close

అమ్మాయి మెడలో... అందాల నావ..!

అందంగా నగలను తీర్చిదిద్దే కళా, ఆ ఆభరణాలకే వన్నె తెచ్చే మెడా... ఉండాలేకానీ నావలూ చూడచక్కని నగలుగా మారిపోతాయి. మన కథల్లో కనిపించే యువరాజూ, యువరాణీ ప్రయాణించే హంసనావలు ఇదిగో ఇలా ముచ్చటైన లాకెట్లుగా మెడలో ఒదిగిపోతాయి. రత్నాలూ, వజ్రాలూ పొదిగి రాజసానికే రాజసం తెచ్చేలా కనిపిస్తున్న షిప్‌ జ్యువెలరీ నేటితరానికి నయాట్రెండ్‌.

నౌకలంటే మనకు జనం ప్రయాణించేవే తెలుసు. అలా మనుషులతో పాటు అప్పట్లో వజ్రాలూ, రత్నాలూ రాశులుగా తరలుతుండేవనీ చరిత్రలో చదివాం. కానీ ఆ రత్నాలతోనే నావలను అలంకరిస్తే... ఆ అందమైన నావలను అమ్మాయి మెడలో ఆభరణంగా మారిస్తే... ఎంత బాగుంటుందో కదూ... అన్న ఆలోచన ఏ సృజనకారుడి మదిలో మెదిలిందో కానీ చూడగానే కళ్లను కట్టిపడేసేలా ముచ్చటైన షిప్‌ జ్యువెలరీ ముస్తాబయింది. కథల్లో ఉండే అందాల హంసనావలా కనిపించే ఇవి అమ్మాయిల మనసుకి లంగరేసేస్తున్నాయిప్పుడు. మామూలుగా మనం చూసే పల్చటి లాకెట్లలా కాకుండా త్రీడీ లాకెట్ల తరహాలో ఈ షిప్‌ లాకెట్లు తయారవుతున్నాయి. అంటే మనం ఎటు వైపు నుంచి చూసినా అచ్చంగా ఒక పడవనే నేరుగా చూస్తున్న అనుభూతిని కలిగించేలా వీటిని రూపుదిద్దుతున్నారు. తెరచాపలుండే పడవల్లాగా, అంతస్తుల్లో కనిపించే ఓడల్లాగా, చూడచక్కగా ముస్తాబు చేసిన నావల్లాగా ఇవి తయారవుతున్నాయి. అంతేకాదు, మనుషులు పడవ నడుపుతున్నట్టూ, లోపల కూర్చున్నట్టూ, నౌక అంచున నిలుచుని బయటికి చూస్తున్నట్టూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నట్టూ... ఇలా రకరకాల బొమ్మలూ వీటిలో కనిపిస్తాయి. పచ్చలూ, కెంపులూ, వజ్రాలూ, విలువైన రకరకాల రత్నాలను పొదిగి ఎనామిల్‌ హంగులద్దుకుని వస్తున్న వీటికి కిందివైపు వేలాడే ముత్యాలు అదనపు ఆకర్షణను తీసుకొస్తున్నాయి. అచ్చంగా బంగారంతో చేసినవీ వీటిలో తయారవుతున్నాయి. సల్వార్లూ, జీన్సూ టాపులతో పాటు చీరల మీదకీ ఈ తరహా జ్యువెలరీ చక్కగా నప్పుతుంది. ఇటు సంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్‌లుక్‌ కూడా జతవ్వాలనుకునే వాళ్లకి ఇవి మంచి ఎంపిక. నిజానికి దాదాపు 16 నుంచి 19వ శతాబ్దాల్లోని రాణుల మెడల్లో ఈ తరహా నగలు కనిపించేవట. అప్పట్లో ఓడల ద్వారా జరిగే వ్యాపారాన్నీ, దాని అభివృద్ధినీ సూచించేందుకు వీళ్లు ఇలా నౌకల బొమ్మల్ని హారాల్లో పతకాలుగా ధరించేవారు. అవి చూడగానే ఆకర్షణీయంగా, సాధారణానికి భిన్నంగా కొత్తగా ఉండటంతో డిజైనర్ల దృష్టి వీటిమీద పడింది. అచ్చంగా ఊహాలోకం నుంచి తీసుకొచ్చి పెట్టినట్టు ఉన్న ఈ నౌకల నగలు చూస్తుంటే బాహుబలిలో దేవసేనలాగా ‘హాయైన హంసనావలోనా...’ అని పాడుకోవాలని మీకు మాత్రం అనిపించట్లేదా చెప్పండి..!


వరమాల... నచ్చిన డిజైన్‌లో..!

‘రఘువంశరామయ్య...సుగుణాల సీతమ్మ... వరమాలకై వేచు సమయాన...’అంటూ పెళ్లిళ్లలో వరమాల ప్రాధాన్యం చెప్పాడో సినీ కవి. అనాటి రామయ్య కాలం నుంచీ ఈనాటి స్మార్ట్‌ యుగం వరకూ వరమాల లేని పెళ్లి తంతుని ఊహించలేం. అందుకు తగ్గట్టుగానే ఆ పూలదండలు అప్‌డేట్‌ అవుతూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముస్తాబై వధూవరులకు కొత్తకళ తీసుకొస్తున్నాయి.

ఈ కాలం యువత పెళ్లిని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు.

నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్‌ వరకూ ప్రతి ఘట్టాన్నీ ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. వీటిలో చెప్పుకోదగింది పూలదండలు మార్చుకునే తంతు. సిగ్గుల మొగ్గవుతూ వరుడి మెడలో మాల వేయడానికి వధువు సిద్ధమైతే... ఆమెని ఆట పట్టిస్తూ మాల వేయనీయకుండా అతని స్నేహితులూ బంధువులూ పెళ్లి కొడుకును వెనక్కి లాగడం, అందకుండా ఎత్తుకోవడం వంటివి చేస్తుంటారు.  వధువు తరపు బంధువులు కూడా... వరుడు మాల వేయకుండా ఆటపట్టిస్తూ వివాహ వేడుకను మరింత సంబరంగా మార్చేస్తున్నారు. అందుకే పెళ్లిలో అంత ప్రాధాన్యమున్న వరమాలను సాదాసీదాగా కాకుండా కస్టమైజ్డ్‌ తరహాలో ఎంచుకుంటున్నారు.

దండలే ప్రధానం....
పెళ్లిలో ప్రధానమైన ఆ దండల ప్రస్తావన ఈనాటిది కాదు.  రాముడు శివధనుస్సు విరవగానే సీతమ్మ ఆ దండతోనే రాముడిలో భాగమైంది. ద్రౌపది కూడా స్వయంవరంలో అర్జునుడిని వరమాలతోనే వరించింది. దీన్నే జైమాల అని కూడా పిలుస్తారు. ఏ పేరుతో పిలిస్తేనేం, ఆ పూలదండలు ఆనాటి నుంచి ఈనాటి వరకూ పెళ్లిలో ముఖ్యభాగమయ్యాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం అయితే దండలు మార్చుకోవడమే అసలైన పెళ్లిగానూ భావిస్తారు. హిందూ సంప్రదాయంలో నిశ్చితార్థంలో పూలదండలు మార్చుకుంటే సగం పెళ్లైందని చెబుతారు. ఆ దుస్తుల్లో దండలు ధరించిన వధూవరులు సాక్షాత్తూ దేవతా మూర్తుల్లానే కనిపిస్తారు. వారికి ఆ నిండుదనం, పరిపూర్ణత్వం తీసుకొచ్చేది వరమాలలే.

సాధారణంగా గులాబీలూ, మల్లెలు, చామంతులూ, లిల్లీలు, టెంకీస్‌తో దండలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆర్కిడ్లూ, హైబ్రిడ్‌ గులాబీలూ, కార్నేషన్స్‌, తామర మొగ్గలూ, కలువ పూల వంటివీ వచ్చి చేరాయి. వేదిక అలంకరణా, వధూవరుల దుస్తుల రంగూ, వధువు పూలజడకు తగ్గట్టుగా వారివారి అభిరుచులకు అనుగుణంగానూ రకరకాల పూలతో వరమాలను డిజైన్‌ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా ఒకే రకం పూలతో దండల్ని గుచ్చడం, అచ్చంగా పూరేకులతో మాల అల్లడం, రంగుల మేళవింపుకోసం పలు రకాల పూలను దండలో జత చేయడం వంటివి చేస్తున్నారు. కొన్నిసార్లు పూలకు కృత్రిమ రంగుల్నీ స్ప్రే చేసి కొత్త వర్ణంలోకి మార్చేసి ఎంతో అందంగానూ మరింత విభిన్నంగానూ దండల్ని రూపొందిస్తున్నారు. పూల మార్కెట్లతోపాటు పలు ఆన్‌లైన్‌ సంస్థలు కూడా ఇప్పుడు కస్టమైజ్డ్‌ వరమాలల్ని తయారుచేసి ఇస్తున్నాయి. మరి మీకు నచ్చిన దండను డిజైన్‌ చేయించుకోవడమే ఆలస్యం.
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.