవు. అందుకే గర్భధారణకు ప్రయత్నించటానికి ముందు నుంచే దీన్ని తీసుకోవాలి. ఇది లోపిస్తే పిల్లల్లో పుట్టుకతో వెన్ను, నాడుల లోపాలు, మెదడు సరిగా ఎదగకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. * విటమిన్ ఇ: కణజాలం క్షీణించకుండా కాపాడుతుంది. ఇది లోపిస్తే నడుస్తున్నప్పుడు తూలటం, నాడుల సరిగా పనిచేయకపోవటం వంటివి తలెత్తుతాయి. * రాగి: హిమోగ్లోబిన్ తయారీకిది తప్పనిసరి. ఎముకలు, కండర బంధనాలు, అనుసంధాన కణజాలం, రక్తనాళాలు, మైలీన్ పొర వృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే రక్తహీనత, ఆకలి తగ్గటం, తరచూ ఇన్ఫెక్షన్లు వేధించొచ్చు. * క్యాల్షియం: కండరాలు, ఎముకల దృఢత్వానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మెదడు కణాలు, నాడులు విస్తరించటానికీ ఉపయోగపడుతుంది. * విటమిన్ బి6: మెదడు వృద్ధి, రక్తం తయారీలో, 140 రకాల ఎంజైమ్‌ల పనితీరులో ఇది పాలు పంచుకుంటుంది. * విటమిన్ బి12: నాడుల మీది రక్షణ పొర తయారీకిది అవసరం. ఇది లోపిస్తే నాడీ సమస్యలు బయలుదేరతాయి. * విటమిన్ సి: కణజాల మరమ్మతులో, రక్తం తయారుకావటంలో, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటంలో ఇది పాలు పంచుకుంటుంది. విటమిన్ సి తక్కువగా గలవారికి మెదడు పరిమాణమూ తక్కువగా ఉండటం గమనార్హం. * విటమిన్ డి: ఇది కణాల వృద్ధికి, ప్రోటీన్ల తయారీకి, రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది.
|