close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎగిరిపోతే ఎంత బాగుంటుందో

సి.యమున

రేపటి గురించి తలుచుకుంటే, గుండెల్లో ఆనందం ఉరకలేస్తోంది. మనసుతో పాటూ శరీరమూ తుళ్లి తుళ్లి పడుతోంది. విరిచి కట్టిన రెక్కలు విదుల్చుకుని, పంజరం నుండి ఎగిరిపోతున్న భావన...
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ...’ అప్పుడెప్పుడో నేను పాడిన పాట గుర్తుకొస్తోంది. నేను పాడుతుంటే, ‘ఆ పాట పాడకు అమ్మలూ’ అనేది బామ్మ ఇష్టాయిష్టాలు కలిసిన గొంతుతో.
బామ్మమాటా, ఆ పాటా రెండూ అర్థమయ్యే వయసు కాదు నాది అప్పుడు. మరి ఇప్పుడు బామ్మ బతికి ఉంటే ఎలా ఉండేదో..? ఏముందీ, అమ్మా నాన్నలకు తన చాదస్తం కూడా కలిపి నా మీదకు మరింత ఎగతోసేది. అసలు ‘ప్రేమ’ అని పిల్లలు అనగానే ‘తప్పు’ అంటూ ఈ పెద్దలు ఎందుకు అంత గోల చేస్తారో అర్థం కాదు. దాని బదులు ‘పెళ్లి’ అనొచ్చుగా అన్నీ రెండక్షరాల పదాలే... జీవితాన్నే మార్చేసే పదాలు.
ఏదన్నా అంటే, ‘కులం, మతం, అంతస్తు...’ అని ఉపన్యాసాలు దంచుతారు. రేపే ఈ ఇంటి నుండి దూరమై, కుషాల్‌కి దగ్గరవుతున్నాను. నా ఇల్లు ఏర్పరచుకోబోతున్నాను. ఇహ ఈ ఆలోచనలు అనవసరం... మళ్లీ ఈ ఇంటికి ఎప్పుడన్నా వస్తానా... రానిస్తారా..?
ఎంతో ఇష్టమైన నా గదీ, పుస్తకాలూ... హాలులో ఉయ్యాల... అమ్మ పెంచిన మొక్కలు...
‘అనూ, పాపం మొక్కల్ని ఎండగట్టకు, మర్చిపోకుండా నీళ్లు పొయ్యి. నాలుగు రోజుల్లో తిరిగొచ్చేస్తాగా’ కాస్త బ్రతిమాలుతూ, మరి కొంచెం గారం చేస్తూ చెప్పి వెళ్లిన అమ్మ మాటలు టక్కున గుర్తొచ్చి, బాల్కనీలోకి వెళ్లాను. ఎదురుగా ఎత్తుగా ఉన్న గ్రిల్‌ మీద పచ్చగా మొక్కలూ, పూలూ అలా మెల్లగా ఊగుతున్నాయి. ఎందుకో అమ్మ చిరునవ్వు గుర్తుకొచ్చింది.
అమ్మకి మొక్కలంటే ప్రాణం. సూర్యోదయంతోనే లేచి అమ్మానాన్నా బాల్కనీలోని కుర్చీల్లో కూర్చుని మొక్కలని చూస్తూ కాఫీ తాగుతారు. నేను వెళ్లిపోయిన తరువాత కూడా వాళ్లు అలాగే కాఫీ తాగుతూ ఆస్వాదిస్తారా లేదా నన్ను తిట్టుకుంటూ గడుపుతారా?
అంతలో పిచ్చుక అరుపు వినపడింది. ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను. పక్కగా ఉన్న మల్లె మొక్క కొమ్మల మధ్య, చిన్న బంతిలాగా ఉన్న పిచ్చుక పిల్ల అరుస్తోంది.
‘వావ్‌’ అనుకుంటూ అటుకేసి వెళ్లబోయి, ఎగిరిపోతుందేమో అనే అనుమానంతో ఆగిపోయాను. దూరంనుండే దాన్ని చూస్తున్నాను. ఉన్నట్లుండి ఎక్కడినుండో అరుచుకుంటూ, రివ్వున ఓ కాకి వచ్చి ముద్దుగా అరుస్తున్న పిచ్చుక పిల్ల మీద దాడి చేసింది. నా గుండెల్లో దడ.
‘అమ్మో’ అంటూ కళ్లూ, చెవులూ మూసుకుని కేక పెట్టాను. కావు కావుమంటున్న కాకి, బలహీనంగా వినపడుతున్న పిచ్చుక పిల్ల గొంతు... అంతలో నా పాదాలపై చిన్ని స్పర్శ. కళ్లు తెరిచి చూశాను బుల్లి పిచ్చుక.
కాకి అరుస్తూ ఎగిరిపోయి కాస్త దూరంలో కనపడుతున్న చెట్టు మీద వాలింది. దాని అరుపుకు జవాబన్నట్లుగా ఎక్కడో మరికొన్ని కాకులు గొంతులు కలుపుతున్నాయి.
‘బాబోయ్‌, అవన్నీ కలిసి గుంపుగా వచ్చి ఈ పిచ్చుకని ఎటాక్‌ చేస్తాయా? మరి ఎలా ఇప్పుడు...’
పిచ్చుక పిల్ల నా పాదాల మీద నుండి దిగి, మెల్లగా పక్కనే ఉన్న కుర్చీ అడుగునకు వెళ్లింది. అక్కడక్కడే చిన్ని చిన్ని గంతులు వేస్తూ తిరుగుతోంది. అదే దాని నడక స్టైల్‌ అనుకుంటాను. పిచ్చుక పిల్లల్ని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు.
అది ముక్కుతో నేలను గుచ్చుతోంది, ఏదో తింటానికన్నట్లు.

‘బాబోయ్‌, దీనికి ఇప్పుడు తిండి పెట్టాలా? ఏం పెట్టాలి...’ దానిని విడిచి లోపలికి వెళ్లి ఏదన్నా తేవాలన్నా, కాకి వచ్చి దాడి చేస్తుందని భయం. కాస్త ధైర్యం చేసుకుని, గబుక్కున లోపలికి పరుగెత్తి నా మొబైల్‌ తెచ్చుకున్నాను.
ఇంతలో కుషాల్‌ నుండి కాల్‌ వచ్చింది. ‘‘కుష్‌, కుండీలో పిచ్చుక పిల్ల వచ్చింది... కాకి దాన్ని...’’
‘‘నేను మన పెళ్లి ఏర్పాట్ల గురించి ఫోన్‌ చేస్తే... నువ్వేంటి అనన్యా, పిచ్చుకా... కాకీ అని మాట్లాడుతున్నావు. నా టెన్షన్‌ అర్థం చేసుకో’’ నా మాటలకు అడ్డుపడుతూ విసుగ్గా అన్నాడు.
‘‘సారీ కుష్‌’’ అన్నాను మనస్ఫూర్తిగా.
‘‘అన్ని ఏర్పాట్లూ బాగానే జరుగుతున్నాయి. సాక్షి సంతకం చేయటానికి నా ఫ్రెండ్‌ డైరెక్ట్‌గా రిజిస్టర్‌ ఆఫీసుకి వస్తానన్నాడు. నీ ఫ్రెండ్స్‌ వస్తున్నారా... డ్రస్‌లు సర్దుకున్నావా?’’ వరసగా ప్రశ్నలు.
‘‘సర్దుకుంటున్నాను... ఫ్రెండ్స్‌ వస్తున్నారు...’’ తన ప్రశ్నలకి గబగబా జవాబు చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
పెళ్లి తలపుకు రాగానే గుండెలో గడబిడ ఆలోచనలు...
తప్పు చేస్తున్నానా... తప్పటడుగు వేస్తున్నానా...’ నాలో ప్రశ్న.
‘హుఁ నాది తప్పటడుగు కాదు... పెద్దవాళ్లు ముందుకు అడుగు వెయ్యకపోతే ఏం చెయ్యాలి? చదువుకున్నాను... ఉద్యోగం చేస్తున్నాను... నేనేమన్నా చిన్నపిల్లనా..?’ నా సమర్థింపు జవాబు.
‘నేను మటుకు చిన్న పిచ్చుక పిల్లనే... నన్ను చూసుకో’ అన్నట్టు నా పాదం మీదకి మళ్లీ ఎక్కింది పిచ్చుక. చక్కిలిగిలిగా అనిపించింది. అంతలోనే గెంతుతూ కుర్చీ కిందకు వెళ్లింది.
ఆలోచనలకో ఏమో అలసటగా, చాలా దాహంగా అనిపించింది. పరుగెత్తుతున్నట్లే కిచెన్‌లోకి వెళ్లి, బాటిల్‌నిండా ప్యూరిఫైడ్‌ వాటర్‌ నింపుకుని వచ్చాను. కాసిని నీళ్లు తాగాను. ‘ఏం చేస్తోంది ఈ బుజ్జి పిచ్చుక’ అనుకుంటూ కుర్చీ కిందికి తొంగి చూశాను. కళ్లు తిరిగినట్లు అయ్యింది.
ఎదురుగా తలకాయలేని పిచ్చుక. ‘నేను నీళ్లు తెచ్చుకోవటానికి వెళ్లి వచ్చిన ఈ కాస్త సమయంలోనే కాకి దాని తల కొరికేసిందా?’’ దుఃఖం తన్నుకొస్తోంది. చెమటలు పోస్తున్నాయి...
అంతలో ‘భూమిలో నుండి విత్తు మొలకెత్తినట్లు’ బాల్‌లాగా ఉన్న దాని శరీరం నుండి తల బయటకు వచ్చింది. నా కళ్లను నేనే నమ్మలేక పోయాను. అస్సలు తల కనబడకుండా, శరీరంలో ఎలా గుచ్చేసుకుందో అర్థం కాలేదు.
‘ఏదో ఒకటి, అది బ్రతికే ఉంది... అది చాలు’ అని ఊపిరి పీల్చుకున్నాను. అది గెంతుతూ మళ్లీ నేలను ముక్కుతో తడిమి తడిమి చూస్తోంది... ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు.
వెంటనే అమ్మకు కాల్‌ చేశాను. చదువులో సమస్య అయినా, ఒంట్లో బాగోకపోయినా, చివరకు బోరు కొట్టినా, ‘అమ్మా, ఏదో ఒక సలహా చెప్పు... హెల్ప్‌ చెయ్యి’ అంటూ అమ్మను విసిగించటం నాకు అలవాటే.
అమ్మ ఫోన్‌ తియ్యలేదు. రెండు మూడుసార్లు ట్రై చేశాను అయినా ఫోన్‌ తియ్యలేదు. తన కజిన్‌ కూతురి పెళ్లంటూ నాన్నను కూడా తీసుకుని వెళ్లింది. నాకు సెలవు దొరకదనేసరికి వదిలిపెట్టింది, లేకపోతే నన్ను కూడా పట్టుకుపోయేది.
ఒక్కక్షణం ఆలోచించాను. చేతిలోని మొబైల్‌లో గూగుల్‌లోకి వెళ్లాను. పిచ్చుక గురించి గబగబా చదవడం మొదలుపెట్టాను. ‘పిచ్చుక, తను ఎగరటానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం సక్సెస్‌ అవ్వకపోవచ్చు’ అది చదవగానే నాకు అనిపించింది... పొద్దున్న ఎగిరే ప్రయత్నంలోనే అది వచ్చి మా కుండీలో పడిపోయిందని’ చదవటం ముగించేసరికి. ‘అలా తల బాడీలో దాచిపెట్టేసుకుందంటే, అది నిద్రపోతోందని అర్థమనీ, ఆ చిన్న పిచ్చుకకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫుడ్‌ పెట్టాలనీ... పప్పులూ, బియ్యం పురుగులు లాంటివి దాని ఆహారం అనీ అర్థమయ్యింది.
‘పప్పులూ బియ్యం సరే... పురుగుల విందు ఎలా ఏర్పాటు చేయాలి’ నా ఆలోచనకు నవ్వుకున్నాను. ఇలా దీని పక్కనే కూర్చోవటం కష్టం... లోపలికి వెళ్లాలంటే కాకి వస్తుందని భయం. ‘ముందు దీనికి ఏదన్నా కవర్‌ వేద్దాం’ అని బాగా ఆలోచించి, రెండు పల్చటి దుప్పట్లు తీసుకొచ్చి రెండు కుర్చీలు దగ్గరకు చేర్చి, వాటి చుట్టూతా కవర్‌ చేశాను. నేల మీద తాకుతున్న దుప్పటి మీద చిన్న కుండీలు బరువు పెట్టాను. అది దానికింద నుండి దూరి బయటకు రాకుండా పై నుండి చూసేందుకు వీలుగా కాస్త పెద్ద కంత పెట్టి వదిలేశాను.
అమ్మనుండి కాల్‌... ‘‘ఏమిటీ, ఫోన్‌ తియ్యవు’’ విసుగ్గా అరిచాను.
‘‘ఇప్పుడే పెళ్లి అయ్యింది. ఆ మేళాలలో నీ ఫోన్‌ వినపడలేదు. ఏంటీ, ఏదన్నా ప్రాబ్లమా?’’ అమ్మ కంగారుగా అడుగుతోంది. అవతల పెళ్లి సందడి, ఫోన్‌లో వినపడుతోంది. నాలిక్కొరుక్కున్నాను.
‘‘సారీ అమ్మా... మన కుండీలో పిచ్చుక వచ్చింది’’ మొత్తం గడగడా చెప్పేశాను.
‘‘ఓస్‌ పిచ్చుకకా ఈ హడావిడి. చిన్నప్పుడు మా పూరింటి కప్పులో గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెట్టేవి. దానికి కాసిని బియ్యం, పప్పులూ వెయ్యి సరేనా! అన్నట్లు, పెళ్లి చాలా బాగా జరిగింది అనూ, అందరూ ‘అనన్య రాలేదే’ అని అడిగారు. పెళ్లికూతురి బ్లౌజ్‌ల వర్క్‌ చాలా బాగుంది. నీ పెళ్లికి కూడా అలాగే చేయించాలి... అవతల పిలుస్తున్నారు ఉంటాను’’ అంటూ హడావిడిగా ఫోన్‌ పెట్టేసింది.
అమ్మ పెళ్లి కబుర్లకు నాలో కలవరం... దాన్ని పక్కకు నెట్టేస్తూ కాసిని బియ్యపు గింజలూ, కందిపప్పూ తీసుకొచ్చి నేలమీద ఆనుకుని ఉన్న దుప్పటిని కొంచెం ఎత్తి దాని దగ్గరగా వేశాను. ఓ ప్లేట్లో నీళ్లు పెట్టాను.
రేపటికోసం బట్టలు సర్దుకోవడానికి బెడ్‌రూమ్‌లోకి నడిచాను. టీషర్ట్‌లు తీసుకుని సూట్‌కేస్‌లో పెట్టాను. ఆ పక్కనే కుషాల్‌ నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన పింక్‌ గాగ్రా తొంగి చూసింది. దాన్ని తీసి అపురూపంగా సూట్‌కేస్‌లో పెట్టాను. సూట్‌కేస్‌ మొత్తం నిండిపోయింది... కుషాల్‌ మీద ప్రేమతో నా మనసు నిండిపోయినట్లు.
ఈ సర్దుడులో ఓ పట్టుచీర జారి కింద పడింది. గబుక్కున వంగి దాన్ని తీశాను.


‘మా అమ్మాయికి తగిన వరుణ్ణి ప్రసాదించు తల్లీ అంటూ ఈ చీర అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకువచ్చాను. గౌరీ పూజ అప్పుడు నువ్వు ఇదే కట్టుకోవాలి’ అమ్మ మాటలు మనసులోకి చొచ్చుకి వచ్చాయి. ఆ మధ్య మేము కంచి వెళ్లినప్పుడు అమ్మ ఈ ఎర్రటి పట్టుచీర కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించింది. ‘నీకు ఇంకా పెళ్లే ఫిక్స్‌ కాలేదు... మీ అమ్మ అప్పుడే షాపింగ్‌ మొదలెట్టింది’ అన్నారు నాన్న అమ్మని ఆటపట్టిస్తూ.
‘అమ్మవారు తలుచుకుంటే, పెళ్లి ఈ క్షణాన కుదరొచ్చు. అయినా ఈ వాదన అనవసరం, ఎప్పుడైనా పెళ్లి చేసుకోనీ, అనన్య ఈ చీర కట్టుకునే గౌరీ పూజ చేయాలి’ అమ్మ కరాఖండిగా చెప్పేసింది.
అమ్మ అంతే, నా పెళ్లి గ్రాండ్‌గా చేయాలని కొన్ని ఏళ్లుగా బ్యాంక్‌లో ప్రతి నెలా డబ్బులు డిపాజిట్‌ చెయ్యటం... కొంచెం కొంచెం బంగారం కొనటం చేస్తోంది.
ఓసారి ‘ఏమిటీ, ఇవన్నీ అవతలివారికి లంచాలా’ అన్నాను సరదాగా.
‘ఉహుఁ ఇవన్నీ తల్లి ప్రేమకు గుర్తులు. రేపు నువ్వూ ఓ బిడ్డను పెంచితే తెలుస్తుందిలే’ అంటూ నవ్వేసింది.
చేతిలోని చీర భారంగా అనిపించింది. వెనక్కి పెట్టేసి తలుపు మూసేశాను. ‘ఈ సర్దుడులో పడి దాన్ని మర్చిపోయానే’ అనుకుంటూ బాల్కనీలోకి నడిచాను. దుప్పటి కంతపై నుండి తొంగి చూశాను. పిచ్చుక పిల్ల కనపడలేదు. కంగారుగా మరింత వంగి చూశాను. అది కుర్చీ కాలు వెనుక కూర్చునుంది ఏదో దాక్కునే ఆట ఆడుతున్నట్లు. ‘దొంగా, అల్లరిగా తయారయ్యావు’ అన్నాను దానికేసి ఓ ఫ్లయింగ్‌ కిస్‌ విసిరేసి. దానికి నేను అన్నదేదో అర్థమయినట్లు, ఇవతలకు వచ్చి పైకి నాకేసి చూసింది. మరుక్షణం నిద్రపోయింది.
అలా చూస్తూనే ఉన్నాను. కాసేపు తలని పొట్టమీద ఈకల్లో దోపుకుని పడుకోవడం... అంతలోనే లేచి గెంతుతూ నడవడం, గింజలు తినటం... మళ్లీ టక్కున పడుకోవడం... ముద్దుగా అనిపించింది.
పిచ్చుక ఫొటోలూ, దాని ఎగురుడూ, నడకా, నిద్రా, గింజలు తినటం అన్నీ వీడియోలు తీసి వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కి షేర్‌ చేశాను. ఆదివారం సెలవుకావడంతో పిచ్చుక గురించి అందరూ ఒకటే ముచ్చట్లు చాటింగ్‌లో. పిచ్చుక పిల్లతో ఇలా... ఇంత టైమ్‌ గడపడం నాకే నమ్మబుద్ధి కావడంలేదు.
ఎప్పుడో పొద్దున తిన్న బ్రేక్‌ఫాస్ట్‌... ఆకలి దంచేస్తోంది. పిల్ల పిచ్చుక టక్కుటక్కున గింజలు కొరుకుతోంది. ‘‘బుజ్జీ నువ్వు తింటున్నావు కదా... మరి నేను కూడా ఫుడ్‌ తినొద్దూ’’ అంటూ వంటగదిలోకి నడిచాను. ఓ పని చేయటం, మధ్యలో దాన్ని తొంగి చూడటం... అలా ఓసారి వచ్చినప్పుడు దుప్పటి అడుగునుండి దూరి ఇవతలికి వచ్చేసి కనపడింది.
‘‘అయ్యో, లోపలికి వెళ్లు’’ అంటూ దాన్ని మెల్లగా ముట్టుకుని కుర్చీ అడుగుకి నెట్టాను. మెత్తని స్పర్శ ఏదోలా అనిపించింది. దానికి భయమేసిందేమో కిచకిచలాడింది.
‘‘భయపడకు నేను నిన్నేమీ చెయ్యను’’ అంటూ అక్కడే నేలమీద కూర్చుని సున్నితంగా ముట్టుకున్నాను. ఈ మాటు అరవలేదు... నా మాట అర్థమయ్యిందో లేదా చేతి స్పర్శలో ప్రేమ తెలిసిందో... నిమురుతూ అలా కూర్చుండిపోయాను. అది ఆనందిస్తున్నట్లుగా తల ఎత్తి కళ్లు మూసుకుంది. ఒలకబోసిన నీళ్లూ, చిందరవందర చేసిన గింజలూ, దానిలోనే వేసిన రెట్టలూ అంతా గమనిస్తుంటే చిన్న పిల్లలు ఆగడం చేసినట్లుగా అనిపించింది. అదంతా కూడా జాగ్రత్తగా ఒంటి చేత్తో వీడియో తీసి ఫ్రెండ్స్‌కు పోస్ట్‌ చేశాను.
‘ఏంటీ, దాన్ని చంటి బిడ్డలాగా చూస్తున్నట్లున్నావు,’ ‘అంత ప్రేమ ఏంటి తల్లీ’ ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైటా’ ...రకరకాల ఎమోజీలు ఎటాచ్‌ చేసి, ఫ్రెండ్స్‌ కామెంట్స్‌.
ఇంతలో ఏదో మాడిన వాసన తేలి వచ్చింది. అంతే నిమురుతున్న పిచ్చుకను కుర్చీ కిందికి నెట్టి వంటగదిలోకి పరిగెత్తాను. గిన్నె నల్లగా మాడిపోయి, పొగతో వంటగది నిండిపోయింది. గట్టు అంతా పొంగిన పాలు. అది చూడగానే నీరసమొచ్చింది.
అదే అమ్మ ఉండి ఉంటే ‘నీ ధ్యాస ఎక్కడో ఉన్నట్లుంది... ఈ కాలం పిల్లలికి చదువూ, ఉద్యోగం టెన్షన్స్‌ ఎక్కువ కదా, ఫరవాలేదు నేను క్లీన్‌ చేస్తాలే’ అని నేను చేసిన పొరపాటును ప్రేమగా తను సరిదిద్దేది.
అదంతా క్లీన్‌ చేసి చేతులు కడుక్కుంటుండగా అమృత నుండి ఫోన్‌.
‘‘పిచ్చుక ఫొటోలూ వీడియోలూ ఏంటి, రేపు పెళ్లి పెట్టుకుని పిచ్చుకను పెంచటంలో బిజీ అయిపోయినట్టున్నావు’’ అంది నవ్వుతూ.
‘‘పాపం చిన్నపిల్ల, వదిలేయలేను కదా. వాచ్‌మాన్‌కి కాల్‌ చేశాను దాన్ని తీసుకెళ్లి ఏదన్నా మానేజ్‌ చేస్తాడేమో అని. పనిమీద బయటకు వెళ్లాడట సాయంత్రం రాగానే వస్తానని చెప్పాడు.’’
‘‘ఏదైనా భలే కూల్‌గా ఉన్నావు అనూ, గుడ్‌. దండలకి ఆర్డర్‌ ఇచ్చాను కదా అవి కలెక్ట్‌ చేసుకుని, బ్యుటీషియన్‌ను తీసుకుని మీ ఇంటికి వస్తాను. చీర కట్టటం, మేకప్‌ తను చూసుకుంటుంది.’’
‘‘భయంగానే ఉంది అమృతా... కానీ ఏం చెయ్యను’’ నిస్సహాయంగా అన్నాను.
‘‘హే కమాన్‌, భయపడకు. కుషాల్‌ కొత్తవాడు కాదు రెండేళ్లుగా నీ కొలీగ్‌, ఫ్రెండ్‌, ప్రియుడూ... ఇప్పుడు లైఫ్‌ పార్టనర్‌ కాబోతున్నాడు. అంతా బానే ఉంటుంది’’ అంటూ ధైర్యం చెప్పి ఫోన్‌ పెట్టేసింది.
గుండెల్లో బెరుకు తగ్గి ఊపిరి పీల్చుకున్నాను. ‘ఈ బుల్లిది ఎలా ఉందో’ అనుకుంటూ మళ్లీ పిచ్చుక పిల్ల దగ్గరకు నడిచాను. దుప్పటి కంత నుండి తల పెట్టి ‘‘బుజ్జులూ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు’’ అంటూ తొంగి చూశాను కనపడలేదు.
‘ఎక్కడో మూలకి కూర్చునుంటుంది’ అని పరీక్షగా చూస్తున్నాను. ఇంతలో నా తల పై నుండి పిచ్చుక అరుపు. తల ఎత్తి చూశాను. చిన్ని పిచ్చుక... గ్రిల్‌ మీద కూర్చుని ముద్దుగా అరుస్తోంది.
‘అరె ఇది బయటకు వచ్చేసినట్టుంది’ అనుకుంటుండగానే దాని అరుపు ఆపింది.
తల అటూ ఇటూ ఊపుతూ, ఓసారి నావంక చూసింది వీడ్కోలు చెపుతున్నట్లుగా. రెక్కలు విప్పి ఒక్కసారిగా రివ్వున ఎగిరింది. విజయవంతంగా వినీల ఆకాశంలోకి దూసుకెళ్లింది.
అది ఎగిరినందుకు ఆనందమో విడిచి వెళ్లిపోయిందన్న దుఃఖమో నా కళ్లల్లో చెమ్మ... మనసు భారమయ్యింది.
అది ఇప్పటిదాకా ఉన్న బాల్కనీ వైపు చూశాను... శూన్యంగా అనిపించింది. అక్కడున్న కుర్చీలో కూలబడ్డాను. దాని మొదటి ప్రయత్నం విఫలమయ్యి, కాకి దాడికి గురయ్యి నా చెంతకు చేరింది. ఈ కాస్త టైమ్‌లోనే దాని నిద్రనీ, నడకనీ, తిండినీ, అది అరుస్తోందనీ గమనించడం... వాటిని అందరితో మురిసిపోతూ పంచుకోవడం... ఇంత అనుబంధం ఏర్పడింది.
అది ఎగిరిపోవడం సహజం... అది తన జీవితం... నేను సంతోషించాలి... మరి బాధపడుతున్నానే... మరి ఇంత దిగులు కమ్మేసిందే మనసులో...
ఓర్చుకోలేక ఓదార్పు కోసం అమ్మకు కాల్‌ చేశాను. ‘‘అమ్మా... మరి పిచ్చుక’’ అని నా బాధ చెప్పబోయాను. అదేమీ వినిపించుకోకుండా ‘‘అప్పగింతల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాపం పెద్దమ్మ కూతురు వెళ్లిపోతోందని ఎంత బాధ పడుతుందో తెలుసా... లేక లేక పుట్టింది. గారంగా పెంచుకుంది’’ బాధతో మాట రానట్లు
ఫోన్‌ పెట్టేసింది.
నాలో ఉలికిపాటు...
‘పద్ధతి ప్రకారం పెళ్లి చేసి, అప్పగింతలు చేసి పంపుతున్న అక్క కూతురి గురించి ఇంత బాధ పడుతోందా అమ్మ? మరి చెప్పా పెట్టకుండా కన్న కూతురిని, నేను వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే తట్టుకోగలదా...’
‘పిచ్చుక పిల్లతో కొన్ని గంటల అనుబంధానికే ఇంత ఫీల్‌ అయిపోతుంటే, ఇన్నేళ్లు నన్ను పెంచిన అమ్మానాన్నా మనసు ఎంత కష్టపెట్టుకుంటారు...’ అంతర్మథనంతో ఒక్క పెట్టున దుఃఖం తన్నుకొచ్చింది.
‘కుష్‌, మనం తప్పు చేస్తున్నామనిపిస్తోంది. ఎన్నాళ్లైనా మన పేరెంట్స్‌ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం... ప్లీజ్‌ అప్పటిదాకా అగుదాం’ అని కుషాల్‌కి ఫోన్‌ చేసి చెప్పడానికి మొబైల్‌ చేతిలోకి తీసుకున్నాను. నా ప్రేమ మీదా, కుషాల్‌ మీదా నాకు నమ్మకం ఉంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు