WhatsApp Payment: వాట్సాప్‌ పేమెంట్‌కి తోడుగా స్టిక్కర్స్‌..ఎలా పంపాలంటే? 
close

Published : 25/10/2021 21:18 IST

WhatsApp Payment: వాట్సాప్‌ పేమెంట్‌కి తోడుగా స్టిక్కర్స్‌..ఎలా పంపాలంటే? 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర పేమెంట్ యాప్‌లకు పోటీగా ఈ ఏడాది వాట్సాప్‌ పేమెంట్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. అయితే ఇతర పేమెంట్ యాప్‌లతో పోలిస్తే వాట్సాప్‌ పేమెంట్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య తక్కువనే చెప్పుకోవాలి. దీంతో యూజర్స్‌ను ఆకర్షించే దిశగా వాట్సాప్‌ పేమెంట్‌కి కొత్త ఫీచర్స్‌ని జోడించనుంది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ పేమెంట్ ద్వారా యూజర్‌ చెల్లింపులు చేసే ప్రతిసారీ స్టిక్కర్ సాయంతో తమ భావాలను వ్యక్తం చేయొచ్చు. భారతీయ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని సమాచారం. అలానే భారతీయతను వ్యక్తపరచేలా ఈ పేమెంట్ స్టిక్కర్స్ ఉంటాయట. అయితే యూజర్‌ పేమెంట్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్స్ అందుబాటులో ఉండవు. యూజర్‌ చెల్లింపులు చేసే సమయంలో స్టిక్కర్‌ను ఎంపిక చేసుకొని నగదు బదిలీ చేయాలి. తర్వాత వాటిని పొందిన వ్యక్తి ఛాట్ పేజ్‌పై స్టిక్కర్‌ కనిపిస్తుంది. 

పేమెంట్‌తోపాటు స్టిక్కర్స్‌ని ఉపయోగించేందుకు యూజర్ వాట్సాప్‌ ఓపెన్ చేసి కాంటాక్ట్ జాబితాలో నగదు బదిలీ చేయాలనుకుంటున్న వారి ఛాట్‌ పేజ్‌పై క్లిక్ చేయాలి. అందులో పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎంత నగదు బదిలీ చేయాలనుకుంటున్నారనేది టైప్‌ చేయాలి. తర్వాత పేమెంట్‌కి నోట్ యాడ్ చేయమని సూచిస్తుంది. అక్కడ మీరు టెక్ట్స్‌ టైప్‌ చేయకుండా స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్‌తోపాటు స్టిక్కర్‌ వెళిపోతుంది. ఒకవేళ మీకు టెక్ట్స్‌ కనిపించకపోతే ఎమోజీ ఆప్షన్‌లో ప్లస్‌ సింబల్‌పై క్లిక్ చేస్తే పేమెంట్‌కు సంబంధించిన స్టిక్కర్స్‌ కనిపిస్తాయి. వాటిని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే పేమెంట్ చేసే ప్రతిసారీ అవి మీకు అందుబాటులో ఉంటాయి. దీనితోపాటు క్యూఆర్‌ కోడ్ ద్వారా వాట్సాప్ పేమెంట్ చేసే ఫీచర్‌ని త్వరలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలానే వాట్సాప్‌ ద్వారా పేమెంట్ చేసిన యూజర్స్‌కి రివార్డ్‌ ఇచ్చే ఫీచర్‌ని కూడా త్వరలో పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. 

ఇవేకాకుండా వాట్సాప్ బిజినెస్‌ ఖాతా యూజర్స్‌ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేస్తే స్టేటస్ అప్‌డేట్ చూసేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. యూజర్ ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేస్తే వ్యూ ప్రొఫైల్ ఫొటో, వ్యూ స్టేటస్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న