close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆభరణమా... అందాల చిత్రమా..!

నగలంటే ఏదో చెక్కుళ్లూ అక్కడక్కడా రాళ్లూ మువ్వలూ... ఎప్పుడూ ఇవేకాదు. ఎనామిల్‌ అందాలతో, అలనాటి ఆలయాల నిర్మాణశైలికి పోటీ వచ్చే డిజైన్లతో దృశ్యకావ్యంలా కనిపించే కంఠాభరణాలూ ఉంటాయి. అలాంటివే ఇవి..!
ఎవరైనా పేరంటానికి పిలిచినా పెళ్లికి ఆహ్వానించినా మన ఆడవాళ్లు ముందుగా ఆలోచించేది ఏ చీర కట్టుకోవాలి, దానిమీదికి ఏ నెక్లెస్‌ పెట్టుకోవాలి... అనే. ఇక, పెళ్లి మనదో మనింట్లో వాళ్లదో అయితే, అందరి చూపులూ మనమీదే పడేలా ప్రత్యేకంగా నగలు చేయించుకోవాల్సిందే. వాటిలోనూ చిన్నచిన్నవి రెండు మూడు నగలు వేస్తే దృష్టి దేనిమీదికీ పూర్తిగా పోదు. అందుకే, ఒక్కటే పెద్ద నగను వేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి, అలా ఒకే ఒక్క నగను ధరించేటప్పుడు అది చాలా ప్రత్యేకంగా ఉండాలి కదా..! అందుకోసమే వేరు వేరు నగల తయారీదారులు రొటీన్‌కి భిన్నంగా ఎనామిల్‌తో అందమైన పెయింటింగ్‌లా ఆభరణాల్ని తయారుచేస్తున్నారు.

రంగు రంగుల్లో...
బంగారంతో చేసిన కొన్ని నెక్లెస్‌లూ హారాల్లో పువ్వులూ పండ్ల డిజైన్లలో అక్కడక్కడా ఎనామిల్‌ పెయింట్‌ వేసినవీ మీనాకారీ డిజైన్లు కూడా వస్తుంటాయి. కానీ వీటన్నిటికీ చాలా భిన్నంగా ఈమధ్య టెంపుల్‌ జ్యువెలరీని చూడచక్కని దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. బృందావనంలో కృష్ణుడు, మాధవుడి రాసలీలలతో పాటు ఇతర దేవీ దేవతల రూపాలతో వస్తున్నాయివి. వీటిని అందంగా చెక్కడంతో పాటు పెయింటింగుల్ని తలపించేలా ఎనామిల్‌తో రంగుల్నీ అద్దుతున్నారు. బృందావనంలో కృష్ణుడూ గోపికలూ ఉన్న నగల్నే తీసుకుంటే చెట్లూ ఆకులూ పండ్లూ నెమళ్లూ ఆవులూ జింకలూ... ఇలా ప్రతివాటికీ అవి సహజంగా కనిపించేలా వేరువేరు ఎనామిల్‌ వర్ణాల్ని వేస్తారు. అలాగే, కృష్ణుడూ, గోపికలు వేసుకున్న దుస్తులకీ రకరకాల రంగులను అద్దుతారు. ఇలా వర్ణరంజితంగా ఉండడంతోపాటు, ప్రతి నగలోనూ ఓ దృశ్యకావ్యం కళ్లకు కట్టడంతో ఈ నెక్లెస్‌లను వేసుకుంటే ఎవరైనా కళ్లార్పకుండా మన కంఠంవైపే చూస్తుండిపోతారనడం అతిశయోక్తి కాదు. ఇలాంటి నగ ఒక్కటి ఉన్నా చాలు కదా..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు