close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టిఫినేం చేస్తారు?

పేరుకు అల్పాహారమే అయినా... టిఫిన్‌ ఇచ్చే ఎనర్జీ మాత్రం చాలా అధికం. రోజు మొత్తంలో తీసుకునే ఆహారం కంటే పొద్దునపూట చేసే బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం అంటారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే రాత్రంతా ఖాళీగా ఉన్న పొట్టను పొద్దునే పలకరించేది టిఫినే కదా! అంతేకాక రోజంతా పనిచేసేందుకు కావాల్సిన శక్తినీ, ఉత్సాహాన్నీ కూడా ఇస్తుంది. అందుకే ఓ పూట భోజనం మానినా టిఫిన్‌ మాత్రం మానొద్దంటారు. మరి ఇంత ముఖ్యమైన అల్పాహారంలో మన సెలబ్రిటీలు ఏం తీసుకుంటారో, వాళ్లకేం ఇష్టమో చూద్దామా! 


గుజరాతీ కిచిడీ!

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ఆహారం పూర్తిగా వెజిటేరియన్‌. పొద్దున్న లేవగానే చక్కెర లేని టీ తాగుతారు. టిఫిన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా లభించేలా చూసుకుంటారు. ఎక్కువగా గుజరాతీ వంటకాలే ఇష్టపడతారు. ఆ స్టైల్‌లో వండిన కిచిడీ ఆయన ఆల్‌టైం ఫేవరెట్‌. ప్రధానమంత్రి వ్యక్తిగత వంటమనిషి ఎల్లవేళలా ఆయన వెనుకే ఉంటారు. అందువల్ల దేశవిదేశాల్లో ఎక్కడికి వెళ్లినా మోదీ తనకు అలవాటైన ఆహారమే తీసుకుంటారు. ఇడ్లీ, దోశ, పోహా, రోటీలు ఇష్టంగా తింటారు.


అంతా లెక్క ప్రకారమే!

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? వ్యాయామం, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు తను. బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తగ్గించీ, రాత్రికి బాగా లైట్‌గా తినడం కోహ్లికి అలవాటు. గతంలో ఒక గుడ్డు పూర్తిగా, మరో మూడు గుడ్ల తెల్లసొన మాత్రమే వేసి చేసిన ఆమ్లెట్‌, నిప్పులమీద కాల్చిన బేకన్‌, సాల్మన్‌ చేప వంటివి తీసుకునేవాడు. కానీ శాకాహారిగా మారాక ఇందులో మార్పులు చేసుకున్నాడు.  ఇడ్లీ, దోశ వంటివి తీసుకుంటున్నాడు. అందులో పాలకూర మాత్రం తప్పనిసరి. తర్వాత ఏవైనా కొన్ని పండ్ల ముక్కలు తింటాడు. నిమ్మకాయ పిండిన గ్రీన్‌టీ, లేదా బ్లాక్‌టీ పెద్ద కప్పుతో తాగుతాడు.


సాంబార్‌ ఇడ్లీ ఎంతిష్టమో!

వినాయకచవితి, దసరా వంటి పండగలప్పుడూ న్యూఇయర్‌ పార్టీల్లోనూ అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ తన స్నేహితులకూ సెలబ్రిటీలకూ ఇచ్చే విందు చాలా గ్రాండ్‌గా ఉంటుందట. కానీ ఆయన మాత్రం మితాహారి. ముఖ్యంగా టిఫిన్‌ అయితే మనం తినేలాంటి సగటు వంటకాలే తీసుకుంటారు. వెజిటేరియన్‌ అయిన ముఖేష్‌కు సాంబార్‌ ఇడ్లీ అంటే ప్రాణô! పొద్దున్నే టిఫిన్‌లో వేడి వేడి ఇడ్లీల్లో చిక్కటి సాంబారు పోసుకుని సౌత్‌ ఇండియన్‌ స్టైల్‌లో లాగించడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. దోశ కూడా ఇష్టమేనట.


పాలూ పండ్లే!

బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పి.వి.సింధు ప్రపంచ క్రీడాకారుల్లోనే అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ఉన్న వారిలో ఒకరు. ఎప్పుడూ గంటల తరబడి ప్రాక్టీస్‌ చేస్తూ వర్కౌట్స్‌లో బిజీగా ఉండే సింధు తన డైట్‌ ఛార్ట్‌ను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పాలూ, గుడ్లూ, పండ్ల ముక్కలు మాత్రమే తింటుంది. ఇంకెలాంటి నూనె, మసాలా వాడిన పదార్థాలకూ చోటు లేదు. రోజంతా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా నీళ్లూ, జ్యూసులూ తాగుతుంటుంది. నెలలో ఒక్కసారి మాత్రం రెగ్యులర్‌ డైట్‌ను పక్కనపెట్టి నచ్చినవి లాగిస్తుంటుంది.


పరోటాలు చాలు

కరోనాపై పోరాటానికి 28 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్‌ కుమార్‌ ఒకప్పుడు చాలా కింది స్థాయి నుంచి వచ్చాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకేనేమో తన మూలాలు మర్చిపోకుండా ఉంటాడు. ఆహారం విషయంలో సగటు పంజాబీ లాగానే ఉంటుంది తన ఛాయిస్‌. పొద్దున్న లేవగానే ఘుమఘుమలాడే నెయ్యి వేసి చేసిన రెండు పరోటాలు కుమ్మేస్తాడు అక్కీ. దాంతోపాటే గ్లాసు పాలు కూడా. ఫిట్‌నెస్‌పై ఎంత దృష్టి ఉన్నా డైటింగ్‌తో కడుపు మాడ్చుకోడు. ఏం తిన్నా సరైన సమయానికి తినడం, దానికి తగిన వ్యాయామం చేయడం అలవాటు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు