close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ కిచెన్‌లో రోజుకు 100 గ్యాస్‌ సిలిండర్లు!

గురుద్వారా... చిన్నదయినా పెద్దదయినా అక్కడ మనిషి ఆకలి తీర్చే ఓ వంట గది తప్పక ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆ వంట గదులు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి ఆహారాన్ని వండి వార్చాయి. కులమతాలకతీతంగా ఎందరి కడుపులో నింపాయి, దేశవిదేశాల్లోనూ కితాబులందుకున్నాయి. లంగర్‌గా పిలిచే అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో ఉన్న వంటగది ప్రపంచంలోని అతి పెద్ద వాటిలో ఒకటి. ఇక్కడ రోజూ సుమారు లక్ష మందికి ఆహారం తయారవుతుంది.

లంగర్‌... అంటే పంజాబీ భాషలో వంటగదే అయినా ‘పేదలూ, ఇబ్బందుల్లో ఉన్నవారి చోటు’ అని దాని అసలు అర్థమట. అందుకే ఇక్కడ ఆకలితో ఉన్న ఎవరయినా అన్నం తినొచ్చు. కులమతాలకతీతంగా అందరికీ ఆహారం అందించాలన్నది సిక్కుల మొదటి గురువు గురు నానక్‌ ఆలోచన. దానికనుగుణంగా 1577వ సంవత్సరంలో గురు రామ్‌దాస్‌ అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో లంగర్‌ను ప్రారంభించారు. స్వర్ణదేవాలయం ఎంత ప్రత్యేకమో ఈ లంగర్‌ విశేషాలూ అంతే ఆసక్తికరం.

* లంగర్‌లో రోజుకు 75 వేల నుంచి లక్ష మంది వరకూ భోజనం చేస్తారట. అదే వారాంతాలూ, ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది.
* భోజనం పూర్తి శాకాహారం. అందులో చపాతీ, అన్నం, పప్పు, కూర, స్వీటు తప్పక ఉంటాయి.
* ఇక్కడ భోజనం తయారు చేయడానికి సగటున రోజుకు సుమారు 7000 కిలోల గోధుమ పిండి అవసరం అవుతుంది. 1400 కిలోల బియ్యం, 1800 కిలోల పప్పులూ, 7500 కిలోల పాలపొడీ అవసరం అవుతాయట. ఆహారం తయారు చేయడానికి దాదాపు
700 కిలోల నెయ్యిని వాడతారట.

* వంటకోసం రోజుకు 100 గ్యాస్‌ సిలిండర్లతో పాటు 500 కిలోల వంట చెరకును వినియోగిస్తారు.
* ఇంత పెద్ద వంట వండేందుకు మామూలు గిన్నెలు సరిపోవు కదా, అందుకే ఏకంగా 700 కిలోల దాకా పప్పూ లేదా పాయసం తయారుచేయగలిగే పాత్రలు ఉంటాయిక్కడ.
* ఇక్కడ రెండు భోజనశాలలున్నాయి. వీటిల్లో ఒకేసారి 5 వేల మంది భోజనం చేయొచ్చు.
* ఇక్కడ పాత్రలనూ స్వచ్ఛంద సేవకులే శుభ్రం చేస్తారు. ప్లేట్లూ స్పూన్లూ గిన్నెలూ వేరు చేసిన తర్వాత ఒక్కోదాన్నీ మూడు నుంచీ ఐదు సార్లు కడుగుతారు. ప్లేట్లూ, పాయసం గిన్నెలూ, స్పూన్లూ లాంటి మొత్తం 3 లక్షల పాత్రల్ని రోజూ శుభ్రపరచాల్సి వస్తుంది.

* రోజుకు సగటున దాదాపు 2 నుంచి 3 లక్షల చపాతీలు తయారవుతాయిక్కడ.
* స్వచ్ఛంద సేవకులు గంటకు 2 వేల చపాతీలను తయారు చేస్తారు. ఇక్కడ మెషీన్లు గంటకు 3 వేల నుంచి 4 వేల చపాతీలను కాల్చగలవు. గంటకు 25 వేల చపాతీలను చేసే మెషీన్‌ కూడా ఇక్కడ ఉంది. ప్రత్యేక దినాల్లో దీన్ని వాడతారు.
* ఇక్కడి ఆహారశాల 24 గంటలూ వారంలోని ఏడురోజులూ పనిచేస్తూనే ఉంటుంది. దాని కోసం షిఫ్టుల్లో 450 మంది దాకా సిబ్బందితో పాటు అంతకు సమానమైన సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు పనిచేస్తారు. కూరగాయలు చెక్కుతీయడం,
తరగడం, చపాతీలు వత్తడం... ఇలా ఇక్కడ ఎవరయినా ఏ పనయినా చేయొచ్చు.

* లంగర్‌ ఉదయం అయిదింటికి తెరుచుకుంటుంది. ముందుగా దాదాపు 50 వేల కప్పుల టీ, బిస్కెట్లు లేదా బ్రెడ్డూ అందిస్తారు. ఉదయం ఎనిమిదింటికల్లా ఇక్కడ భోజనం సిద్ధమయిపోతుంది. అది మొదలు మళ్లీ తెల్లవారు జాము దాకా సాగుతూనే ఉంటుంది.
* మొత్తం లంగర్‌ అవసరాలకు గాను రోజుకు సగటున మామూలు రోజుకి 11 లక్షలూ, ప్రత్యేక దినాల్లో 16 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందట. ఇందులో చాలా వరకూ విరాళాల ద్వారానే అందుతుంది.


వైరస్‌ దేవత..!

ఆ మధ్య కేరళలో అనిలన్‌ అనే పూజారి కరోనా వైరస్‌ని దేవతగా మార్చి ‘కరోనా దేవి’ పేరుతో పూజించడం, పశ్చిమ బంగ అసోల్‌లోని కొందరు మహిళలు దాన్నే ‘కరోనా మాయీ’ అని కొలవడం వార్తల్లో కెక్కింది! ఎప్పట్లాగే దీనిపైన సోషల్‌ మీడియాలో వాదోపవాదాలు సాగాయి.
నిజానికి, ప్రాణాలు హరించే వైరస్‌లనీ, వాటిని పారదోలే దేవతలనీ పూజించడం భారతీయ సంస్కృతిలో ఎంతో కాలంగా ఉంది. మన గ్రామీణ దేవతలు చాలావరకూ అలాంటివారే! ‘కరోనా’కి జేజమ్మలాంటి మశూచి కోసమైతే మనకు దేశవ్యాప్తంగా దేవతలున్నారని చెప్పాలి. దాదాపు ఉత్తరభారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పూజలందుకునే శీతలాదేవి... మశూచి వైరస్‌కి సంబంధించిన దేవతే.
శీతలాదేవికి సంబంధించిన పురాణ కథలన్నీ ఆమెని ‘జ్వరాసురుణ్ని’ చంపిన దేవతగానే చెబుతాయి. జ్వరంతో వచ్చే వేడిని తగ్గించడానికి ఉపయోగపడే విసనకర్రా, నీళ్లు లేదా నీటిపొక్కులున్న కుండ చేతబూని ఉంటుంది ఆ దేవి. చేతిలో చీపురు కూడా ఉంటుంది... అది వైరస్‌లని పారదోలడానికే కాదు ఆమెకి కోపం వస్తే వాటిని రప్పించడానికీ ఉపయోగిస్తుందన్నది నమ్మకం. పశ్చిమ బంగలో ‘కరోనా మాయి’ని పూజించిన భక్తురాళ్లు కూడా ఈ వైరస్‌ శీతలాదేవి సృష్టి అనే విశ్వాసంతోనే తాము పూజించామని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో నల్లపోచమ్మ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్లమ్మ, తమిళనాడులో ముత్తు మారియమ్మన్‌, కర్ణాటకలోని ముత్యాలమ్మ ‘వైరల్‌’ దేవతలే. అంతేకాదు వీరి పురాణాలన్నీ కూడా మశూచి లక్షణాల గురించే చెబుతాయి. ముఖ్యంగా వీళ్ల కోపమే ‘ముత్యాలు’(మశూచీ పొక్కులుగా)గా భక్తుల్లో కనిపిస్తాయని వివరిస్తాయి.కేరళలో ఈ వ్యాధిని ‘వసూరి మాల’ అనే శక్తి రూపంతో ముడిపెడతారు. మహంకాళికి కోపం వచ్చినప్పుడల్లా వసూరిమాల వస్తుందని నమ్ముతారు.


అట్టముక్కలు బెంచీలయ్యాయి!

మెరికాలో ఇంజినీరింగ్‌ చదివి వచ్చిన మోనిషా నార్కె ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న తపనతో రీసైక్లింగ్‌ దిశగా ఆలోచించింది. ఇంట్లో చెత్తని కంపోస్టుగా మార్చి పెరట్లో కూరగాయలు పండించడంతో మొదలుపెట్టిన ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. ఎవరికి వారు ఇంట్లో తడిచెత్తను ఉపయోగించి ఎరువు తయారుచేసుకోవటానికి పనికొచ్చే కంపోస్టు బిన్‌ని డిజైన్‌ చేసింది. దానికి మంచి ఆదరణ లభించడంతో ‘ఆర్‌యుఆర్‌’ పేరుతో సంస్థను ప్రారంభించి వివిధ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడమెలా అని పరిశోధన కొనసాగించింది. రకరకాల వస్తువులు కొనేటప్పుడు వచ్చే టెట్రాప్యాకింగ్‌ కవర్లు చెత్తబుట్టలో చేరడం చూసిన ఆమె వాటిని సేకరించి రీసైక్లింగ్‌ చేసి ఫర్నిచరు రూపొందించడానికి ప్రయత్నించింది. ప్యాకింగ్‌ కార్టన్లను సేకరించి వాటితో పార్కుల్లో వాడడానికి బెంచీలు తయారుచేసింది మోనిషా. స్కూలు పిల్లలకు పనికొచ్చే డెస్కులు తయారుచేసి ప్రభుత్వ పాఠశాలలకు అందజేసింది. 4500 టెట్రాప్యాక్‌ కార్టన్లతో ఒక స్కూల్‌ డెస్కు తయారవుతుంది, అదే పార్కు బెంచీకైతే 6500 కార్టన్లు కావాలి- అనే మోనిషా, ముంబయి నగరపాలక సంస్థతో ఒప్పందం చేసుకుని నగరంలోని పలుచోట్ల కార్టన్ల సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇలా తయారైన ఫర్నిచరు దృఢంగా ఉండటమే కాక వాటి జీవితకాలం ముగిశాక వందశాతం రీసైక్లింగ్‌ చేయొచ్చంటుంది మోనిషా. 


పింగాణీకీ కొత్త జీవితం

రీసైక్లింగ్‌ అనగానే చాలా మందికి ప్లాస్టిక్‌ గుర్తొస్తుంది కానీ, నిజానికి భూమికి భారంగా మారుతున్న చెత్త ఇంకా చాలా ఉందంటాడు శశాంక్‌ నింకార్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ విద్యార్థి అయిన శశాంక్‌ని చదువుకునే రోజుల్లోనే సెరమిక్‌ వ్యర్థాలు ఆలోచింపజేశాయి.
ఏ వీధిలో చూసినా చెత్తకుండీల పక్కన పగిలిపోయిన టైల్సూ బాత్‌రూమ్‌ సామగ్రీ పడి ఉండేవి. అవి ఎప్పటికీ మట్టిలో కలిసిపోవనీ వేల సంపత్సరాలైనా భూమికి భారంగా అలాగే ఉంటాయనీ తెలిసి శశాంక్‌ ఆశ్చర్యపోయాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి హానిచేస్తాయి కానీ భూమికి బరువు కావు. సెరమిక్‌ వల్ల పర్యావరణానికి హాని లేకపోయినా గుట్టలా పేరుకుపోయి చోటు వృథా అవుతుంది. భూమికి భారంగానూ ఉంటుంది- అని ఆలోచించిన శశాంక్‌ సెరమిక్‌ రీసైక్లింగ్‌ గురించి  ప్రాజెక్టు వర్కు చేద్దామనుకున్నాడు కానీ కుదరలేదు. చదువయ్యాక అదే విషయంపై పరిశోధనలో లీనమయ్యాడు. వాడిన సెరమిక్‌ వస్తువుల రూపం మార్చి మరోలా వాడుకోవడం వల్ల కొత్త వస్తువుల తయారీనీ భూమికి భారాన్నీ తగ్గించొచ్చన్నది అతడి ఆలోచన. మొత్తానికి అందులో విజయం సాధించాడు. సెరమిక్‌ వ్యర్థాలను పొడిచేసి 70శాతం ఆ పొడికి 30 శాతం కొత్త మట్టిని కలిపి వాడుకోవటానికి పనికొచ్చే కొత్త పింగాణీ వస్తువుల్ని తయారుచేస్తున్నాడు. వీటిని వాడినన్నాళ్లూ వాడుకున్నాక పాడైపోతే పూర్తిగా రీసైకిల్‌ చేయవచ్చంటాడు ‘ఎర్త్‌ తత్వ’ పేరుతో స్టార్టప్‌ పెట్టిన శశాంక్‌.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు