ఎంబీబీఎస్‌తో కేంద్ర సేవల్లోకి..

ఎంబీబీఎస్‌ విద్యార్హతతో కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దాదాపు ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ప్రకటన వెలువడింది.

Published : 01 May 2023 00:33 IST

ఎంబీబీఎస్‌ విద్యార్హతతో కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దాదాపు ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ప్రకటన వెలువడింది. మొత్తం 1261 ఖాళీలు ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూలతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంపికైనవారు రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు.

ఎంబీబీఎస్‌ అనంతరం ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి యూపీఎస్‌సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ చక్కని అవకాశం. ఈ పోస్టుల్లో చేరినవారికి ఆకర్షణీయ వేతనం, మంచి హోదా సొంతమవుతాయి. పలు సౌకర్యాలనూ కల్పిస్తారు. మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ హోదాలకు దళలవారీ చేరుకోవచ్చు.

ఎంపిక ఎలా?

ముందు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 500 మార్కులు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండేసి గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్షలో అర్హత సాధించినవారికి వంద మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్షలో విజయానికి ఎంబీబీఎస్‌ సిలబస్‌పై పట్టు కీలకం. గత సీఎంఎస్‌ ప్రశ్నపత్రాలతోపాటు నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సునూ చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 1261

విభాగాలవారీగా ఖాళీలు: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో 584, రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 300, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్లలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ 377

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1991 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: జులై 16

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు