
కేవలం రెండు గంటలపాటు ఓ వ్యక్తిని గమనించగా పుట్టిన అరుదైన రచన ఇది. తనపై బలంగా ముద్రించుకున్న వ్యక్తిత్వానికీ, జీవన సరళికీ నవలా రూపమిచ్చారు రచయిత. ఇందులో ప్రధాన పాత్ర గౌతమ్. నలిగిన బాటను అనుసరించే సగటు వ్యక్తి కాడు. నియమ నిబంధనలకు కట్టుబడకుండా భిన్నమైన ఆలోచనలతో, ఆచరణతో సమాజానికి అప సవ్యంగా కనిపించే కళాకారుడు. కొన్ని అంశాల్లో గౌతమ బుద్ధుణ్ణి స్ఫురింపజేస్తాడు. వివిధ సామాజిక, సాహిత్య అంశాలపై చర్చ, వ్యాఖ్యానంతో సాగే ఈ రచన ఆలోచనలకు పదును పెడుతుంది. చివరకు జీవితాన్ని అందంగా మలచుకోవాలంటే సామూహికంగా ఇప్పట్లో సాధ్యం కాదనీ, అది వ్యక్తిగత స్థాయిలోనే జరగాలనీ నిర్ణయానికి వస్తాడు గౌతమ్. ఉద్యమాలనూ, సిద్ధాంతాలనూ ప్రస్తావించినప్పటికీ కథనం సూటిగా ఉంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ, విపరీతంగా కనిపించే వ్యక్తులను అర్థం చేసుకోవటానికి ఈ నవల ఉపయోగపడవచ్చు.
విపరీత వ్యక్తులు (నవల)
రచన: పి.చంద్రశేఖర అజాద్
పేజీలు: 112; వెల: రూ.120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
ఊరి ఊసులు
కనపర్తి తెలంగాణలోని ఒక పల్లెటూరు. పీర్లపండుగ కోసం ఊరికి వెళ్లడంతో రచయిత చిన్ననాటి తలపోతలు మొదలవుతాయి. హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ చరిత్ర, మొక్కులు చెల్లించే సంప్రదాయం చుట్టూ అల్లుకున్న అనుబంధాల్ని చెబుతుంది ‘కందూరు’. పల్లె ప్రజల మనసుల్లో కల్మషం ఉండదనడానికి నిదర్శనం ట్రంప్‌కి ఫోన్ చేసిన ‘పోచయ్య’ కథ. చిన్నప్పుడు పెరట్లో తెర కట్టి సిన్మాటాకీసు నడిపించిన నాటినుంచి తన సినిమా టాకీసులో ఆడేదాకా సాగిన రచయిత జీవితానికి అద్దంపట్టే ఈ కతల్లో మాండలిక సొగసుకుతోడు స్వర్గమంటే గత స్మృతులే, పంచెగట్టిన పావురాలు లాంటి ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.
మా కనపర్తి ముషాయిరా(కతలు)
రచన: రమేశ్ చెప్పాల
పేజీలు: 126; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
వైవిధ్యభరితం
మపాసా, ఎడ్గర్ అలెన్‌పో, రోవాల్డ్ డాల్ లాంటి ప్రఖ్యాత రచయితలు రాసిన 11 కథల అనువాదాలివి. చక్కటి తెలుగులో ఆసక్తిగా చదివిస్తాయి. సంతలో నేలమీద చిన్న ‘దారంముక్క’ కనపడితే ఎందుకైనా పనికొస్తుందని తీసి జేబులో వేసుకుంటాడు ఒక రైతు. ఆ చర్య అతడి జీవితాన్ని బలితీసుకున్న వైనం హృదయవిదారకం. పొట్టకూటి కోసం ఒళ్లమ్ముకునే యువతి ఓ అనాథను అక్కున చేర్చుకుంటేే, అవసానదశలో ఆమె తనని గుర్తుపట్టకపోయినా ఆ అనాథే అండగా నిలిచి ‘రుణం’ తీర్చుకోవడం మానవీయతకు మచ్చుతునకలా నిలుస్తుంది. ఒక రాత్రి అతిథి’గా వచ్చిన వ్యక్తివల్ల ఒక కుటుంబం మరణానంతర జీవితం గురించి చర్చిస్తూనే ముంచుకొచ్చిన విపత్తుకి బలికావడం బాధాకరం.
ఒక రాత్రి అతిథి
Ç(అనువాద కథల సంపుటి)
రచన: శొంఠి జయప్రకాష్
పేజీలు: 116; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్- 9490482766
స్ఫూర్తికథలు
అసాధారణమైన ఆలోచనలతో సమాజంమీద తమదైన ముద్రవేసిన ఈ సాధారణ మహిళల విజయగాథలు స్ఫూర్తినిస్తాయి. తమ జీవితాల్లో ఎదురైన ఒడుదొడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొని నిలిచినవారూ తోటివారికి సాయపడేందుకు తమ సుఖాలను త్యాగం చేసినవారూ నలుగురికీ భిన్నంగా ఆలోచించి అరుదైన ప్రత్యేకతలను అందిపుచ్చుకున్నవారూ ఇందులో కనిపిస్తారు. పుట్టుకతోనే కనుచూపు కరవైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదల ప్రాంజల్ పాటిల్‌ని గెలిపిస్తే ఒకప్పుడు గుడుంబా తయారీకి పేరొందిన ధూల్‌పేటని పచ్చళ్లతయారీకేంద్రంగా మారుస్తుంది మహిళల సంకల్పం. బస్తీల్లో మహిళల కోసం బాత్రూములు కట్టిస్తుంది చందనతేజ. ఇలాంటి 40 వాస్తవకథల సమాహారం ఈ పుస్తకం.
ఆమె(స్ఫూర్తిమంతమైన మహిళల సక్సెస్ స్టోరీలు)
రచన: వినోద్ మామిడాల
పేజీలు: 144; వెల: 130/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్