అంతరిక్షంలో... ఇరవయ్యేళ్లు! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అంతరిక్షంలో... ఇరవయ్యేళ్లు!

దేనినైనా పట్టుకోకుండా నిలబడి నాలుగు అడుగులు వేయడం సాధ్యం కాదు. గాలిలో తేలుతూనే పనులన్నీ చేసుకోవాలి. పగలూ రాత్రీ అన్న పద్ధతి ఉండదు. కడుపు నిండా ఇష్టమైన తిండీ, కంటి నిండా నిద్రా... కష్టమే. అయినా అంతరిక్ష యాత్రికులను అవేవీ ఆపడం లేదు. కుటుంబాలను వదిలిపెట్టి ఉత్సాహంగా వెళ్తున్నారు, నెలల తరబడి ఉంటున్నారు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పరిశోధనలు చేసి రేపటి గ్రహాంతరవాసానికీ, నేటి వైద్య చికిత్సలకీ చక్కని బాటలు వేస్తున్నారు. గత ఇరవయ్యేళ్లుగా భూమికీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ మధ్య జరుగుతున్న రాకపోకలూ అక్కడ ఉన్నవారు చేస్తున్న పరిశోధనలూ... మానవాళి ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాయి.

పుల్లా పుడకా ముక్కున జేర్చి పిట్ట గూడు కట్టుకున్నట్టుగా... ఒక్కో భాగాన్నీ భూమి మీద వేర్వేరు ప్రయోగశాలల్లో తయారుచేసి, తుపాకీ తూటాకన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వేగంతో అంతరిక్ష నౌకల్లో దూసుకెళ్లి, నిర్ణీత కక్ష్యలో రోబోటిక్‌ హ్యాండ్స్‌ సహాయంతో ఆ భాగాలనన్నిటినీ జతచేసి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కి ఓ రూపం తెచ్చారు వ్యోమగాములు. 2000 సంవత్సరం అక్టోబరులో ఏడుగురు వ్యోమగాములు డిస్కవరీ అనే అంతరిక్షనౌకలో వెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్‌ఎస్‌) మూడు మాడ్యూల్స్‌గా అమర్చివచ్చారు. అది కక్ష్యలో సరిగ్గా తిరుగుతోందని నిర్ధారించుకున్నాక మరో ముగ్గురు సోయుజ్‌ రాకెట్‌లో బయల్దేరి వెళ్లి నవంబరు 2న ఐఎస్‌ఎస్‌లో గృహప్రవేశం చేశారు. నాలుగున్నర నెలలు అందులోనే ఉన్నారు. ఆ తర్వాత మరో బృందం అక్కడికి వెళ్లగానే మొదట వెళ్లిన వాళ్లు తిరిగివచ్చేశారు.

అలా గత ఇరవై ఏళ్లలో 19 దేశాలకు చెందిన అంతరిక్ష యాత్రికులు 224 మంది 63 బృందాలుగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చారు. ప్రస్తుతం 64వ బృందం సభ్యులు ముగ్గురు అక్కడున్నారు. వెళ్లిన వాళ్లంతా మూడు నుంచి ఆర్నెల్ల వరకూ ఐఎస్‌ఎస్‌లో ఉంటారు. కొందరు రెండు, మూడుసార్లు వెళ్లొచ్చారు కూడా. కుటుంబానికి మాత్రమే కాదు, ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి భూ గ్రహానికే దూరంగా వీళ్లంతా అక్కడికెళ్లి ఏం చేస్తున్నారు... నీరూగాలీ లేనిచోట ఎలా ఉండగలుగుతున్నారు... లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆ అంతరిక్ష కేంద్రంలో ఏం జరుగుతోందీ... తెలుసుకోవడం ఆసక్తికరం.

నానాజాతి సమితి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం...ఐదు పడక గదుల ఇల్లంత నిర్మాణం. దానిచుట్టూ ఉన్న సౌరఫలకాల పొడవునీ కలిపితే ఏకంగా ఫుట్‌బాల్‌ మైదానమంత ఉంటుంది. మూడు మాడ్యూళ్లతో మొదలుపెట్టి పదేళ్లపాటు కొద్దికొద్దిగా పెంచుకుంటూ పోయిన ఆ కేంద్రంలో ఇప్పుడు 16 మాడ్యూళ్లు ఉన్నాయి. ఒక్కో మాడ్యూల్‌ చిన్న స్కూలు బస్సంత ఉంటుంది. అయినా అక్కడ ఆరుగురు మాత్రమే బస చేయవచ్చు. మిగిలినచోటంతా యంత్రాలూ, పరిశోధనలకే. ఆరు అత్యాధునిక ప్రయోగశాలలున్నాయి. అంత పెద్ద నిర్మాణం భూమ్మీద అయితే 500 టన్నుల బరువుండేది. అంతరిక్షంలో కాబట్టి బరువుతో సంబంధం లేకుండా గంటకు 17,500 మైళ్ల వేగంతో గిర్రున తిరుగుతూ గంటన్నరకోసారి భూమిని చుట్టేస్తోంది.
అంతరిక్షంలో అలా వేగంగా తిరుగుతున్న ఐఎస్‌ఎస్‌ని భూమి మీద నుంచి మనం నేరుగా చూడొచ్చు. చీకటి పడ్డాకో, తెల్లవారుఝామునో గమనిస్తే మెల్లగా కదులుతున్న తెల్లని చుక్కలా కనిపిస్తుంది. మొత్తం పదహారు దేశాల భాగస్వామ్యంతో పనిచేస్తున్న ఈ ప్రయోగశాల రాజకీయ, సామాజిక, శాస్త్ర పరిశోధనా రంగాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి సంబంధాల విషయంలో ఒక గొప్ప మైలురాయి. ఇది ఇలా రూపుదిద్దుకుని విజయవంతంగా సేవలందించడం వెనక పెద్ద కథే ఉంది.

ఎనభైల్లో మొదలు
చంద్రమండల యాత్ర విజయవంతంగా పూర్తవగానే అంతరిక్షాన్ని మరింతగా శోధించాలనుకుంది నాసా. వంద మంది శాస్త్రవేత్తలు ఉండి పరిశోధన చేసేందుకు వీలుగా ‘స్పేస్‌బేస్‌’ కట్టాలని ప్రతిపాదనలు తయారుచేసుకున్నా ఖర్చుకు జడిసి వెనకంజ వేసింది. అయితే చంద్రమండల యాత్ర తాలూకు మిగిలిపోయిన సరంజామాతో తాత్కాలిక స్పేస్‌స్టేషన్‌ ‘స్కైలాబ్‌’ని నిర్మించి, ప్రయోగించింది. మూడు అంతరిక్ష యాత్రలకు స్పేస్‌ స్టేషన్‌గా దాన్ని ఉపయోగించుకుంది నాసా. అంతరిక్షంలో మనుషులు నివసించగలరనీ, పని చేయగలరనీ స్కైలాబ్‌ నిరూపించింది.
ఆ తర్వాత 1983లో శాశ్వత స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చారు రొనాల్డ్‌ రీగన్‌. ఒంటరిగా కాక అన్ని దేశాలతో కలిసి ముందుకెళ్లాలని భావించిన క్లింటన్‌ ఆ ఆలోచనని ‘అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం’గా మార్చారు. రష్యా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సభ్య దేశాలూ, కెనడా, జపాన్‌ ఆ ప్రాజెక్టులో సభ్యులుగా చేరాయి. అలా సమష్టి కృషితో ఐఎస్‌ఎస్‌ ప్రారంభమైంది. దీని ద్వారా- అంతరిక్షంలో పెద్ద ఎత్తున యంత్రసామగ్రిని అమర్చి నిర్మాణాలు చేపట్టడం ఎలాగో తెలిసింది. సవాళ్లతో కూడిన ఆ వాతావరణంలో మనుషులు సుదీర్ఘకాలం ఉండగలరనీ, పనిచేయగలరనీ తెలిసింది. భవిష్యత్తులో అంతరిక్షాన్ని శోధిస్తూ మనిషి మరింత దూరం వెళ్లవచ్చన్న నమ్మకం వచ్చింది. అయితే ఇదంతా అంత తేలికగా ఏమీ జరగలేదు.

ఆ ప్రమాదం...
ఇరవయ్యేళ్ల క్రితం నవంబరులో ఐఎస్‌ఎస్‌లో దిగిన మొదటి బృందానికి ఆ వాతావరణానికి అలవాటు పడడానికే నెల రోజులు పట్టింది. ఖాళీగా ఉన్న కొత్తింట్లో సంబరంగా కొత్త సామాన్లు సర్దుకోవటం కాదు, మొత్తం యంత్రసామగ్రితో కిక్కిరిసి ఉన్నచోట మెల్లగా ఒకో భాగాన్నీ గమనిస్తూ అక్కడ ఏయే పరికరాలు ఉన్నాయీ అవి ఎలా పనిచేస్తాయీ లాంటివన్నీ తెలుసుకుంటూ వాటికి అడ్డురాకుండా తమ కోసం కాస్త చోటు చేసుకుంటూ, పనులు చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది ఆ బృందానికి. పైగా నిలబడి నడిచే వ్యవహారం కాదు, భార రహిత స్థితిలో గాలిలో తేలుతూ ఎప్పుడూ ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి. సామానంతా సౌకర్యంగా అమర్చుకున్నాక, చెడిపోయిన వాటిని మరమ్మతు చేయడం, లోపల కార్బన్‌డై ఆక్సైడ్‌ నిండిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం... లాంటివన్నీ అలవాటయ్యాక, మెల్లగా ప్రయోగాలూ మొదలుపెట్టారు. అంతరిక్ష కేంద్రానికి అమెరికాలోనూ రష్యాలోనూ- రెండు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్లున్నాయి. ఇరవై నాలుగ్గంటలూ ఈ మూడిటి మధ్యా కమ్యూనికేషన్‌ ఉంటుంది. అయితే కొత్తలో గంటల తరబడి కనెక్షన్‌ పోవడం ఆందోళన కలిగించేది. మొత్తానికి మూడున్నర నెలలపాటు కష్టపడి స్పేస్‌ స్టేషన్‌ని తర్వాత వచ్చే వాళ్లకోసం సిద్ధంచేసి వచ్చింది మొదటి బృందం. అలా అంతరిక్ష కేంద్రానికి వెళ్లి కొన్ని రోజులుండి పరిశోధనలు చేసి వస్తున్న క్రమంలోనే కల్పనా చావ్లా బృందం ప్రమాదానికి గురయింది. ఆ దురదృష్టకరమైన సంఘటన నేపథ్యంలో మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకుగాను నాసా రెండేళ్లపాటు ప్రయాణాలు ఆపేయడంతో రష్యా యాత్రల్ని కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా రాకపోకలు నిర్వహిస్తూ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

దినచర్య
అంతరిక్ష కేంద్రం లోపల వాతావరణమూ, ఉష్ణోగ్రతలూ సాధారణంగా ఉండేలా ఏర్పాటుచేశారు. అచ్చంగా ఆక్సిజన్‌ అయితే అగ్నిప్రమాదాలకు అవకాశం ఎక్కువుంటుందని అలా రూపొందించారు. అయినా అత్యవసర పరిస్థితిలో వాడుకోడానికి ఆక్సిజన్‌ సిలిండర్లూ, రీసైకిల్డ్‌ నీటితో అప్పటికప్పుడు ఆక్సిజన్‌ తయారుచేసుకునే విధానమూ సిద్ధంగా ఉంటాయి. మనుషులు వదిలిన వాయువుల్ని ఎప్పటికప్పుడు అందులో అమర్చిన ఆక్టివేటెడ్‌ చార్‌కోల్‌ ఫిల్టర్లు శుభ్రం చేస్తాయి. స్పేస్‌ స్టేషన్‌ పనిచేయడానికి కావాల్సిన కరెంటుని ఐఎస్‌ఎస్‌ బయట అమర్చిన సౌరఫలకాలు తయారుచేస్తాయి.
అంతరిక్ష కేంద్రంలోని వారి దినచర్య ఉదయం ఆరింటికే మొదలవుతుంది. కాలకృత్యాలు తీర్చుకుని ఒకసారి మొత్తం స్టేషన్‌ని తనిఖీ చేస్తారు. గోడల్నీ కిటికీల్నీ శుభ్రంగా తుడుస్తారు. టిఫిన్‌ చేసి ఎనిమిదింటికల్లా మిషన్‌ కంట్రోల్‌తో కాన్ఫరెన్స్‌కి హాజరవుతారు. ఆరోజు చేయాల్సిన పనుల గురించి చర్చిస్తారు. ఒంటిగంట దాకా పనిచేసి గంటసేపు భోజన విరామం తీసుకుంటారు. మళ్లీ సాయంత్రం వరకూ పనిచేసి ఆ తర్వాత వ్యాయామం చేస్తారు. రాత్రి ఏడున్నరకి భోజనం. అక్కడ ఉన్నవాళ్లు ఏ దేశస్థులైనా తమ తమ ప్రయోగశాలల్లో పనిచేసుకుంటూనే భోజన వేళల్లో తప్పకుండా ఒకేచోట కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పుకోవడం సంప్రదాయం. ఇంటికి దూరంగా ఉన్న ఒత్తిడిని అధిగమించేందుకు చేసుకున్న ఏర్పాటు అది. తొమ్మిదిన్నరకి ఠంచనుగా నిద్రపోవాలి కానీ అదే కాస్త కష్టమైన వ్యవహారం.

సూర్యోదయం 16సార్లు!
ఐదారు గంటలు విమానప్రయాణం చేస్తేనే జెట్‌ల్యాగ్‌ అంటూ డీలా పడిపోతాం. అలాంటిది రోజుకు పదహారు సార్లు సూర్యోదయమూ మరో పదహారు సార్లు సూర్యాస్తమయమూ అయ్యేచోట, అన్ని టైమ్‌ జోన్లనీ చుట్టబెడుతూ తిరిగే ఆ అంతరిక్ష కేంద్రంలో ఒకపట్టాన నిద్రపట్టదు. అందుకని స్పేస్‌ స్టేషన్‌ టైమింగ్స్‌కి అనుగుణంగా పడుకునే టైమ్‌ అవగానే చీకటిగా ఉండడానికి కిటికీల కర్టెన్లన్నీ మూసేస్తారు. లైట్లూ తీసేస్తారు. సిబ్బంది స్లీపింగ్‌ బ్యాగ్స్‌లోకి చేరి బెల్టులు బిగించుకుంటారు. నిద్ర పట్టేవరకూ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని సంగీతం వినడమో, చిన్న లైటు వేసుకుని పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇక, ఆహారపదార్థాలు ప్లాస్టిక్‌ సంచుల్లో ఎవరివి వారికే ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఉంటాయి. వాటిని వేడి చేసుకోవడానికి ఒవెన్‌, చల్లగా తినాలనుకుంటే పెట్టుకునేందుకు ఫ్రిజ్‌ ఉంటాయి. పొడిరూపంలో ప్యాక్‌ చేసిన డ్రింక్స్‌కి వేడినీరు కలుపుకుని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లోనుంచే స్ట్రా సాయంతో తాగుతారు. భూమి నుంచి స్పేస్‌ షటిల్‌ వస్తుందంటే అక్కడ ఉన్నవారికి పండుగే. తాజా పండ్లూ కూరలూ వస్తాయని సంబరపడతారు.
అలాగని ఉత్సాహంగా కవర్‌ తెరిచారంటే లోపలి పదార్థాలన్నీ ఎగిరి చెల్లాచెదురవుతాయి. అక్కడున్న సున్నితమైన పరికరాల్లో ఏ చిన్న ముక్క ఇరుక్కున్నా కొంపలంటుకుంటాయి. అందుకని ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బ్రెడ్‌ లాంటివి అక్కడికి తీసుకెళ్లరు. తినేసే టూత్‌పేస్టుతో పళ్లు తోముకుని నీళ్లతో పుక్కిలించి మింగేస్తారు. వాటర్‌జెట్‌తో కానీ వెట్‌వైప్స్‌(తడిగా ఉండే పేపర్‌ నాప్‌కిన్స్‌) తోకానీ ఒళ్లు శుభ్రం చేసుకుంటారు. ఘనవ్యర్థాలన్నీ విడివిడిగా బ్యాగుల్లో సేకరించి భూమి మీదికి పంపించేస్తారు. ద్రవ వ్యర్థాల్ని అక్కడే రీసైకిల్‌ చేసి మళ్లీ వాడుకుంటారు.

సమస్యలెన్నో!
సూర్యుడి వేడినీ రేడియేషన్‌ ప్రభావాన్నీ భూమి గ్రహించబట్టి మనకు అంతగా తెలియదు కానీ అంతరిక్ష యాత్రికులకు ఆ ప్రభావం ఎక్కువ. దానివల్ల వారికి క్యాన్సర్‌ రిస్క్‌ పెరుగుతుంది. క్యాటరాక్ట్‌ సమస్యలు వస్తాయి, కండరాల పటుత్వమూ వ్యాధి నిరోధక శక్తీ తగ్గుతాయి. తమ శరీరాన్ని వాళ్లు నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండడం మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమస్యలని అధిగమించడానికి రోజుకు రెండు గంటలు తప్పనిసరిగా వ్యాయామం చేస్తారు.  గుండె, ఎముకలు, కండరాలకు పనికొచ్చే వ్యాయామాలు చేసేందుకు ట్రెడ్‌మిల్లూ స్టేషనరీ బైసికిల్‌ తదితర పరికరాలు ఉన్నాయి.
ఈ సమస్యలకు తోడు... కంప్యూటర్స్‌ పాడైపోతాయి. కూలింగ్‌ సిస్టమ్‌ చెడిపోతుంది. నీటి రీసైక్లింగ్‌ వ్యవస్థ ఎక్కడో లీకవుతుంది. టాయ్‌లెట్‌ పనిచేయదు. 2007లో అయితే ఒకసారి దాదాపుగా స్పేస్‌ స్టేషన్‌లో ఏ పనీ జరగని పరిస్థితి ఏర్పడింది. 112 అడుగుల సౌరఫలకాన్ని బిగించబోగా అది తెగిపోయింది. దాని బదులు పెట్టడానికి మరొకటి లేదు. అది లేకపోతే స్టేషన్‌కి కరెంటు ఉండదు. అందులో ఉన్న ఇంజినీర్లే కిందామీదా పడి అందుబాటులో ఉన్న పరికరాలతోనే మరమ్మతు చేశారు. మరో ఆస్ట్రోనాట్‌ ఏడుగంటలు స్పేస్‌వాక్‌ చేస్తూ దాన్ని బిగించాడు.

పంటలూ వంటలూ!
అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో ఇప్పటివరకూ మూడువేలకు పైగా పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలకు అనుబంధంగా భూమి మీద 108 దేశాల్లో కొన్ని వేలమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. త్రీడీ ప్రింటింగ్‌ నుంచీ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ వరకూ అక్కడ జరగని పరిశోధన లేదు. ఏడు కిటికీలతో ఉండే అబ్జర్వేటరీ నుంచి అటు అంతరిక్షాన్నీ ఇటు భూమినీ పరిశీలిస్తూ వారు తీసే ఫొటోలు కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉపయోగపడే ఉపగ్రహాలను భూమి నుంచి ప్రయోగించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. వాటిని ఇప్పుడు నేరుగా ఐఎస్‌ఎస్‌కి పంపి అక్కడి నుంచి కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు. అంతే కాదు, ఈ కేంద్రంలో పరిశోధకులు ఆకుకూరలూ లెట్యూస్‌ లాంటివి పండించారు. వాటితో సలాడ్‌ చేసుకుని తిన్నారు. ఇప్పుడు ముల్లంగిలాంటి దుంపలూ పండిస్తున్నారు. ఆ మధ్య కుకీలు కూడా వండారు. అయితే అందుకు భూమ్మీదకన్నా ఐదారు రెట్లు ఎక్కువ సమయం పట్టిందట. ఆకాశంలో తిరిగే ఇల్లూ... అందులో ఇరవై ఏళ్లుగా మనుషులు ఉండటమూ... గాలీ నీరూ లేనిచోట శాస్త్ర ప్రయోగాలు చేయడమూ... అవి మానవాళికి వరాలుగా మారడమూ... మనిషి ఏదైనా సాధించగలడనడానికి ఇంతకన్నా రుజువేం కావాలి..!


అక్కడ పరిశోధన... ఇక్కడ ఉపయోగం!

అంతరిక్ష కేంద్రంలో చేస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో గ్రహాంతరయానానికే కాదు, ఇప్పుడు భూమి మీద మనకీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని...
* మనిషి శరీరంలో లక్షకు పైగా ప్రొటీన్లు ఉంటాయి. బయట ప్రకృతిలో అయితే వేలకోట్లు. ప్రతిదీ దేనికదే ప్రత్యేకం. మన ఆరోగ్యం గురించైనా పర్యావరణానికి సంబంధించి అయినా ఎంతో సమాచారం వీటిలో ఉంటుంది. అలాంటి ఒక ప్రొటీన్‌ మీద పరిశోధన జరిపి దాన్ని విజయవంతంగా క్రిస్టలైజ్‌ చేయగలిగారు ఐఎస్‌ఎస్‌లో. దానివల్ల మస్క్యులర్‌ డిస్ట్రొఫీకి మందులు తయారుచేయడానికి దారి ఏర్పడింది. ఇలా అక్కడి పరిశోధనలు ఎన్నో కొత్త మందుల తయారీకి బాటవేశాయి.
* స్పేస్‌ స్టేషన్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం అందించడానికి అభివృద్ధి చేసిన విధానమే ‘ఎడ్వాన్స్‌డ్‌ డయాగ్నొస్టిక్‌ అల్ట్రాసౌండ్‌ ఇన్‌ మైక్రోగ్రావిటీ’. అంటే- రోగి అంతరిక్షంలో ఉన్నా ఈ అల్ట్రాసౌండ్‌ ఇమేజరీ ద్వారా అతని పరిస్థితిని అప్పటికప్పుడు భూమి మీద ఉన్న వైద్యులు చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలూ మందులూ తెలియజేస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగిని కదల్చకుండా అక్కడే ఉంచి చికిత్స అందించడానికి ఈ విధానాన్ని ఆస్పత్రుల్లోనూ, ట్రామా సెంటర్లలోనూ వినియోగిస్తున్నారు.
* కంటి పనితీరు మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది. అందుకని అంతరిక్ష యాత్రికుల కళ్లు ఎలాంటి మార్పులకి లోనవుతున్నాయన్నది తెలుసుకోవడానికి ‘ఐ ట్రాకింగ్‌ డివైస్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ చేశారు. దాన్ని భూమి మీద కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు గుర్తించారు. లేజర్‌ సర్జరీ చేసేటప్పుడు వైద్యుడి పనికి అంతరాయం కలగకుండా కనుగుడ్డు కదలికల్ని ట్రాక్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఐ ట్రాకింగ్‌ డివైస్‌ అందుకు ఉపయోగపడడంతో ప్రపంచవ్యాప్తంగా లేజర్‌’ సర్జరీలకు వాడుతున్నారు.
* ఐఎస్‌ఎస్‌ కోసం తయారుచేసిన రోబో హ్యాండ్‌ స్ఫూర్తితో ‘న్యూరోఆర్మ్‌’ను రూపొందించారు. కొన్నిరకాల బ్రెయిన్‌ ట్యూమర్లలో అత్యంత సున్నితమైన శస్త్రచికిత్సలకు దీన్ని ఉపయోగిస్తుండగా, ఇమేజ్‌ గైడెడ్‌ అటానమస్‌ రోబోని ఎంఆర్‌ఐ మిషన్‌లో అమర్చి రొమ్ము క్యాన్సర్‌ కణితిని కచ్చితంగా గుర్తించగలుగుతున్నారు.
* ఐఎస్‌ఎస్‌లో ఉండడం మొదలుపెట్టిన కొత్తలో వ్యోమగాములు నెలకు ఒకటిన్నరశాతం చొప్పున ఎముక సాంద్రతను కోల్పోయేవారు. ప్రత్యేక వ్యాయామమూ విటమిన్‌ ‘డి’ సహిత ఆహారంతో వారు ఆ సమస్యను అధిగమించగలిగేలా చేశారు పరిశోధకులు. ఇప్పుడు అదే చికిత్సను ఎముకలు పెళుసుబారే సమస్యతో బాధపడేవారికి అందిస్తున్నారు.
* సాల్మొనెల్లా లాంటి బ్యాక్టీరియా వల్ల వ్యాపించే అనారోగ్యాలతో ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతునరు. ఆ బ్యాక్టీరియా గురించి ఐఎస్‌ఎస్‌లో చేసిన పరిశోధన మైక్రోబియల్‌ వ్యాక్సిన్‌లను మరింత ప్రభావవంతంగా తయారుచేయడానికి పనికొచ్చింది.
* స్పేస్‌ స్టేషన్‌లోని అబ్జర్వేటరీ నుంచి తీసే ఫొటోల సాయంతో భూమి మీద ప్రకృతి విపత్తుల తీవ్రతను అర్థం చేసుకోడానికీ, త్వరగా స్పందించడానికీ వీలు కలుగుతోంది.
* స్పేస్‌లో పంటలు పండించే క్రమంలో అభివృద్ధి పరిచిన ఒక వ్యవస్థ మొక్కలకి వైరస్‌లూ, బ్యాక్టీరియా, బూజూ లాంటివి సోకకుండా అడ్డుకుంటోంది. అదే వ్యవస్థను ఇళ్లలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికీ, పండ్లూ కూరగాయల నిల్వ సమయాన్ని పెంచడానికీ ఉపయోగిస్తున్నారు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు