అదిరే ఆవిష్కరణ! - Sunday Magazine
close

అదిరే ఆవిష్కరణ!

మార్పు చిన్నదైనా దాని ప్రభావం ఎంతో పెద్దగా ఉంటుందనడానికి నిదర్శనం ఈ ఆవిష్కరణలు. అలాగని ఇవేవో విదేశీయులు తెచ్చినవి కాదు, పక్కా లోకల్‌! వీటి గురించి చదివాక ఆవిష్కర్తల్ని ప్రశంసించకుండా ఉండలేరెవరూ!


చక్రాల కుర్చీ స్కూటరైంది!

దివ్యాంగులు ఇంట్లో, ఆఫీసు పరిసరాల్లో తిరగడానికి ఉపయోగపడుతుంది వీల్‌ఛైర్‌. కాస్త దూరం వెళ్లాలనుకునేవాళ్లు స్కూటర్‌కు అదనపు చక్రాలు ఏర్పాటు చేసుకుంటారు లేదంటే కారులో ప్రయాణిస్తారు. ఇకపైన ఆ అవసరం లేకుండా వీల్‌ఛైర్‌లోనే ఊళ్లో ఎక్కడికైనా వెళ్లేలా సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించింది ‘నియో మోషన్‌’. ఐఐటీ- మద్రాస్‌ మెకానికల్‌ విభాగం ప్రొఫెసర్‌ సుజాత శ్రీనివాసన్‌, ఇక్కడే ఎంటెక్‌ చేసిన స్వస్తిక్‌ సౌరభ్‌ దీని వ్యవస్థాపకులు. వీల్‌ఛైర్‌లను మరింత సౌకర్యవంతంగా తయారు చేసే ఉద్దేశంతో ఐఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో 2016 నుంచి వీరి బృందం పరిశోధనలు చేస్తోంది. వేలమంది దివ్యాంగులతో మాట్లాడి వాళ్లు వీల్‌ఛైర్‌ వాడకంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. వైద్యులనీ సంప్రదించారు. భిన్నమైన అవసరాలూ, ఒడ్డూపొడుగూ ఉన్నవారికి ఒకే రకమైన చక్రాల కుర్చీలు ఉంటున్నాయని గమనించారు. అందుకని వాటిని కస్టమైజ్‌ చేసి తేలిగ్గా నడిపేలా మార్పు చేయాలను కున్నారు. అదే క్రమంలో వీల్‌ఛైర్‌లోనే స్వల్ప దూరాలు ప్రయాణించే ఏర్పాటూ ఉండాలనుకున్నారు. గతేడాది చివర వీరు నియోఫ్లై(వీల్‌ఛైర్‌), నియోబోల్ట్‌(వీల్‌ఛైర్‌ స్కూటర్‌)లను అభివృద్ధి చేశారు. వినియోగదారుల వివరాలు తీసుకున్నాకే వీల్‌ఛైర్‌కు తుది రూపం ఇస్తారు. దాదాపు 18 రకాల వీల్‌ఛైర్లను వీరు తయారుచేస్తున్నారు. వీల్‌ఛైర్‌కు ముందువైపు హ్యాండిల్‌, రెండు చక్రాలూ ఉండే స్కూటర్‌నీ జతచేయవచ్చు. దీన్ని నాలుగు గంటలపాటు ఛార్జింగ్‌ చేసుకుంటే 30 కి.మీ. దూరం వెళ్లొచ్చు. గమ్యం చేరుకున్నాక ముందరి భాగాన్ని తీసేసి వీల్‌ఛైర్‌గా ఉపయోగించుకోవచ్చు. వీల్‌ఛైర్‌ ధర రూ.39వేలు కాగా, దీనికి స్కూటర్‌నీ అమర్చాలనుకుంటే రూ.55వేలు అవుతుంది. దేశంలో ఇప్పటివరకూ 700 వీల్‌ఛైర్‌, స్కూటర్‌లను అమ్మినట్లు చెబుతున్నాడు స్వస్తిక్‌.


పాలిథీన్‌ వాడొద్దిక...

ఫుడ్‌ డెలివరీ, ఆహార పదార్థాల ప్యాకింగ్‌ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ పాలిథీన్‌ వినియోగమూ ఎక్కువవుతోంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు. పాలిథీన్‌ కవర్ల ప్యాకింగ్‌ను అరికట్టేందుకు బయోడిగ్రేడబుల్‌ సంచుల్ని తెస్తోంది గోవాకు చెందిన ‘లా ఫ్యాబ్రికా క్రాఫ్ట్‌’. ఘనపదార్థాలతోపాటు ద్రవపదార్థాల్నీ కాగితపు సంచుల్లో తీసుకువెళ్లేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. పత్తి, కాగితం, గోధుమగడ్డి మొదలైన సేంద్రియ పదార్థాల మిశ్రమంతో వీటిని తయారుచేస్తున్నారు. ఆపైన వివిధ సైజుల్లో కవర్లుగా మార్చి అమ్ముతున్నారు. ద్రవపదార్థాలు లీకవ్వకుండా ‘పాలీ లాక్టిక్‌ యాసిడ్‌’ లేయర్‌ను ఈ కవర్లలో పెడుతున్నట్టు చెబుతారు దీని వ్యవస్థాపకుడు సచిన్‌ గంగాధరన్‌. దాదాపు రెండు రోజులపాటు వీటిలో ద్రవ పదార్థాలు లీకవ్వకుండా ఉంటాయి. ఇప్పటికే గోవాలో పలు రెస్టరెంట్లు వీటిని ఉపయోగిస్తున్నట్టు చెబుతాడు సచిన్‌. ఒక్కో సంచి ధర రూపాయి ఉంటుంది. ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన సచిన్‌... ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా మూడేళ్లపాటు కొత్త తరహా కాగితంపైన పరిశోధనలు చేశాడు. కూరగాయలూ, కిరాణా సరుకులూ తెచ్చేందుకు వీలుగా 15 కిలోల బరువుని కాసే కవర్లనీ ఈ కాగితంతో తయారుచేస్తున్నారు.


దారి చూపే పరికరం!

స్మార్ట్‌ఫోన్లో రూట్‌మ్యాప్‌ను చూసుకుంటూ నగరాల్లో బైక్‌ మీద కొత్త ప్రదేశాలకు వెళ్లడం చాలా కష్టం. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాల్ని గమనించక ప్రమాదాలు జరుగుతాయి. అదే మీ హెల్మెట్‌కు ‘నావిజర్‌’ పరికరం ఉంటే గనుక అదే మార్గనిర్దేశం చేస్తుంది. మిలింద్‌ మనోజ్‌, ప్రదీప్‌ పార్థసారథి, రియా గంగమ్మ... బెంగళూరులోని ఎం.ఎస్‌.రామయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నారు. తమ ప్రాజెక్టులో భాగంగా ద్విచక్రవాహనాలను నడిపేవాళ్లు మొబైల్‌ చూసే అవసరం లేకుండా మార్గనిర్దేశం చేసే నావిజర్‌ పరికరాన్ని రూపొందించారు. దీన్ని గడ్డం భాగంలో ఉండేలా హెల్మెట్‌కు బయట అమర్చుకోవాలి. ఈ పరికరం బ్లూటూత్‌ సాయంతో మొబైల్‌లోని ఆప్‌కి అనుసంధానించి ఉంటుంది. నావిజర్‌కు ఉండే ఎల్‌ఈడీ లైట్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఈ పరికరాన్ని ‘మ్యాప్‌మై ఇండియా’ మ్యాపులతో అనుసంధానిస్తారు. గమ్యాన్ని ఎంపికచేసుకున్నాక ప్రయాణంలో కుడివైపు తిరగాల్సి వచ్చినపుడు నావిజర్‌ దగ్గర కుడివైపు లైటు, ఎడమవైపు తిరగాల్సి వచ్చినపుడు ఎడమవైపు లైటు వెలుగుతూ పది సెకన్లు ముందుగానే సంసిద్ధం చేస్తాయి. దీంతోపాటు వీరిచ్చే ఇయర్‌ఫోన్స్‌, స్పీకర్లని హెల్మెట్‌కు లోపల అమర్చుకోవచ్చు. స్పీకర్‌ సాయంతో పాటలు వినొచ్చు, ఫోన్‌కాల్‌ మాట్లాడొచ్చు. ఏ హెల్మెట్‌కైనా అమర్చుకునే వీలుండే నావిజర్‌ ధర రూ.3500. ఐఐఎమ్‌ బెంగళూరు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడం విశేషం. ఎంపికచేసిన ఫోన్‌ నంబర్‌కు ప్రమాద సమయంలో సమాచారాన్ని తెలిపేలా మెసేజ్‌ వెళ్లే సదుపాయాన్నీ త్వరలో తేనున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న