చందమామ రావేఫోన్‌లో ఒదిగిపోవే..
close

Published : 12/05/2021 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చందమామ రావేఫోన్‌లో ఒదిగిపోవే..

చల్లటి రాత్రి. అందమైన చందమామ. చేతిలో స్మార్ట్‌ఫోన్‌. ఫొటో తీయకపోతే ఎలా? అవును. రాత్రిపూట చందమామను కెమెరా కన్నుల్లో బంధించటం ఇప్పుడో ట్రెండ్‌. కరోనా మహమ్మారి ఆందోళనను తగ్గించుకోవటానికో, తమలోని కళను చూపించుకోవటానికో గానీ చాలామంది దీన్నే అనుసరిస్తున్నారు. తగిన స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ఇక చెప్పేదేముంది?

రోజులు, నెలలు గడచి పోతున్నాయి. పనులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఇంటి నుంచే. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో? తమలోని నిరాశా నిస్పృహలు పోగొట్టుకోవటానికి, కాస్త హుషారును సొంతం చేసుకోవటానికి అలా బాల్కనీలోకి రావటం.. చుట్టుపక్కల పరిసరాలను గమనించటం పరిపాటిగా మారిపోయింది. ఆకాశం వంక చూస్తూ.. మిణుకు మిణుకుమనే నక్షత్రాలను, వెన్నెలను కురిపించే జాబిల్లిని పరికిస్తూ.. పనిలో పనిగా తమ కళాత్మక దృష్టికీ చాలామంది పదును పెడుతున్నారు. చందమామ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పరవశించి పోతున్నారు. నిజానికి స్మార్ట్‌ఫోన్‌తో జాబిల్లి ఫొటో తీయటం చిన్న విషయమేమీ కాదు. చందమామ చాలా దూరంలో ఉంటాడాయె. కెమెరా లెన్స్‌ చాలా నాణ్యమైనదైతే తప్ప ఫొటోలో స్పష్టంగా ఒదిగిపోడు. అంటే బేసిక్‌ టెలీఫొటో లెన్స్‌ కన్నా మరింత మెరుగైనదే కావాలన్నమాట. చందమామను జూమ్‌ చేసిన కొద్దీ ప్రకాశవంతంగా కనిపిస్తుంటాడు గానీ దృశ్యం బ్లర్‌ అవుతుంటుంది. తక్కువ వెలుతురులో మంచి ఫొటో తీయటమూ కష్టమైపోతుంటుంది. మంచి స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు. సరేగానీ ఇందుకోసం అనువైన ఫోన్లు ఏం ఉన్నాయి? చాలానే ఉండొచ్చు. కొన్నింటిని పరిశీలిద్దాం.

శామ్‌సంగ్‌
గ్యాలక్సీ ఎస్‌21 అల్ట్రా 5జీ

రెండు టెలీఫొటో లెన్సులు దీని సొంతం. మొదటి లెన్స్‌ 10ఎంపీ, ఎఫ్‌/2.4 సామర్థ్యం కలిగుంటుంది. మూడు రెట్ల వరకు దృశ్యాన్ని జూమ్‌ చేస్తుంది. ఇక రెండో లెన్స్‌ 10 రెట్ల వరకూ జూమ్‌ చేస్తుంది. వంద రెట్ల స్పేస్‌ జూమ్‌ ఫీచర్‌తో డిజిటల్‌గా దృశ్యాలను జూమ్‌ చేసుకోవచ్చు. ఆటోఫోకస్‌తో లాక్‌ చేసి నాణ్యమైన జాబిల్లి ఫొటోను తీసుకోవచ్చు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు గానీ సాధన చేస్తూ ఉంటే క్రమంగా అలవడుతుంది. చీకటిగా ఉన్నా కూడా లోపలి నీడలను దాచేసి మంచి ఫొటోలు తీస్తుంది. అయితే కేవలం రాత్రిపూట ఫొటోలు తీయటానికే ఫోన్‌ కొనుక్కోవాలా? అంటే ఎవరి ఇష్టం వారిది మరి!

ఐఫోన్‌
12 ప్రొ మ్యాక్స్‌

ఇది పెద్ద ఫోన్‌. ఐఫోన్లలో ఉత్తమమైనదని అనుకున్నా అతిశయోక్తి కాదు. 2.5 రెట్లు జూమ్‌తో స్పష్టంగా ఫొటోలు తీసి పెడుతుంది. మిగతా వాటితో పోలిస్తే దీని ప్రత్యేకత లైడర్‌ స్కానర్‌. ఆయా వస్తువులు, కెమెరా మధ్య దూరాన్ని ఇది కచ్చితంగా కొలుచుకుంటుంది. దీంతో మంచి ఆటోఫోకస్‌ సాధ్యమవుతుంది. వేగంగా పనిచేసే లెన్స్‌, ప్రాసెసింగ్‌ పవర్‌ మూలంగా చిన్న చిన్న వివరాలు కూడా స్పష్టంగా గోచరిస్తాయి. రాత్రి వేళల్లోనూ నాణ్యమైన వీడియో తీసుకునే వెసులుబాటు ఉండటం విశేషం.

వన్‌ ప్లస్‌
9 ప్రొ

ఖగోళ శాస్త్రవేత్తలు ఉపయోగించే కెమెరాలను తయారుచేసే హాసిల్‌బ్లాడ్‌ కంపెనీ భాగస్వామ్యంతో రూపొందిన కెమెరా వ్యవస్థ దీని సొంతం. అందుకేనేమో రాత్రిపూట చందమామ దృశ్యాలను చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా ఒడిసిపడుతుంది. ఇందులో 30 రెట్ల డిజిటల్‌ జూమ్‌ పరిజ్ఞానం ఉంది. చాలా వేగంగా దృశ్యాన్ని పట్టుకుంటుంది. దీని అల్ట్రా వైడ్‌ లెన్స్‌ మూలంగా అంచుల వద్ద ఎలాంటి కొరుకులు లేకుండా ఫొటోలు తీయొచ్చు.

కొన్ని చిట్కాలు

జాబిల్లి ఫొటోలు తీయాలంటే ట్రైపాడ్‌ సాయం తీసుకోవటం మంచిది. జూమ్‌ చేశాక దృశ్యం స్థిరంగా ఉండటానికిది తోడ్పడుతుంది.
ఆండ్రాయిడ్‌ ఫోన్లలో తక్కువ వెలుతురులో ఫొటో తీయాలంటే థర్డ్‌ పార్టీ యాప్‌లతో జూమ్‌ చేసుకోవటం మేలు.
జాబిల్లి కాంట్రాస్ట్‌లో ఉంటే ప్రొ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఐఎస్‌ఓను తగ్గించుకోవాలి. ఆర్‌ఏడబ్ల్యూ ఫైల్‌ టైప్‌ను ఎంచుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న