ఈ యాప్స్‌ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త
close

Published : 09/12/2020 18:39 IST
ఈ యాప్స్‌ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

ఇంటర్నెట్‌ డెస్క్: ఎక్కువమంది వాడే యాప్స్‌ లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు వినియోగదారులను ఇబ్బంది పెడుతుంటారు. అలా ఈ ఏడాది ప్రారంభంలో చాలా యాప్స్‌ వినియోగదారుల డేటాను తస్కరించి ఇబ్బంది పెట్టాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి సుమారు ఎనిమిది నెలల క్రితం గూగుల్‌ తన ప్లే కోర్‌ లైబ్రరీలో కొన్ని మార్పులు చేసింది. వినియోగదారుల సమాచారం హ్యాకర్ల పాలుకాకుండా ఆ మార్పు ఉపయోగపడుతుందని చెప్పింది. అయితే ఆ సమస్య ఇప్పటికీ కొన్ని యాప్స్‌ను ఇబ్బంది పెడుతోందనేది తాజా సమాచారం. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్‌ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం యూజర్లు ఎక్కువగా వాడుతున్న ముఖ్యమైన యాప్స్‌లో ఇంకా డేటా తస్కరణ సమస్య ఉందట.  

CVE-2020-8913గా గుర్తించిన ఆ లోపం (వల్నరబిలిటీ) వల్ల హ్యాకర్లు వివిధ యాప్‌లను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారట. ఆ తర్వాత వాటిని  వినియోగదారుల మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చేస్తున్నారు. అలాంటి యాప్స్‌ ఉన్న మొబైల్‌... హ్యాకర్ల చేతిలో కీలుబొమ్మలా మారుతుందన్నమాట. ఆ యాప్‌లను వాడుకుని వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అందులో లాగిన్‌ డీటెయిల్స్‌, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, మెయిల్స్‌ లాంటివి ఉన్నాయి. చెక్‌ పాయింట్‌ వెల్లడించిన ఆ ముఖ్యమైన యాప్స్‌ ఇవీ. వీటిని మీరు వాడుతుంటే వెంటనే కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ అవ్వండి. లేదంటే అప్‌డేట్‌ రాగానే అప్‌గ్రేడ్‌ చేసేయండి. 

బ్రౌజర్లు.. బాధితులు.. 

CVE-2020-8913 లోపం వల్ల ఇబ్బందులు పడుతున్న, పెడుతున్న యాప్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గూగుల్‌ క్రోమ్‌ గురించి. కొత్త వెర్షన్‌ క్రోమ్‌లో సమస్యలు లేకపోయినా, పాత వెర్షన్‌లో ఇబ్బందులు ఉన్నాయి. ఈ లోపాన్ని ఆసరాగా తీసుకొని హ్యాకర్లు మీ బ్రౌజర్‌ డేటాను తస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. కుకీస్‌, హిస్టరీ, బుక్‌మార్క్స్‌, పాస్‌వర్డ్‌ మేనేజర్‌ లాంటివి తస్కరుల చేతిలోకి వెళ్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా కొత్త వెర్షన్‌ క్రోమ్‌కు అప్‌డేట్‌ అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ విషయంలోనూ ఇంతే. అయితే ఇంకా మైక్రోసాఫ్ట్‌ ప్యాచ్‌ విడుదల చేయాల్సి ఉందట. 

డేటింగ్‌ యాప్‌లే లక్ష్యంగా

విదేశాల్లో వాడే మెసేజింగ్‌  యాప్‌ వైబర్‌, బుకింగ్‌ల కోసం వాడే బుకింగ్‌ యాప్‌లోనూ ఈ తరహా సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో డెవలపర్లు కొత్త వెర్షన్‌ను ఇప్పటికే విడుదల చేశారు.  కాబట్టి వీటి వినియోగదారులు కూడా తాజా వెర్షన్‌ వాడుతున్నామా లేదా అని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో విరివిగా వాడుతున్న ఛాట్‌ యాప్‌ గ్రైండర్‌లో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇందులోని పాస్‌వర్డ్స్‌, ఫైనాన్షియల్‌ సమాచారం, వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందట. ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లు బంబుల్‌, ఓకేక్యూపిడ్‌ పరిస్థితీ ఇంతే. 

వీడియో కాల్స్‌... 

వీడియో కాల్స్‌/కాన్ఫరెన్స్‌ యాప్‌లకు ఈ సమస్యల జాబితాలో చోటుంది. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సిస్కో టీమ్స్‌ యాప్‌కి కూడా ఈ సమస్య ఉంది. డెవలపర్లు  ప్యాచ్‌ విడుదల చేసేంతవరకు జాగ్రత్త అని చెక్‌ పాయింట్‌ చెబుతోంది.  విదేశాల్లో వాడే నేవిగేషన్‌ యాప్‌ యాంగో ప్రో (టాక్సీ మీటర్‌) యాప్‌ వినియోగదారులకూ ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ యాప్‌కు అవసరం లేని చాలా పర్మిషన్లు అడుగుతోందని చెక్‌ పాయింట్‌ చెబుతోంది. వీడియో ఎడిటింగ్‌ కోసం యువత ఎక్కువగా వినియోగిస్తున్న పవర్‌ డైరెక్టర్‌లోనూ ఈ లోపం ఇబ్బందులు సృష్టిస్తోందట. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న