close

అది... ఓ అగ్నిభూమి!

అడుగడుగునా చమురు నిల్వలతోనూ వేల ఏళ్లనాటి మనుషుల జాడలతోనూ సముద్రమట్టానికన్నా కిందకి నిర్మించిన నగరంతోనూ పచ్చని పర్వతాలతోనూ నిండిన అరుదైన ప్రదేశమే అజర్బైజాన్‌... అగ్నిభూమి. అగ్నినే పూజిస్తూ అగ్నికీలల్నే ప్రగతి చిహ్నాలుగా భావించే ఆ నేలమీద పర్యటించాం’ అంటూ ఆ దేశ విశేషాలను చెప్పుకొస్తున్నారు దుబాయ్‌ నివాసి వేమూరి రాజేష్‌.

జర్బైజాన్‌... భూమి నిండా చమురు నింపుకున్న దేశం. సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన ఆ దేశాన్ని చూడాలని దుబాయ్‌ నుంచి బయలుదేరాం. విమానం కాస్పియన్‌ సముద్రం ఒడ్డున ఉన్న బాకూ నగరానికి చేరుకుంది. సముద్రమట్టానికి 92 అడుగుల కిందకి ఉన్న రాజధాని బాకూ ఒక్కటే. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. హైదర్‌ అలియెవ్‌ ఎయిర్‌పోర్టులో దిగి, కౌంటర్‌లో పాస్‌పోర్టులు చూపించి పేరు రిజిస్టర్‌ చేయించుకుని వీసా తీసుకున్నాం. దుబాయ్‌లో నివాస వీసా ఉన్నవాళ్లకి చాలా దేశాలకి నేరుగా వెళ్లి అక్కడి ఎయిర్‌పోర్టులో వీసా తీసుకునే సదుపాయం ఉంటుంది. ట్రావెల్‌వాళ్లు పంపిన వ్యక్తితో పార్కింగ్‌ బయటకు రాగానే బూటా ప్యాలెస్‌ అనే భవంతి కనిపించింది.

బూటా అంటే అగ్ని అనీ అదో సంస్కృతశబ్దం అనీ తెలుసుకున్నా. అజర్బైజాన్‌ అన్నా అగ్నిభూమి అనే అర్థం. ఎక్కడికక్కడ మంటలు మండుతూ ఉండటంతో ఆ దేశానికి ల్యాండ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పేరు. చమురు వాడకం తెలియని రోజుల్లో- అక్కడి నేలలోంచి వచ్చే వాయువు ఆక్సిజన్‌తో కలిసి మండుతుండేదట. ఆ ప్రాంతానికి ముందుగా వచ్చిన జొరాస్ట్రియన్లు ఆ మంటనే దేవుడిగా నమ్మి పూజించారట. తరవాత అరబ్బులూ, పర్షియన్లూ, హిందువులూ ఈ దేశానికి వచ్చారట. నగరంలో ఎత్తైన ఆకాశహర్మ్యాలతోబాటు పురాతన శైలిలోనే కట్టిన కొత్త భవంతులూ ఉన్నాయి. 12వ శతాబ్దంలో ఐరోపా వాస్తు శైలిలో నిర్మించిన ఈ నగరాన్ని నేటికీ అలాగే పరిరక్షిస్తున్నారు. అక్కడ ఉన్న కొన్ని హోటళ్లకీ రెస్టరెంట్లకీ మాత్రమే పర్యటకుల్ని అనుమతిస్తారు. మేం బాకూ పాత నగరం చూడ్డానికి బయలుదేరాం. అందులోకి వెళ్లాలంటే రెండు మనాత్‌లు(ఒక్క మనాత్‌కి మన కరెన్సీలో 42 రూపాయలు)చెల్లించాలి. నగరం లోపల నివసించేవాళ్లకి గుర్తింపు కార్డు ఉంటుందట. అవి కట్టి లోపలకు వెళితే ఏ రాజ్యంలోకో వెళ్లిన అనుభూతి. మేం పాతనగరంలోని హోటల్లోనే దిగాం. దాని పేరు అట్రోపాట్‌, అంటే- అగ్ని రక్షించే ప్రాంతం అని అర్థమట. అక్కడ రాత్రి ఎనిమిది గంటలకి గానీ చీకటి పడదు. దాంతో కాస్త ఫ్రెష్‌ అయి చుట్టుపక్కల చూద్దామని బయటకు రాగానే మా అబ్బాయి ఆనందానికి అంతులేదు... అక్కడి వీధుల్లో ఎటుచూసినా పిల్లులే మరి. అలా నడుస్తూ మెయిన్‌రోడ్డుకి చేరుకున్నాం. అక్కడే మెయిడెన్‌ టవర్‌ పేరుతో ఓ బురుజు ఉంది. దీన్ని జొరాస్ట్రియన్ల ఫైర్‌టెంపుల్‌ అని చెబుతారు. స్వర్గానికి వెళ్లడానికి ఏడు దారులు ఉంటాయని ఆ మతంలో చెప్పినట్లే ఇందులోకి వెళ్లేందుకు ఏడు దారులు ఉన్నాయి.

స్కర్టులాంటి భవంతి!
తినడానికి నేలమాళిగలో ఉన్న హోటల్‌కి వెళ్లాం. అందులో కూర్చుని తింటుంటే ఓ 500 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లే అనిపించింది. మర్నాడు ఉదయాన్నే నయా బాకూ నగరానికి బయలుదేరగా పెట్రోల్‌కోసం కారు ఆపాడు డ్రైవర్‌. అక్కడ లీటరు పెట్రోలు 90 పైసలు(వాళ్ల కరెన్సీలో). అక్కడ పైసల్ని గపిక్‌లు అంటారు. 90 గపిక్‌లంటే మన కరెన్సీలో సుమారు రూ.38. అక్కడి నుంచి బాకూ సింబల్‌ దగ్గరకు వెళ్లాం. దాని వెనకాలే హైదర్‌ అలియెవ్‌ సెంటర్‌ ఉంది. చాలామంది ఈ భవనం చూడ్డానికే వస్తారట. 2012లో ప్రారంభమైన ఈ భవనం పై నుంచి చూస్తే ఆ దేశ తొలి అధ్యక్షుడు హైదర్‌ అలియెవ్‌ సంతకంలానూ ఓ పక్క నుంచి మార్లిన్‌ మన్రో స్కర్టులానూ కనిపిస్తుంది. మరోపక్క నుంచి హృదయాకారంలా ఉంటుంది. బాకు ఐ అని పిలిచే అతిపెద్ద జెయింట్‌ వీల్‌ దగ్గరకు వెళ్లి, సిడ్నీ ఒపెరాహౌస్‌లా కట్టిన షాపింగ్‌ మాల్‌లో కాసేపు తిరిగాం. బాకూ నగరం మొత్తం సముద్రపు ఒడ్డునే ఉంది. ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒకచోట కలుస్తాయి కానీ ఎక్కడా కలవని సముద్రం కాస్పియన్‌ ఒక్కటే. అందుకే దీన్ని సరస్సు అంటారు. దీనికి నీళ్లు లోపలకు వచ్చే మార్గం ఉంది కానీ బయటకు వెళ్లే మార్గం లేదు.

ఇరవై వేల ఏళ్ల నుంచీ...
తరవాతి రోజు గోబస్టన్‌ జాతీయ వనానికి బయలుదేరాం. రోడ్డుకిరువైపులా ఉన్న మైదానాల్లో ఆయిల్‌ డ్రిల్లింగ్‌ పంపులు వేలల్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ నేలలో నీళ్లు ఉండవట. తాగేనీరు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తెప్పిస్తారట. బాకూ అంతా పొడిగా ఉంటే, గబాల మాత్రం పచ్చని కొండలతో జలపాతాలతో అందంగా ఉంది. గంట తరవాత గొబస్టన్‌కి చేరుకున్నాం. ఇక్కడున్న కొండ గుహల్లో 20 వేల ఏళ్ల నాటి మనిషి పరిణామక్రమానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి. అక్కడున్న మ్యూజియంలో టెక్నాలజీ సాయంతో ఆ కాలంలో ఉన్నట్లే పరిసరాల్ని సృష్టించారు. ఓ బటన్‌ నొక్కితే 20 వేల ఏళ్లలో ఆ ప్రాంతం ఎలా మార్పు చెందిందో తెలుస్తుంది. ఒకప్పుడు ఇదంతా అడవి ప్రాంతం. కాస్పియన్‌ సముద్రంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా బీడులా మారిపోయింది. తరవాత కొండపైన ఉన్న ప్రదేశానికి వెళితే, అక్కడ ఐదువేల ఏళ్ల క్రితం మనుషులు నివసించిన గుర్తులు ఉన్నాయి. కొండరాళ్లమీద ఎద్దు, దున్న.. వంటి జంతువుల బొమ్మల్ని చెక్కారు. సంతానం కలగకపోతే ఒక రాయి రంధ్రంలోంచి దూరి వెళ్లడం, బలి ఇచ్చిన రక్తం నింపడం కోసం తవ్విన గోతులూ ఇంకా అక్కడ ఉన్నాయి. ఒకప్పుడు సముద్రం ఈ కొండల ఎత్తులో ఉండేదట. రాళ్లన్నీ ఉప్పులో ఉండటంవల్ల పెళుసుగా మారాయి. సముద్రం కిందకి వెళ్లాకే మనుషులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారట.

బురద పర్వతం!
తరవాత మట్టి అగ్నిపర్వతాల దగ్గరకు వెళ్లాం. చమురూ మట్టీ నీళ్లూ కలిసిన బురద అక్కడి గుంతల్లోనుంచి పైకి ఉబుకుతూ వస్తోంది. అందులో ఔషధగుణాలు ఉంటాయని చాలామంది స్నానం చేస్తారట. చమురు పరిశ్రమకోసం పునాది పడిందీ తొలి చమురుబావిని తవ్విందీ ఇక్కడేనట. తరవాత హైదర్‌ అలియెవ్‌ సైన్స్‌ సెంటర్‌ చూసి, బాకూ నగరంలోని ఫౌంటెయిన్‌ స్క్వేర్‌ దగ్గరకు వెళ్లాం. ఇక్కడ కళ్యాణ్‌రామ్‌ ‘ఎంఎల్‌ఏ’ సినిమాలోని పాట తీశారు. తరవాతిరోజు గబాలకి బయలుదేరాం. ఆ దారి అంతా కొండలే. ‘వినయవిధేయరామ’లో బీహార్‌ సీన్‌ ఇక్కడే తీశారట.

ఇస్మాయిలి ప్రాంతంలో ఉన్న గబాల పచ్చదనంతో కళకళలాడుతుంది. గబాలలో దానిమ్మ తాండ్ర కొనుక్కుని 7గోజెల్‌(అంటే- ఏడు చోట్ల నిలబడి చూసే ప్రవాహం అని అర్థం)అనే జలపాతం దగ్గరకు వెళ్లాం. అక్కడినుంచి గబాల పర్వతం దగ్గరకు వెళ్లేసరికి మేఘాల్ని తాకుతున్న పచ్చని ఎత్తైన పర్వతాలూ పంటపొలాలూ పండ్ల తోటలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అక్కడి కేబుల్‌ కార్లలో ఎత్తైన ప్రదేశానికి వెళ్లాం. అక్కడ మన తెలుగువాళ్లు కనిపించారు. చమురు తరవాత వీళ్ల ప్రధాన ఆదాయం వ్యవసాయమే. అరటి, నారింజ తప్ప మిగిలిన పండ్లూ కూరగాయలన్నీ పండుతాయి. చిత్రమేమిటంటే వీళ్ల టొమాటోలు రష్యాకి ఎగుమతి చేసి, టర్కీ నుంచి తక్కువ ధరకి టొమాటోల్ని దిగుమతి చేసుకుంటారట.

24 గంటలూ గణపతి ప్రార్థన!
తరవాత అటెష్‌గా అని పిలిచే హిందూ దేవాలయం చూడ్డానికి బయలుదేరాం. గుడి ప్రవేశద్వారం మీద రాతిశాసనాలు హిందీలో ఉన్నాయి. లోపలున్న మండపంలో ఎత్తైన రాతి దిమ్మమీద మంట కనిపించింది. కొన్ని వేల ఏళ్లపాటు మండిన ఈ మంట తరవాతి కాలంలో గ్యాస్‌ అయిపోవడంతో ఆగిపోగా, ప్రస్తుతం ఉన్న మంటని ప్రభుత్వమే కృత్రిమంగా ఏర్పాటుచేసింది. రెండో శతాబ్దంలో ఇక్కడ మండుతున్న మంటల్ని చూసి జొరాస్ట్రియన్లు మందిరం కట్టి పూజించగా తరవాతికాలంలో హిందువులు ఆలయంగా మలిచారట. ఒకప్పటి సిల్కురోడ్డు ఈ పక్కనుంచే వెళ్లడంతో భారతీయ వర్తకులు ఈ దారిగుండా వెళుతూ దీన్ని సత్రంలా వాడుకునేవారట. అక్కడ ఉన్న గదుల్లో అన్నీ మన వస్తువులే ఉన్నాయి. చూస్తుండగానే అక్కడికి మూడు బస్సులనిండా భారతీయ యాత్రికులు వచ్చారు. ముస్లిం దేశమే అయినప్పటికీ అక్కడ 24 గంటలూ గణపతి స్తోత్రం వినిపించే ఏర్పాటుచేయడం విశేషం.

తరవాత యానర్‌డాగ్‌ అగ్నిపర్వతానికి వెళ్లాం. అక్కడ 20 వేల ఏళ్ల నుంచీ అగ్ని మండుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని ఆర్పడానికి ప్రయత్నించినా ఇది ఆగలేదట. ఇలాంటిదే మరో పర్వతం కూడా ఉంది. కానీ అక్కడ మంట ఆగిపోయిందట. ఈ మూడు పర్వతాలకి చిహ్నంగా బాకు నగరంలో మంట ఆకారంలో కనిపించే మూడు కట్టడాలని నిర్మించారు. ఈ మూడింటినీ ఆ దేశ ప్రగతికి చిహ్నాలుగా భావిస్తారు. ఆధునికతనీ పురాతన సంస్కృతినీ సొంతం చేసుకున్న ఓ దేశాన్ని చూసిన ఆనందంతో వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.