close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నట్టింట్లో టీపాయ్‌ సుందరి!

అందమైన అమ్మాయే నట్టింట్లో ఒద్దికగా కూర్చుని టీ అందిస్తుంటే ఇంటికొచ్చిన అతిథులెవరికైనా ఆనందంగానే కాదు, ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది కదూ. అందుకే ఈమధ్య లివింగ్‌రూములో అలంకరించే సెంటర్‌ టేబుళ్లూ లేదా కాఫీ టేబుళ్లను అమ్మాయి బొమ్మలతో అలంకరించేస్తున్నారు సౌందర్యోపాసకులు!

ఎంత వర్ణించినా తరగని సౌందర్యం రాజస్థానీ కన్నెపిల్లది. ఆ పదహారణాల పల్లెపడుచు మన ఇంట్లోని టీపాయ్‌లో అందంగా ఒదిగిపోతే ఎవరైనా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. అవునుమరి, టీపాయ్‌ అనగానే నాలుగు కాళ్లతో చేసిన చెక్క బల్ల మాత్రమే అనుకునే రోజులు పోయాయి. కాఫీ కప్పో న్యూస్‌ పేపరో పెట్టుకునేందుకు వీలుగా హాల్లోని సోఫా ముందు వేసుకునే టీపాయ్‌ కూడా కళాత్మకంగా ఉండాలను కుంటోంది ఈతరం. అందులోభాగంగానే ఈ రాజస్థానీ బొమ్మ టీపాయ్‌లు నట్టింట్లో కళకళలాడు తున్నాయి. రాజస్థాన్‌ అద్భుతమైన కోటలకే కాదు, కళలకూ పుట్టిల్లు. కుంచె చిత్రమైనా మట్టి కళాఖండమైనా- అక్కడి సంస్కృతికి అద్దంపట్టే ముద్దుగుమ్మ బొమ్మ అందులో రూపుదిద్దుకోవాల్సిందే. ఒక్క అమ్మాయి అనేముందీ, పల్లె జీవనాన్ని బొమ్మల్లో ప్రతిఫలింపజేయడం అక్కడి కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. ఇక, సంప్రదాయబద్ధమైన ఆహార్యంతో కుండలో మజ్జిగ చిలుకుతూనో తిరగలితో గోధుమలు విసురుతూనో కనిపించే రాజస్థానీ పడతి సోయగాలు కళ్లను కట్టిపడేయడమే కాదు, ఆ బొమ్మల్లోని రంగులు ఇంటికో చిత్రమైన అందాన్ని తీసుకొస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆ అందాల బొమ్మల్ని షోకేసులోనో గోడకో ఎక్కడో ఒకచోట అలంకరిస్తుంటారు. అయితే ఆ బొమ్మలకి అద్దాల్ని బిగించి టీపాయ్‌లుగా తయారుచేయడం మాత్రం ఈమధ్యే పెరిగింది. పైగా అక్కడి కళాకారులు గతంలో మట్టితోనే బొమ్మలు చేసి రంగులద్దేవారు. కానీ ఇటీవల ఆ బొమ్మల్ని పాలీ రెజిన్‌తో చేసి వాటి తలమీదో చేతుల్లోనో అద్దాల్ని బిగించి టీపాయ్‌లుగా మలుస్తున్నారు. దాంతో అవి మరింత సుందరంగా మెరుస్తూ చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. నిజానికి ఇలా అద్దాలకింద మనుషుల బొమ్మలతో టీపాయ్‌లు చేయడం ఈజిప్షియన్ల సంప్రదాయం. అది ఆ ఊరూ ఈ ఊరూ దాటుకుని ఇప్పుడు మనదగ్గరా అందాల్ని చిందిస్తూ అతిథుల్ని మురిపిస్తోంది..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు