close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలనాటి కథలు

అతి తక్కువ సమయంలో కావ్యరచన చేసిన పిల్లలమర్రి పినవీరభద్రుణ్ణి ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘వాణి నా రాణి’ అని సమాధానమిచ్చాడట. ఇంకేముంది... ఆ వాణి అర్థరాత్రి గదిలోకి వచ్చి పరాయి వాడి భార్యను పట్టుకుని ‘నా రాణి’ అని చాటిస్తావా, నా కాపురం ఏం కాను- అని నిలదీస్తే అతడేమని సమాధానం చెబుతాడు... నే పలికేది భాగవతం, పలికించెడువాడు ఆ రామభద్రుడు ఇందులో నీ ప్రసక్తి ఎక్కడ ఉందీ అని సాక్షాత్తూ పోతనే ప్రశ్నిస్తే ఏమవుతుంది ఆ వాణి...
ఆసక్తికరమైన ఈ సన్నివేశాలు ‘ఆలాపన’ కథలోనివి. శ్రీనాథుడు దాక్షారామంలో తన కవనాన్ని భీమనాథునికి ధారపోసే రోజుల్లో జరిగిన ఓ చిన్నదాని కథ ‘రవిచంద్రిక’. భాషా సౌందర్యమూ కథనశైలీ పరిమళించే ఇలాంటి ఆరు కథలూ మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసుకున్న 26 జావళీలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. - పద్మ

కేళీగోపాలమ్‌
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
పేజీలు: 208: వెల: రూ. 160/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మా మంచి మాస్టారు

వ్యక్తిగత జీవితం మిగిల్చిన విషాదాన్ని వృత్తి జీవితం ఇచ్చిన సంతృప్తితో అధిగమించి జీవిత చరమదశకు చేరుకున్న బడిపంతులు ఆయన. రేపో మాపో అన్నట్లున్న పరిస్థితిలో రోజుకొకరు చొప్పున అలనాటి విద్యార్థులు వచ్చి ‘మా జీవితాన్ని వెలిగించిన మాస్టారు మీరే’ అంటూ ఆయన మనసు గదిలో మరుగునపడిన పాత జ్ఞాపకాలన్నిటినీ తట్టి లేపుతారు. ఒక్కో విద్యార్థిదీ ఒక్కో నేపథ్యం. తాను వేసిన పునాది వారినెలా విజయులుగా నిలబెట్టిందో ఒక్కొక్కరే వచ్చి వివరిస్తోంటే విని, ఆఖరిఘడియల్ని వారి సమక్షంలో ఆనందంగా గడిపి కన్నుమూస్తారాయన. మంచి మాస్టారుకీ విద్యార్థులకీ నడుమ ఎలాంటి అనుబంధం ఉండాలో చెబుతుందీ నవల.  - శ్రీ

కన్నీటి చేవ్రాలు (నవల)
రచన: యం.ఆర్‌.అరుణకుమారి
పేజీలు: 100: వెల: రూ. 80/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


మనిషి కథలు

రంగూ, రూపమూ, లైంగికతా... పుట్టుకతో వచ్చేవి. మన చేతుల్లో లేని విషయమని తెలిసీ మూడోదాని విషయంలో ఇబ్బందిపడతాం. హిజ్రాలు కన్పిస్తే ఏదో అసౌకర్యం. దాన్ని ప్రశ్నించే కథలే ఇవన్నీ. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చిస్తాయి. రైల్లో శ్రీహరి పక్క సీట్లో ఒక యువతి కూర్చుంటుంది. ఆమెను చూడగానే ముడుచుకుపోయిన అతడి ముఖం ఆమె మాటలు విన్నాక మామూలవుతుంది. ఉన్నతవిద్యావంతురాలైన ఆమె స్నేహంతో అతడు ఏం చేశాడో చెబుతుంది ‘కసారా నుంచి రైలు’. దిల్లీలో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసని ధైర్యంగా ఆపిన హిజ్రాల   గురించి యథార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ‘మానవత్వం’. పుస్తకంలోని పందొమ్మిది కథలూ ఇలాంటివే! -సుశీల

అస్మిత (ట్రాన్స్‌జెండర్లపై కథానికల సంకలనం)
పేజీలు: 162: వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రజాశక్తి పుస్తక విక్రయకేంద్రాలు


ముచ్చటైన ముగింపులు

ఉత్కంఠభరితంగా కథను నడిపిస్తూ ఊహకందని ముగింపును ఇచ్చే రచయిత ఓ.హెన్రీ. నాటి అమెరికా నగరాల్లోని మధ్య తరగతి, సంపన్న కుటుంబ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆయన రాసిన కొన్ని కథల అనువాదాలివి. ‘క్రిస్మస్‌ బహుమతులు’ కథలో జేమ్సు, బెల్లా దంపతుల గాఢమైన ప్రేమతోబాటు కానుకలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. ‘ఓ బిజీ బ్రోకరు శృంగార గాథ’లో పనిలోపడి పెళ్లి చేసుకున్న విషయాన్నే మరిచిపోతాడు మాక్సువెల్‌. కథలన్నీ ఆకట్టుకుంటాయి. అనువాదం సరళంగా ఉంది. -సాహితి

ఓ హెన్రీ కథలు
స్వేచ్ఛానువాదం: శ్రీరాగి
పేజీలు: 119: వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.