close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జ్యూస్‌ తాగేద్దాం... గ్లాసూ, స్ట్రా తినేద్దాం..!

వేసవి వచ్చేసింది. కొబ్బరిబోండాం, లస్సీ, మిల్క్‌షేక్‌... ఇలా ఏది తాగాలన్నా ఓ స్ట్రా తీసుకుంటాం. అలాగే పుట్టినరోజు వేడుకల్లో కూల్‌డ్రింకో పండ్లరసమో అందించేందుకు ప్లాస్టిక్కు గ్లాసుల్ని వాడుతుంటాం. ఆ స్ట్రాలయినా గ్లాసులయినా తాగాక చెత్తబుట్టలో పడేయాల్సిందే. కానీ కొత్తగా వస్తోన్న ఈ స్ట్రాలనీ గ్లాసుల్నీ పారేయకుండా తినేయొచ్చు అంటున్నారు తయారీదారులు!

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 850 కోట్లకి పైగా ప్లాస్టిక్కు స్ట్రాలు వాడుతున్నాం. అవన్నీ భూమిలో కలవాలంటే రెండు వందల సంవత్సరాలు పైనే పడుతుంది. ఇదిలానే కొనసాగితే వాటిల్లోని హానికర రసాయనాలవల్ల ఆరోగ్యం దెబ్బతినడం సంగతలా ఉంచితే, కొన్నాళ్లకి వాటిని కలుపుకోవడానికి మట్టే మిగలకపోవచ్చు. అందుకే ఈమధ్య అనేకమంది పర్యావరణ ప్రియమైన ఉత్పత్తులకి శ్రీకారం చుడుతున్నారు. థానెకి చెందిన ‘నామ్‌’ సంస్థ కూడా ఈ కోవకే చెందుతుంది. ఐస్‌క్రీమ్‌ వేఫర్‌ బిస్కెట్‌ మాదిరిగానే హాయిగా తినేసే స్ట్రాలను తయారుచేయడం ద్వారా ప్లాస్టిక్కుకి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది నామ్‌. గతంలో కొన్ని కంపెనీలు కొబ్బరాకులు, వెదురు, చెక్కలతో పర్యావరణ హితమైన వాటిని రూపొందిస్తే, ఈ సంస్థ గోధుమపిండి, బియ్యప్పిండిలతో ఏకంగా తినే స్ట్రాలనే తయారు చేసింది. గోధుమ లేదా బియ్యప్పిండికి స్టీవియా, కకోవా పొడి, వెజిటబుల్‌ నూనెల్ని జోడించి వీటిని చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన శశాంక గుప్తా చెబుతున్నారు. ఈ స్ట్రా తయారీకోసం ఓ ఏడాదిపాటు పరిశోధన చేయాల్సి వచ్చిందట. ‘టీ, కాఫీల్లో ఏదైనా బిస్కెట్‌ ముంచగానే అది కొన్ని సెకన్లలోనే మెత్తగా అయిపోతుంది. అందుకే మరీ అంత త్వరగా కాకుండా కొన్ని నిమిషాల వరకూ కరిగిపోకుండా ఉండేలా స్ట్రాని రూపొందించాలనుకున్నాం’ అంటోంది శశాంక బృందం. ఎట్టకేలకు వేడి పానీయాల్లో ఇరవై నిమిషాలూ చల్లనివాటిల్లో ముప్ఫై నిమిషాలూ నిలిచి ఉండే స్ట్రాలను చేయగలిగారు. పైగా వాటిని వెనీలా, స్ట్రాబెర్రీ, చాకొలెట్‌, నిమ్మ, పుదీనా, కాఫీ... ఇలా రకరకాల ఫ్లేవర్లలో భిన్న సైజుల్లో తయారుచేసి రెస్టరెంట్లకు అమ్మడంతో మంచి ఆదరణ వచ్చిందట. దాంతో వీటిని రష్యా, ఫ్రాన్స్‌, థాయ్‌లాండ్‌ దేశాలకూ ఎగుమతి చేస్తున్నారట.

ఒక్క స్ట్రా అనే కాదు, మనం వాడిపారేసే ప్లాస్టిక్కు గ్లాసుల సంఖ్యా తక్కువేం లేదు. అందుకే మరికొందరు అగర్‌-అగర్‌ అనే సముద్రనాచుకి నిమ్మ, తులసి, బీట్‌రూట్‌, రోజ్‌మేరీ... వంటి ఔషధ ఫ్లేవర్లను జోడించి జెల్లోవేర్‌, లోలివేర్‌ పేర్లతో జెల్లీ గ్లాసుల్నీ తయారుచేస్తున్నారు. భిన్న సైజుల్లో చేస్తున్న వీటిని పుట్టినరోజు వేడుకల్లో పండ్లరసాలూ శీతల పానీయాలూ అందించేందుకు వాడుతున్నారు. రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ జెల్లో గ్లాసులు తినడానికీ రుచిగానే ఉంటాయి. కాబట్టి తాగేశాక తినొచ్చు లేదా మొక్కల్లో పడేస్తే మట్టిలో కలిసిపోయి మంచి ఎరువుగానూ ఉపయోగపడతాయట.  ఇవన్నీ పక్కనపెడితే, వాడి పారేసే వాటర్‌ బాటిళ్లయితే లెక్కే లేదు. ఒక్క అమెరికాలోనే ఏటా 3,500 కోట్ల ప్లాస్టిక్కు బాటిళ్లను పారేస్తున్నారట. అందుకే  సీసాలోని నీళ్లు అయిపోయేసరికే కుంచించుకుపోయి ఇట్టే నేలలో కలిసిపోయే బాటిళ్లనీ, నీటితో సహా చప్పరించే బాటిళ్లనీ కూడా రూపొందిస్తున్నారు. సో, మున్ముందు తాగి పడేసేవి కాకుండా తాగుతూ తినేవే రానున్నాయన్నమాట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు