చెప్పేది.. చెవికెక్కుతోందా!

వినడం.. విశ్లేషించడం తెలిస్తే విజయం వెంటే వస్తుందంటున్నారు నిపుణులు. ఇంతేనా... ఇదెప్పుడూ చేసేదేగా.. అని తేలిగ్గా తీసేయడానికి లేదు. అవి సహజ నైపుణ్యాలే అయినా సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఆలకిస్తున్నట్లే ఉంటారు.. అక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. మనసు లగ్నం చేయరు. ఆపకుండా అరగంటకుపైగా మాట్లాడేస్తారు.. ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాదు. అందుకే చెప్పేది శ్రద్ధగా వినాలి.. విన్నది విశ్లేషించాలి.. ...

Published : 31 Oct 2019 00:24 IST

స్కిల్స్‌: లిసనింగ్‌

వినడం.. విశ్లేషించడం తెలిస్తే విజయం వెంటే వస్తుందంటున్నారు నిపుణులు. ఇంతేనా... ఇదెప్పుడూ చేసేదేగా.. అని తేలిగ్గా తీసేయడానికి లేదు. అవి సహజ నైపుణ్యాలే అయినా సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఆలకిస్తున్నట్లే ఉంటారు.. అక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. మనసు లగ్నం చేయరు. ఆపకుండా అరగంటకుపైగా మాట్లాడేస్తారు.. ఏం చెప్పారో ఎవరికీ అర్థం కాదు. అందుకే చెప్పేది శ్రద్ధగా వినాలి.. విన్నది విశ్లేషించాలి.. వివరంగా మాట్లాడాలి. అప్పుడే పరిజ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే శక్తి, ఆసక్తి అలవడతాయి. విద్యార్థులకూ, ఉద్యోగార్థులకూ ఈ నైపుణ్యాలు తప్పనిసరి.

విజయ్‌ పాఠాలను శ్రద్ధగా వింటాడు. విన్నది విన్నట్టుగా పరీక్షల్లో రాసి మంచి మార్కులు సంపాదిస్తాడు. కానీ విన్నదాన్ని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించడు. దీంతో అతడి ఆలోచనా పరిధి విస్తరించడంలేదు. కానీ అదే క్లాసులో చదువుతున్న అజయ్‌ పాఠాలను శ్రద్ధగా వినడమే కాకుండా వాటిని విశ్లేషించుకొని అవగాహన పెంచుకుంటాడు. ఈ నైపుణ్యం విద్యార్థి దశలోనే కాకుండా ఉద్యోగాన్వేషణలోనూ అతడికి ఎంతగానో ఉపయోగపడింది.

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలంటే వినే నైపుణ్యం ఉండాలి. శ్రద్ధగా వింటే మాట్లాడటానికీ ఆసక్తి చూపిస్తారు. వినడం లేకపోతే నేర్చుకోవడమే లేదు. నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, దాన్ని పరీక్షల్లో రాయడం, విజయం సాధించడం.. ఇవన్నీ చాలావరకూ వినడం మీదే ఆధారపడి ఉంటాయి. వినడం తరగతి గదికి, ఉద్యోగానికే పరిమితమైన నైపుణ్యం కాదు. వ్యక్తిగత జీవితానికి ఎంతో అవసరమైంది. సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనుకూలమైంది. శ్రద్ధగా విని, ప్రశ్నలు వేస్తే అవసరమైన అదనపు సమాచారాన్ని ఎదుటి వ్యక్తి ఉత్సాహంగా అందిస్తాడు. వినే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పలు అంశాలను గమనించాలి.. గ్రహించాలి.

విశ్లేషణ శక్తి విస్తరించాలంటే..?

ఒక విషయాన్ని ఇతరులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలంటే విశ్లేషించే నైపుణ్యం ఉండాలి. అది ఉండాలంటే ముందుగా ఆ విషయాన్ని చక్కగా విని ఆకళింపు చేసుకోవాలి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలన్నా, ఉద్యోగార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించాలన్నా ఈ సామర్థ్యం తప్పనిసరి. ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించి, పదోన్నతులు పొందాలన్నా విశ్లేషణను అలవర్చుకోవాల్సిందే.

లెక్కలు చేయాలి: లెక్కలు చేయడం ద్వారా విశ్లేషణ నైపుణ్యాన్ని పెంచుకోవచ్ఛు గణిత సమస్యలను సాధించాలంటే తార్కికంగా ఆలోచించాలి. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వాటిని పరిష్కరించాలి. అలా చేస్తే తార్కికత, సమాచారాన్ని వినియోగించుకునే పద్ధతి మెరుగుపడతాయి. అందుకే రోజూ ఏవైనా కొన్ని లెక్కలను ప్రయత్నిస్తుండాలి. దాంతో మెదడు చురుకుదనం పెరుగుతుంది.

బ్రెయిన్‌గేమ్స్‌ ఆడాలి: మెదడుకు పదును పెట్టే బ్రెయిన్‌ గేమ్స్‌ ఎక్కువగా ఆడాలి. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, సుడోకు, హిడెన్‌ ఆబ్జెక్ట్‌ పజిల్స్‌ లాంటివన్నీ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. బోర్డ్‌ గేమ్స్‌ విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు చెస్‌ ఆడితే తార్కిక ఆలోచన, ఎత్తుకు పైఎత్తు వేసే తెలివితేటలు పెరుగుతాయి. కొన్ని రకాల వీడియో గేమ్స్‌ విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. సమస్యలను పరిష్కరించుకుంటూ లక్ష్యాన్ని చేరే దిశగా ప్రోత్సహిస్తాయి.

చర్చించడం: ఒక విషయాన్ని తీసుకుని దాని మీద చర్చించి విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవచ్ఛు చర్చలో ఒక సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల అన్వేషణ, ఇతరులతో ఆలోచనలను పంచుకోవడం వల్ల విశ్లేషణ శక్తి పెరుగుతుంది.

చదవడం: పుస్తకాలు చదివితే ఒక అంశంపై లోతుగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది. కొత్తకొత్త పదాలు తెలుస్తాయి. ప్రముఖుల జీవిత చరిత్రల్లాంటివైతే స్ఫూర్తిదాయకంగానూ ఉంటాయి. విశ్లేషణ సామర్థ్యంతోపాటు ప్రేరణనూ కలిగిస్తాయి.

పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి: ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంతగా ప్రపంచం తెలుస్తుంది. సమస్యలను పరిష్కరించే తార్కికత పెరుగుతుంది. ఈ క్రమంలో ఒక సబ్జెక్టు మీదే దృష్టిని కేంద్రీకరించకూడదు. చుట్టూ జరుగుతున్న విషయాలను వార్తాపత్రికలూ, మ్యాగజీన్లూ చదవడం ద్వారా తెలుసుకోవచ్ఛు సభలు, సమావేశాలకు హాజరై పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్ఛు ఉచితంగా చదువు చెప్పడం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవచ్ఛు

పరిశీలించాలి: నిశిత పరిశీలన విశ్లేషణ శక్తిని పెంచుతుంది. సమస్యను పైపైన చూడకుండా లోతుగా విశ్లేషించాలి. ఉదాహరణకు ఒక తోటను చూసినప్పుడు దాన్ని మామూలుగా చూసి వదిలేయకుండా.. దానిలో ఏయే చెట్లు ఉన్నాయి.. ఏ రకానివి ఎన్నెన్ని ఉన్నాయి... తదితరాలను పరిశీలించాలి. కొత్త వారిని కలిసినప్పుడు వారి పేర్లను తెలుసుకుని గుర్తుంచుకోవాలి, వారి వస్త్రధారణను గమనించాలి. ఇతర వ్యక్తుల కంటే భిన్నంగా ఉన్నారేమో చూడాలి.

ప్రశ్నించుకోవాలి: ప్రశ్నలకు ఏదో ఒక జవాబుతో సంతృప్తి పడకూడదు. రకరకాలుగా ఆలోచించాలి. దీని వల్ల విశ్లేషించే స్వభావం అలవడుతుంది. ఉదాహరణకు ఒక కుక్కపిల్ల బంతిని పట్టుకోవడానికి పరుగులు పెట్టడం కనిపిస్తే.. ఆ పనిని అది ఉత్సాహంగా చేస్తోందా.. యజమాని బలవంతంతో చేస్తోందా.. అని గమనించాలి. నిత్యజీవితంలో సాధారణంగా కనిపించే దృశ్యాలను వివిధ కోణాల్లో పరిశీలించడం వల్ల విశ్లేషించే నేర్పు పెరుగుతుంది.

కొత్త బాధ్యతలు: కొత్త బాధ్యతలను తీసుకోవడం ద్వారా విశ్లేషణ సామర్థ్యానికి మెరుగులు దిద్దుకోవచ్ఛు అది విద్య లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్ఛు కొంతమంది పిల్లలకు చదువు చెప్పవచ్ఛు స్కౌట్స్‌ లీడర్‌గా పనిచేయవచ్ఛు స్వచ్ఛంద సేవా కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తించవచ్ఛు.

సవాలు: సమస్యలను పరిష్కరించే క్రమంలో స్వీయ సవాళ్లు విసురుకోవాలి. జటిలమైన గణిత సమస్యను కాలిక్యులేటర్‌ సహాయం లేకుండా చేయడం నేర్చుకోవాలి. సులువైన మార్గంలో చేయకుండా కష్టపడి పరిష్కరించాలి. ఇవన్నీ విశ్లేషణ నైపుణ్యాన్ని పెంచుకునే మార్గాలే.

వినే సామర్థ్యం పెరగాలంటే..!

మాట్లాడటం ఆపాలి

మాట్లాడుతూనే ఉన్నారంటే సరిగ్గా వినడం లేదనే అర్థం. సక్రమంగా వినాలంటే ముందు మాట్లాడటం ఆపేయాలి. తర్వాత ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయాలి. వేరే ఆలోచనలు వస్తే వినడం పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది.


మనసు లగ్నం

పరిసరాలపై దృష్టి తగ్గించాలి. చిన్న చిన్న అడ్డంకులు ఏకాగ్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్త పడాలి. మనసును వింటున్న విషయం మీదే లగ్నం చేయాలి. చెబుతున్న వ్యక్తిపై శ్రద్ధ పెట్టాలి. అలాచేస్తే పూర్తిగా అర్థం చేసుకొని స్పందించడానికీ, విన్నదాన్ని చక్కగా గుర్తుపెట్టుకోడానికీ వీలవుతుంది.


నేరుగా చూడాలి

ఒకరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలను అస్పష్టంగా పలకవచ్ఛు లేదా వినేవారికి సరిగ్గా వినిపించకపోవచ్ఛు అలాంటి సందర్భాల్లో వక్త కళ్లలోకి నేరుగా చూస్తే విషయం అర్థంకావడానికి అవకాశం ఉంది. నేరుగా చూడటం వల్ల ఇతర ఆలోచనలేవీ మనసులోకి రావు.


ప్రశ్నిస్తే మంచిది

ఏదైనా అర్థంకానప్పుడు ప్రశ్నించడానికి సందేహించకూడదు.అడగకపోతే ఆ సందేహం ఎప్పటికీ తీరకపోవచ్ఛు ప్రశ్నించడం వల్ల తెలియనిది తెలుస్తుంది. ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. ముఖ్యంగా వక్తకు వింటున్న సంగతి అర్థమై ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరెన్నో విషయాలను పంచుకోవడానికి వీలవుతుంది.


మననం చేసుకోవాలి

విన్నది విన్నట్టుగా వదిలేయకుండా అర్థమైన విషయాన్ని సహచరులతో పంచుకోవాలి. దీనివల్ల మననం చేసుకునే అవకాశం కలుగుతుంది. విన్నదాన్ని గుర్తుంచుకోవడానికి ఇదో చక్కటి మార్గం. ఈ జాగ్రత్తలు పాటిస్తే నాయకత్వ లక్షణాలూ పెంపొందుతాయి.

దరఖాస్తు చేశారా?

యూపీఎస్సీ- వివిధ పోస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ ఎండీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: అక్టోబరు 31.

సీసీఆర్‌ఏఎస్‌లో రిసెర్చ్‌ ఆఫీసర్‌, ఇతర ఖాళీలు

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌), సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఫార్మసీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: అక్టోబరు 31

ఐఎల్‌బీఎస్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: నవంబరు 2.

ఇస్రోలో 327 సైంటిస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 65% మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. చివరితేది: నవంబరు 04.

ఐకార్‌-నెట్‌-2019

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. చివరితేది: నవంబరు 04


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని