close

Published : 13/04/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్లోజ్‌ చేసినవి మళ్లీ వస్తాయ్‌!

క్రోమ్‌, ఎడ్జ్‌, ఫైర్‌ఫాక్స్‌లో ట్యాబ్‌ సంగతులు

ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేయనిదే రోజు గడవని స్థితిలో ఉన్నాం. అవసరం నిమిత్తం పలు రకాల వెబ్‌ పేజీలను చూస్తాం. ఈ క్రమంలో ఎన్నో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి, మూసేస్తుంటాం. కొన్ని సార్లు క్లోజ్‌ చేసిన వాటిని తిరిగి పొందాలంటే? ‘అన్‌డూ’ చేయడం ద్వారా పొందొచ్చు. ‘సెషన్స్‌’ని రిస్టోర్‌ చేసుకోవచ్చు. ‘రీసెంట్లీ క్లోజ్డ్‌ ట్యాబ్స్‌’లోనూ రివ్యూ చేసుకోవచ్చు. అయితే అన్ని బ్రౌజర్‌లలోనూ ఈ సదుపాయం లేదు. ఒకవేళ మీరు క్రోమ్‌, ఎడ్జ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే ఏం చేయాలి? అందుకు ఏదైనా మార్గం ఉందా? తెలుసుకుందాం..

క్రోమ్‌ కొత్త వెర్షన్‌లో ఇలా..

అత్యంత లైట్‌ బ్రౌజర్‌గా పేరొందిన గూగుల్‌ క్రోమ్‌లో ఇప్పటికే పలు కొత్త ఫీచర్లు పరిచయం అయ్యాయి. వాటిల్లో ‘సెర్చ్‌ ట్యాబ్స్‌’ ఒకటి. దీంతో ఓపెన్‌ చేసి ఉన్న అన్ని ట్యాబ్‌ల నుంచి కావాల్సిన దాన్ని క్షణాల్లో వెతుక్కోవచ్చు. Ctrl+Shift+T షార్ట్‌కట్‌ని వాడుకుని అప్పుడే క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ని తిరిగి పొందొచ్చు. కానీ ఓ సెషన్‌లో క్లోజ్‌ చేసిన ఒకటి కంటే ఎక్కువ ట్యాబ్‌లలో కావాల్సిన దాన్ని తిరిగి పొందాలంటే? ఇప్పటికైతే క్రోమ్‌లో ఎలాంటి ఆప్షన్‌ లేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న క్రోమ్‌ వెర్షన్‌లో recently closed tabs  విభాగం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే క్రోమ్‌ ప్రయోగాత్మకంగా ‘క్రోమ్‌ కానరీ’లో ఈ ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది. ఎప్పుడైతే ‘ట్యాబ్‌ సెర్చ్‌’ మెనూని క్లిక్‌ చేస్తారో.. వచ్చిన డ్రాప్‌డౌన్‌ ఆప్షన్స్‌లో రీసెంట్‌గా క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ల జాబితా కనిపిస్తుంది. వాటిల్లో కావాల్సిన దాన్ని తిరిగి పొందొచ్చు. ‘సెర్చ్‌ట్యాబ్స్‌’ ఆప్షన్‌తో కావాల్సిన ట్యాబ్‌ని వెతికే వీలుంది. 

ఎడ్జ్‌లో ఏం చేయాలి?

విండోస్‌లో అప్‌డేటెడ్‌గా ఉండే ఎడ్జ్‌ని వెబ్‌ విహారానికి వాడుతున్నట్లయితే ట్యాబ్‌లను తిరిగి పొందేందుకు బిల్ట్‌ ఇన్‌ ఆప్షన్‌లు ఉన్నాయి. అప్పుడే క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ని తిరిగి పొందేందుకు ట్యాబ్‌ టైటిల్‌ బార్‌పై రైట్‌క్లిక్‌ చేసి ‘రీ ఓపెన్‌ ట్యాబ్‌’ని సెలెక్ట్‌ చేయండి. ఒకవేళ గతంలో మూసివేసిన అన్ని ట్యాబ్‌లను రివ్యూ చేసుకుని, కావాల్సిన వాటిని తిరిగి పొందాలనుకుంటే.. మెయిన్‌ మెనూలోకి వెళ్లి ‘హిస్టరీ’ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన మెనూలో ‘రీసెంట్లీ క్లోజ్డ్‌..’ విభాగం కనిపిస్తుంది. దాంట్లో వచ్చిన జాబితా నుంచి కావాల్సిన ట్యాబ్‌ని తిరిగి ఓపెన్‌ చేసుకోవచ్చు. ఎక్కువ ట్యాబ్‌లు ఉంటే ‘సెర్చ్‌’ బాక్స్‌లో పేరుని టైప్‌ చేసి వెతికే వీలుంది. 

ఫైర్‌ ఫాక్స్‌లో ఇలా..

ఓపెన్‌సోర్స్‌ బ్రౌజర్‌ ఫైర్‌ఫాక్స్‌లో ట్యాబ్‌లను మేనేజ్‌ చేయడం చాలా సులభం. ఒకవేళ ఏదైనా ట్యాబ్‌ని పొరబాటుగా క్లోజ్‌ చేస్తే.. వెంటనే ‘అన్‌డూ’ చేసేందుకు ఆప్షన్‌ ఉంది. ట్యాబ్‌ టైటిల్‌ బాక్స్‌పై రైట్‌ క్లిక్‌ చేస్తే ‘అన్‌డూ క్లోజ్డ్‌ ట్యాబ్‌’ కనిపిస్తుంది. ఒకవేళ మొత్తం సెషన్‌లో క్లోజ్‌ చేసిన అన్ని ట్యాబ్‌లను రివ్యూ చేద్దాం అనుకుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లైబ్రరీ’ని చూడండి. దాంట్లోని హిస్టరీలో ప్రత్యేకంగా recently closed tabs  విభాగం ఉంటుంది. అందులో మొత్తం జాబితా కనిపిస్తుంది. కావాల్సిన ట్యాబ్‌ని వెతుక్కుని తిరిగి పొందొచ్చు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు