close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాయా దిండ్లు!

ఏదైనా దేనిలా అది ఉంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుందీ... మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయని నమ్మలేనంత విడ్డూరంగా ఉంటేనే ఈరోజుల్లో ట్రెండు. అలాంటివే ఈ రెడ్‌ బబుల్‌ కుషన్‌ కవర్లు. ఇక్కడ కనిపించే లెదర్‌ లెదరూ కాదు, చెక్క చెక్కా కాదు. మామూలు కవర్లమీదే చెక్క, లెదర్‌, జనపనార, జంతువుల బొచ్చులా కనిపించేలా త్రీడీ ప్రింట్‌ వేశారు. ఇలాంటి వాటిని సోఫాలో వేస్తే... ‘ఇదేంటీ చెక్క కుషన్లను వేశారు...’ అనుకుంటూ అతిథులు ఆశ్చర్యపోవడం, తీరా పట్టుకుని చూశాక అవి మామూలు కుషన్లే అని తెలిసి అవాక్కవడం... ఖాయం. అంతేకాదు, అందరూ ఊలు, లెదర్‌ కుషన్‌ కవర్లను కొనలేరు. అలాంటప్పుడు అచ్చం అలాగే కనిపించే ఈ ప్రింటెడ్‌ కవర్లను వేసేయొచ్చు. ఊలు దిండ్లు కూడా అది బొచ్చు కాదు, ఒట్టి ప్రింటే అంటే అస్సలు నమ్మబుద్ధి కానట్లు ఉంటాయి మరి.


ఈకల లైట్లు... ఎంతందమో!

సుతిమెత్తగా రంగు రంగుల్లో ఉండే ఈకలు మామూలుగానే చూడ్డానికి బాగుంటాయి. ఇక, ఆ ఆకులన్నీ చిన్నసైజు కొబ్బరి చెట్టులా మారి, టేబుల్‌ల్యాంపులా వెలిగితే ఇంకెంత అందంగా ఉంటాయో ఈ ఫొటోలను చూస్తేనే అర్థమవుతుంది. ‘ఫెదర్‌ టేబుల్‌ ల్యాంప్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ఇవి పగలూ రాత్రీ కూడా అలంకరణకు బాగుంటాయి. వీటిలో బోలెడన్ని రంగులు సైతం దొరుకుతున్నాయి.


ల్యాప్‌టాప్‌... పుస్తకంలా!

వాటిని చూస్తే పుస్తకమో ఫైలో చేత్తో పట్టుకున్నట్లుంటుంది. కానీ కావాల్సినప్పుడు అందులో నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు బయటికి వచ్చేస్తాయి. అదే ఈ ‘ల్యాప్‌టాప్‌ బుక్‌ కేస్‌/బుక్‌ కవర్‌’ల ప్రత్యేకత. రకరకాల నోట్‌బుక్స్‌, పాత కాలంనాటి పుస్తకాలూ, ఫైళ్లలా వచ్చే ఈ ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ కేసుల్లో లెదర్‌, ఫో లెదర్‌తో తయారైనవీ దొరుకుతున్నాయి. వీటిలోపల ల్యాప్‌టాప్‌ పెట్టి జిప్‌ వేస్తే చూసినవారెవరైనా వాటిని పుస్తకాలు అనుకోవాల్సిందే. దాంతో దొంగతనానికి గురయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. ఇక, విభిన్నంగా ఉండే ఇవి ఫ్యాషన్‌గా కూడా కనిపిస్తాయి. ఏమంటారు..?


టేబుల్‌పైన మంచం!


 

డైనింగ్‌టేబుల్‌ మీద పచ్చళ్లూ డ్రైఫ్రూట్స్‌ డబ్బాలూ పెడుతుంటాం. అయితే, మామూలు డబ్బాలను టేబుల్‌ మీద ఎక్కువగా పెడితే చూడ్డానికి అంత అందంగా ఉండదు. అసలే, ఆ చోటు హాల్లో నుంచి చూస్తే ఎదురుగా కనిపిస్తుంది. పైగా అతిథులెవరైనా వచ్చినా అక్కడే భోజనం చేస్తారు. కాబట్టి, టేబుల్‌ మీద ఉంచే ఆ డబ్బాలనే వీలైనంత వినూత్నంగా ఉండేవి ఎంచుకుంటే అలంకరణగానూ పనికొస్తాయి. అలాంటిదే... ఈ ‘చార్‌పాయీ అచార్‌’ సెట్‌. వేరు వేరు సైజుల్లో ఉండే నాలుగు డబ్బాలతో పాటు వచ్చే ఈ కంటెయినర్‌ స్టాండు చిన్నసైజు మంచంలా ఉంటుంది. దీన్ని టేబుల్‌ మీద పెడితే అటు అందంగానూ ఇటు ఉపయోగంగానూ ఉంటుంది. బాగుంది కదూ..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు