close
ఎందుకంటే... ప్రేమంట!

కాలేజీలో ప్రేమలేఖలు రాయడం ఓ సరదా... రాయడం రాని వాళ్లకి రాసిపెట్టే దోస్తులూ చాలామంది ఉంటారు. ఇప్పుడు దాని కోసం సంస్థలే వెలుస్తున్నాయి. ఇక, ప్రేమికుల కోసమే పుట్టిన ఫ్యాషన్లూ, వాళ్లకే ప్రత్యేకంగా తయారవుతున్న బహుమతులూ, వీటితో పాటు బోలెడు ప్రేమ కబుర్లూ... ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...


ప్రేమలేఖలూ రాసిపెడతారు

మనం ఎన్నో ప్రేమకథల పుస్తకాలు చదివి ఉంటాం. వేటికవే భిన్నంగానూ అందంగానూ ఉంటాయి. ఇలా, ఎన్ని కథలు చదివినా ఎవరి ప్రేమ కథ వాళ్లకి ముచ్చటగా ఉంటుంది. ఆ విషయాన్ని పసిగట్టే కొన్ని వెబ్‌సైట్లు ప్రేమికుల కథల్ని పుస్తకాలుగా అచ్చేస్తున్నాయి. మైలవ్‌స్టోరీబుక్‌.కామ్‌, లవ్‌బుక్‌ఆన్‌లైన్‌.కామ్‌, హార్ట్‌ఫెల్ట్‌బుక్స్‌.కామ్‌... తదితర వెబ్‌సైట్లు ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో మన కథను క్లుప్తంగా రాయొచ్చు, లేదా వాళ్లు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలను వివరంగా చెప్పొచ్చు. వాటన్నింటినీ ఒక చోట చేర్చి మనం కోరుకున్న ఫొటోలూ, బొమ్మలతో అందంగా పుస్తకాన్ని తయారుచేసిస్తాయి ఈ వెబ్‌సైట్లు. ఇక, మనసులో ఎంతో ప్రేమా, ప్రియమైన వారితో ఎన్నో భావాలు పంచుకోవాలన్న ఆశా ఉన్నా వాటికి ప్రేమలేఖల రూపాన్ని ఇవ్వలేకపోతారు కొందరు. అలాంటి వారి కోసం పర్సనలైజ్డ్‌ లవ్‌లెటర్లను రాసిపెడుతున్నాయి కొన్ని సంస్థలు. మనకూ మన ప్రేయసి లేదా ప్రియుడికి మధ్య ఉన్న జ్ఞాపకాలూ, వాళ్ల పట్ల మన భావనలనూ, ప్రేమలేఖ రాస్తున్న సందర్భాన్నీ వీళ్లకి చెప్పామంటే అందమైన చేతి రాతతో మన ఆలోచనలను ప్రేమలేఖ రూపంలో మలిచి అందిస్తారు. రైటర్స్‌పర్‌అవర్‌.కామ్‌, ద ఇండియన్‌ హ్యాండ్‌ రిటెన్‌ లెటర్‌ కంపెనీ (www.tihlc.com) లాంటి సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటి సాయం ఉంటే, ప్రేమలేఖ రాసేయడం ఎంత ఈజీనో కదూ!


పెదవి సంతకం చేసేయండి...

ప్రేమ ఓ మైకం. అందులో ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. ఇక, ప్రేయసి అధరాలంటే... ఎవ్వరికైనా అద్భుతమే. ప్రేమికుల మధ్య తిరిగే ప్రేమలేఖలు జీవితాంతం నిలిచిపోయే తియ్యని గుర్తులు. ఆ మధుర జ్ఞాపకాలకి అధర సంతకమూ జోడయితే... ఆ ప్రేమలేఖ అందుకున్న ప్రియుడి ఆనందానికి అవధులుండవు మరి. అలాంటి అనుభూతిని ఎదుటి వారికి కలిగించేలా ప్రియమైన వాళ్లకి పంపే ప్రతి కాగితం మీదా పెదవుల ముద్ర వేసేందుకు తయారవుతున్నాయి పర్సనలైజ్డ్‌ లిప్‌స్టాంపులు. మీకూ ఈ స్టాంపులు కావాలనుకుంటే స్పష్టంగా పెదవులు కనిపించేలా ఫొటో తీసి ఈ అచ్చుల్ని తయారుచేసే ఆన్‌లైన్‌ సంస్థలకు పంపితే సరి. ఇక, వీటితో పాటు వచ్చే ప్యాడ్‌ సాయంతో కాగితాలూ లేదా కర్చీఫ్‌ల లాంటి వాటి మీద మామూలు స్టాంపుతో అచ్చు వేసినట్టు అధరాల అచ్చూ వేసేయొచ్చు.


చిరకాల ప్రేమకు చిరునామా

అందమైన హంసలు హృదయాకృతిని ఎంత చక్కగా ఆవిష్కరించాయో కదూ! రొమాన్స్‌లో భాగంగా హంసలు ఒకదాని పట్ల మరొకదాని ఇష్టాన్ని తెలుపుకునేందుకు ఇలా ఎదురెదురుగా వచ్చి తలలు వంచి ముక్కుల్ని ఆన్చి నిలుచుంటాయట. ఈ హంసల్లో చాలా రకాలు జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉంటాయి. అంతేకాదు, రెండింటిలో ఏది చనిపోయినా రెండోది ఎక్కువ రోజులు బతకదట, దిగులుతో కొద్దిరోజుల్లోనే చనిపోతుందట. అందుకే హంసలను ప్రేమకు గుర్తుగా చెబుతారు.


సీసా నిండా ప్రేమే!

సీసా నిండా నీళ్లో, జ్యూసో పోయడం తెలుసుగానీ... ప్రేమతో నిండిన సీసాను మీరెప్పుడైనా చూశారా! పర్సనలైజ్డ్‌ ఎల్‌ఈడీ బాటిల్‌ ల్యాంపులు అచ్చం అలాంటివే. ఈ గాజు సీసాలోపల ఎల్‌ఈడీ బల్బులుండే తీగ ఉంటుంది. సీసాపైన మనకిష్టమైన వాళ్ల ఫొటో వేయించుకోవచ్చు, నచ్చిన సందేశాన్ని రాయించుకోవచ్చు. బాటిల్‌ మూతకు ఉంచే చిన్న బటన్‌ ఆధారంగా బ్యాటరీతో పనిచేసే ఈ లైట్లను వేయడం ఆపడం చేయొచ్చు. ప్రేమజంటలు వీటిని అందమైన కానుకగా ఇచ్చిపుచ్చుకుంటున్నాయిప్పుడు.


గుండె గులాబీ...

ప్రేమికుల దినోత్సవం అనగానే ముందుగా గుర్తొచ్చేవి గులాబీలే. ఎదుటివారి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేయాలనుకునే వాళ్లెవరైనా ముందుగా ఇచ్చేది వీటినే. కానీ ఆ రోజా ఒక్కరోజులో వాడిపోకుండా ఏళ్లతరబడి దాచుకోగలిగేలా ఉంటే ఎంత బాగుంటుందో కదూ! ఇదిగో ఈ ప్రిజర్డ్వ్‌డ్‌ హార్ట్‌ షేప్డ్‌ రోజెస్‌ అలాంటివే. అందమైన పెద్ద గులాబీలను తీసుకుని వాటిని గ్లిజరిన్‌, పోషకాల ద్రావణాల్లో ముంచి ఉంచడంలాంటి కొన్ని ప్రత్యేక పద్ధతులనుపయోగించి వాటిని ఎక్కువకాలం తాజాగా ఉండేలా చేస్తారు. ఇక పువ్వు రేకల అమరికను మారుస్తూ తయారు చేసే ఈ హృదయాకార గులాబీలు యువత మనసును బాగా దోచేస్తున్నాయి.


హృదయం ఇక్కడున్నదీ...

ఫ్యాషన్‌ ప్రపంచం ఎప్పుడూ యువత చుట్టూనే తిరుగుతుంటుంది. ఇక, వాళ్లకిష్టమైన వాలంటైన్స్‌డే వస్తోందంటే దానికోసమంటూ ప్రత్యేకంగా కొత్త రకాన్ని సృష్టించకుండా ఎందుకుంటుంది. అందుకే ఫిబ్రవరి14 అనగానే గుర్తొచ్చే హృదయాకారాన్ని చొక్కాలూ, ప్యాంట్లూ, బూట్లూ, బ్యాగులూ.... ఇలా అన్నింటి మీదా ముద్రించేసి ఎప్పటిలాగే కుర్రకారును తన చుట్టూ తిప్పుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బట్టలూ, యాక్సెసరీల మీద కనిపించేవన్నీ ప్రేమికుల దినోత్సవం వచ్చిందనడానికి గుర్తులే! నచ్చిన వారిపై ప్రేమను ఇవి ధరించి చెప్పకనే చెప్పొచ్చు!


ప్రేమ ముచ్చట్లు!

ప్రేమ గురించి మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు...
* అమ్మాయి నచ్చితే అబ్బాయిలు వెంటనే నిటారుగా నిలబడటం, ఫిట్‌గా కనిపించేలా ప్రవర్తించడం చేస్తారట. అచ్చం మెన్‌ విల్‌ బి మెన్‌ ప్రకటనల మాదిరిగానే!
* అవతలి వ్యక్తి మీకు నచ్చారో లేదో ఆలోచించి మీ మెదడు 4 నిమిషాల్లోనే ఓ నిర్ణయానికొచ్చేస్తుంది!
* కొత్త పరిచయాల్లో ఏదో తెలియని తత్తరపాటు వస్తుంటుంది కదా... దానికి కారణం శరీరంలోని కార్టిసాల్‌ అనే రసాయనం.
* కొంతమందికి ప్రేమ అంటే విపరీతమైన భయం ఉంటుంది... దాన్నే ఫైలోఫిబియా అంటారు. కొందరు ఏం చేసినా ప్రేమ భావనను ఫీల్‌ కాలేరట... దీన్ని హైపోపిట్యూటరిజం అంటున్నారు.
* కారణాలేంటో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా కనుక్కోలేదు కానీ... అమ్మాయిలు ఎరుపురంగు దుస్తుల్లో ఉన్నప్పుడు అబ్బాయిలు వారితో గాఢమైన సంభాషణలకు దిగుతారట. చీరైనా చుడీదారైనా ఇది మాత్రం మారదు.
* డ్రగ్స్‌ వాడితే మెదడు ఎలా ప్రభావితమవుతుందో ప్రేమలో పడినప్పుడూ అలాగే అవుతుందట. అడ్రినలిన్‌, డోపమైన్‌, వాసోప్రెసన్‌ వంటి హార్మోన్ల విడుదలే ఇందుకు కారణం.
* మనసుకు నచ్చిన వారిని గాఢంగా హత్తుకుంటే ఒంట్లో నొప్పులు తగ్గిపోతాయంటున్నారు పరిశోధకులు. వారి ఫొటోను చూసినా సరే... ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* హృదయం ఓర్చుకోలేనిదీ గాయం... అని పాడుతుంటారు కదా! అది నిజమే. ఇష్టమైన వాళ్లు దూరమైతే గుండె బద్దలైనంత పనవుతుందట. దీనికే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అని పేరు.
* మనస్ఫూర్తిగా ఇష్టపడేవారిలో శరీరాకృతి కంటే ముఖం అందానికే ప్రాధాన్యం ఇస్తారట చాలామంది.
* అమ్మాయిలకు తమ ప్రియుడి ఎదురుగా కూర్చుని, కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడితే నచ్చుతుందట. అదే అబ్బాయిలైతే పక్కపక్కన కూర్చుని మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.