అంగారకా.. ఆక్సిజన్‌ పీల్చుకో!
close

Published : 28/04/2021 10:54 IST
అంగారకా.. ఆక్సిజన్‌ పీల్చుకో!

అంగారకుడి (మార్స్‌) మీద కాలు మోపడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్న మనిషికిది నిజంగా ‘ప్రాణ’ కబురే! అసలే అరుణగ్రహం మీద గాలి పలుచగా ఉంటుంది. అలాంటి గాలి నుంచీ శ్వాసించటానికి వీలైన ఆక్సిజన్‌ను తయారుచేయటంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. అంగారకుడి మీద జీవం ఆనవాళ్ల గురించి నాసా ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే. ఏడు నెలల ప్రయాణం తర్వాత ఇది రెండు నెలల క్రితం అరుణ గ్రహం మీద దిగింది. ఇందులోని మోక్సీ (మార్స్‌ ఆక్సిజన్‌ ఇన్‌-సిటు రిసోర్స్‌ యుటిలైజేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌) పరికరమే తాజా ఘన విజయాన్ని సుసాధ్యం చేసింది. దాదాపు అయిదు గ్రాముల ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసి అందరినీ ఔరా అనిపించింది. ఇది ఒక వ్యోమగామి పది నిమిషాలు శ్వాసించడానికి సరిపోతుండటం గమనార్హం. ఇలా ఇతర గ్రహాల మీద మానవులు నేరుగా శ్వాసించటానికి వీలైన ఆక్సిజన్‌ను ప్రయోగాత్మకంగా తయారు చేయటం ఇదే తొలిసారి. ‘‘మరో గ్రహం మీద ఆక్సిజన్‌ను సృష్టించిన తొట్టతొలి పరికరం మోక్సీనే’’ అని నాసాకు చెందిన ట్రుడీ కోర్టెస్‌ పేర్కొంటున్నారు. మోక్సీ పరికరం ఎలక్ట్రాలిసిస్‌ ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. తీవ్రమైన వేడిని ఉపయోగించుకొని కార్బన్‌ డయాక్సైడ్‌ అణువుల నుంచి ఆక్సిజన్‌ అణువులను వేరు చేస్తుంది. సాధారణంగా ఒక కార్బన్‌ డయాక్సైడ్‌ అణువులో ఒక కార్బన్, రెండు ఆక్సిజన్‌ అణువులుంటాయి. మార్స్‌ మీద దాదాపు 95% కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంటుంది. అక్కడ ఆక్సిజన్‌ అతి స్వల్పం. నాసా లెక్కల ప్రకారం నలుగురు వ్యోమగాముల్ని మార్స్‌ మీదకి పంపటానికి దాదాపు 25 వేల కిలోల ఆక్సిజన్‌తో కలిపి సుమారు 680 కిలోల రాకెట్‌ ఇంధనం అవసరమవుతుంది. రాకెట్‌ ఇంధనం గానూ ఆక్సిజన్‌ అవసరమవుతుంది. అంత మొత్తాన్ని ట్యాంకుల్లో నింపి పైకి తీసుకెళ్లడం కన్నా టన్ను బరువుండే ఆక్సిజన్‌ తయారీ యంత్రాన్ని మార్స్‌ మీదకి పంపితే వ్యోమగాములు పీల్చుకోవడానికి, రాకెట్‌ ఇంధనంగా వాడుకోవటానికి అవసరమైన ఆక్సిజన్‌ని అక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చన్నది నాసా ఉద్దేశం. మోక్సీ గంటకి దాదాపు 10 గ్రాముల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుంది. మొత్తం మీద ఇన్నాళ్లూ కార్బన్‌ డయాక్సైడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంగారకుడు ఇకపై హాయిగా ప్రాణవాయువునూ పీల్చుకోవచ్చన్నమాట!  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న