close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడు రూపాల్లో దర్శనమిచ్చే పద్మాక్షి!

ప్రతిరోజూ మూడు రూపాల్లో దర్శనమిస్తూ... భక్తుల కోర్కెలు తీర్చే భవానీగా, అష్టైశ్వర్యాలనూ ప్రసాదించే ఆదిపరాశక్తిగా పూజలు అందుకుంటోంది హన్మకొండలోని పద్మాక్షీదేవి. ఆ దేవి అనుగ్రహంతోనే కాకతీయ రాజులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేశారని చరిత్ర చెబుతోంది. పంచాక్షరి దేవతలలో ఒకరిగా అమ్మ ఇక్కడ కొలువై ఉండటం విశేషం.

ర్భాలయంలో పద్మాసన స్థితిలో కనిపిస్తూ... ఉదయం బాలికగా, మధ్యాహ్నం యౌవనవతిగా, సాయంత్రం వృద్ధురాలిగా పద్మాక్షీదేవి దర్శనమిస్తుందని అంటారు. ఈ మార్పులు అమ్మవారి  చెక్కిళ్లలోనే కనిపిస్తాయట. ఈ అమ్మవారితో కలిపి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, మధుర మీనాక్షిలను పంచాక్షరీలుగా పిలుస్తూ పంచభూతాలకు ప్రతిరూపాలుగా భావిస్తారు భక్తులు. ఈ అయిదు ప్రదేశాలు మినహా మరెక్కడా పంచాక్షరీ దేవతలకు సంబంధించిన ఆలయాలు లేవు. అమ్మవారి ఎడమ చేతివైపున రెండు క్రోసుల దూరంలో మూడు బండరాళ్లు ఉంటాయి. సూర్యరశ్మి పడినప్పుడు ఆ రాళ్లు త్రిభుజాకార నీడగా కనిపిస్తాయట.

స్థల పురాణం
ఈ క్షేత్ర విశేషాలను బసవ పురాణంలోని సిద్ధేశ్వర చరితం, నాల్గవ ఖండం సవివరంగా ప్రస్తావించింది. శిఖరంపైన ఉన్న పెద్ద గుహే ఆలయంగా కాకతీయుల కాలం నుంచీ విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దగ్గర శివపార్వతుల మూర్తులను ఏర్పాటుచేసుకోవాలనే ఉద్దేశంతో సిద్ధులూ యోగులూ తపస్సు చేసేవారట. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై జగన్మాత లేకుండా తానేమీ చేయలేనని చెప్పాడట. వెంటనే ఆ మునులు అమ్మవారి కోసం తపస్సు చేయగా ఆమె దర్శనమిచ్చి గుట్టపైన వెలుస్తాననీ, తనను ప్రధాన దైవంగా పూజించాలనీ గుట్ట అడుగున పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా అవతరిస్తాడనీ చెప్పిందట. ఆ విధంగా అమ్మవారు గుట్టపైన ఏడడుగులు మోపి పద్మాక్షిగా వెలసిందని అంటారు.

ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. చంద్రవంశానికి చెందిన సోమదేవరాజు కందారం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. కటకపురం పాలకుడు బల్లహుడు కందారంపైన దండయాత్ర చేస్తాడు. మొదటిసారి సోమదేవుడు విజయం సాధించినా రెండోసారి యుద్ధంలో మరణిస్తాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న సోమదేవుడి భార్య పారిపోయి అప్పటి అనుమకొండకు చేరి మాధవశర్మ ఇంట్లో తల దాచుకుంటుంది. అక్కడే ప్రసవించిన ఆమె... ఆయన పైన కృతజ్ఞతతో తనకు పుట్టిన బిడ్డకు మాధవవర్మ అని పేరు పెడుతుంది. చిన్నతనంలో పద్మాక్షీ ఆలయంలో చదువుకునేవాడట మాధవవర్మ. ఓసారి పలక, పుస్తకాలను ఆలయంలోనే మరిచిపోతే ఇంటికి వెళ్లాక గుర్తొచ్చి తెచ్చుకోడానికి వెళ్లాడట. చీకట్లో అమ్మ భయంకర రూపంలో కనిపించినా అతడు భయపడకుండా తన పలక, పుస్తకాలను తీసుకునేందుకు ప్రయత్నించాడట. అతడి  ధైర్యాన్ని మెచ్చిన అమ్మ దివ్యశక్తి గల కత్తి, డాలును మాధవవర్మకు అందించిందట. వాటి సాయంతో సుదీర్ఘకాలం రాజ్యమేలుతావని ఆశీర్వదించిందట. పశ్చిమ దిశలో ఉన్న రహస్య గుహను చూపించి, అందులోంచి వెళ్తే చతురంగబల సమేతమైన సేన వచ్చి కలుస్తుందనీ, దాని సహాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించమనీ దీవించిందట. అలా మాధవవర్మ అమ్మ ఆశీర్వాదంతో యుద్ధంలో గెలుస్తాడు. అయితే కాకతీయులలో చివరివాడైన ప్రతాపరుద్రుని రాజ్యపాలన నాటికి పద్మాక్షీ సిద్ధేశ్వరుల అనుగ్రహం సన్నగిల్లినట్లు కనిపిస్తుంది. దాంతో ప్రతాపరుద్రుడు పద్మాక్షీ ఆలయానికి వెళ్లి అమ్మవారు పూర్వం ఇచ్చిన కత్తినీ డాలునూ అమ్మ సన్నిధానంలో ఉంచి నమస్కరిస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు పట్టుబడటంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిందని అంటారు.

ఒకే వంశస్థులు...
ఈ ఆలయంలో పద్మాక్షి చెంతనే మహావీరుని విగ్రహం, కుబేరుడి విగ్రహం ఉంటాయి. ఇక్కడ అనాది నుంచీ నాగిళ్ల వంశస్థులే దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులుగా కొనసాగుతున్నారు. పూజాకార్యక్రమాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గుట్ట అడుగున పద్మాక్షీ చెరువు ఉంది. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పాంచాన్నిక(అయిదు రోజుల) దీక్ష సందర్భంగా శాకంబరీ ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలంటే..
వరంగల్‌, ఖాజీపేట వరకు రైలు, రోడ్డు మార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడినుంచి హన్మకొండ బస్టాండ్‌కు వెళ్తే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోలూ ప్రైవేటు వాహనాలూ ఉంటాయి.

-కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఈనాడు జర్నలిజం స్కూల్

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.