ఫ్యాషన్‌ మేళా! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫ్యాషన్‌ మేళా!

చీరలు తొడిగేద్దామిలా!

పెళ్ళి, పేరంటం, పండగ... ఇలా ఏ శుభకార్యం ఉన్నా చాలామంది అమ్మాయిలు చక్కగా చీర కట్టుకుని అందంగా ముస్తాబవ్వాలని కోరుకుంటారు. అది కూడా ఏదో చీర కట్టుకున్నాం అంటే కట్టుకున్నాం అని కాకుండా ఈ రోజులకు తగినట్లుగా చీర ఎంపిక నుంచీ కట్టే విధానం వరకూ అన్నీ కొత్తగా ఉండాలని అనుకుంటారు. అయితే... నచ్చిన డిజైనులో చీరను ఎంచుకున్నా కొన్నిసార్లు దాన్ని సరిగ్గా కట్టుకోవడం రాక..  ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి చిక్కులేవీ లేకుండా చేస్తాయి ఈ రెడీమేడ్‌ డిజైనర్‌ చీరలు. ఒకప్పుడు సంప్రదాయ చీరకట్టులో మాత్రమే దొరికిన ఈ రెడీమేడ్‌ చీరలు... ఇప్పుడు రకరకాల డ్రేపింగ్‌స్టైల్స్‌లో, ట్రెండీ లుక్‌తో వచ్చేసి మనసు దోచేస్తున్నాయి. కొంగు, కుచ్చిళ్లు... అన్నీ ముందే అందంగా కుట్టి ఉంటాయి కాబట్టి... నచ్చిన రంగు, ఫ్యాబ్రిక్‌లో కాస్త కొత్తగా ఉన్నదాన్ని ఎంచుకుంటే ఒకటిరెండు నిమిషాల్లోనే చుట్టేసుకుని వెళ్లిపోవచ్చు. చూసినవాళ్లు కూడా ‘అంత బాగా ఎలా కట్టుకున్నావబ్బా’ అని అడగకుండా ఉండలేరు.

 


రఫుల్స్‌ చెప్పులివి

సాధారణంగా చీరలూ, స్కర్టులూ, రకరకాల టాప్స్‌, బ్లవుజులు వంటివాటి అంచులు లేదా చేతులకు రఫుల్స్‌ పెట్టించుకోవడం ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోన్న ఫ్యాషనే. ఆ రఫుల్స్‌ డిజైనే తాజాగా చెప్పులపైనా చేరడంతో అవి నయాలుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. చెప్పులు ఎంత సాధారణంగా ఉన్నా... వాటిపైన రఫుల్స్‌ని అందమైన డిజైన్లలో అమర్చడంతో అవి ఆధునికంగా మారిపోతున్నాయి. ఫ్లాట్స్‌, షూస్‌, శాండిల్స్‌... ఇలా అన్నిరకాలపైనా ఈ రఫుల్స్‌ కనిపిస్తున్నాయి. కేవలం చెప్పుల పైభాగాన మాత్రమే కాదు... వాటి డిజైన్‌ని బట్టి పట్టీలపైనా రఫుల్స్‌ని అలంకరించేస్తున్నారు. వాటిల్లో నచ్చినవాటిని ఎంచుకుంటే ట్రెండీ అనే కితాబు అందుకోవడం ఖాయం.


బంగారం లాంటి క్లిప్పులు!

వేసుకునే నగలకు తగినట్లుగా తలలో పెట్టుకున్న క్లిప్‌ని కూడా మార్చేస్తున్న రోజులివి. మామూలు రోజుల్లో పెట్టుకునే క్లిప్పులు ఎలా ఉన్నా... ఏదయినా ప్రత్యేక సందర్భాల్లో మాత్రం నగలకూ, డ్రెస్సుకూ మ్యాచ్‌ అయ్యేలా రకరకాల రాళ్లతో మెరిసే క్లిప్‌లను పెట్టుకోవడం చాలామంది చేసేదే. ఇప్పుడు అలాంటివాటిల్లోనే సరికొత్త డిజైన్లనూ తీసుకొస్తున్నారు తయారీదారులు. అందులో భాగంగా వడ్డాణం తరహాలో మధ్యలో లక్ష్మీదేవి ఉండి అడుగున ముత్యాలూ, చుట్టూ పచ్చలు లేదా కెంపులు పొదిగిన క్లిప్పులు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కేవలం లక్ష్మీదేవి మాత్రమే కాదు... ఏనుగులూ, హంసల డిజైన్లతో గోల్డ్‌ మ్యాటీ ఫినిష్‌తో రూపొందించిన ఈ క్లిప్పులు చూడ్డానికి అచ్చం బంగారంతో తయారుచేసినట్లుగా ఉంటాయి. కాబట్టి నచ్చినవాటిని ఒకటి రెండు కొనిపెట్టుకుంటే సందర్భానికి తగినట్లుగా పెట్టుకెళ్లొచ్చు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు