నాలుగేళ్లకే రెండు పట్టాలు!

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనూ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు చదువుకునే  అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, బీకాం బీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన     ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి

Updated : 13 Jul 2023 05:24 IST

ఇంటర్‌తో 3

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనూ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు చదువుకునే  అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, బీకాం బీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన     ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. ఈ తరహా చదువులు పూర్తిచేసుకున్నవారు ఏడాది సమయం ఆదా చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు!మేటి విద్యాసంస్థల్లో డిగ్రీతో పాటు బీఎడ్‌ బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సుల్లో చేరడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ చదువులతో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకోవచ్చు. సాధారణ పద్ధతుల్లో ముందు డిగ్రీ అనంతరం బీఎడ్‌ పూర్తిచేయడానికి మొత్తం ఐదేళ్లు అవసరమవుతాయి. ఇంటిగ్రేటెడ్‌ చదువుల కారణంగా నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అభ్యసించడానికి వీలవుతుంది. పేరున్న సంస్థల్లో ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారు బోధనలో మేటి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. వీరికి మొదటి ఏడాది తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ వీరు సులువుగా పోటీ పడగలరు. విద్యార్థులను ఆకట్టుకునేలా చెప్పగలిగే నైపుణ్యాన్నీ పొందగలరు. ప్రసిద్ధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ కోర్సులు చదివినవారిని.. జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రాంగణ నియామకాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి.


ఒకే పరీక్షతో... 42 సంస్థల్లోకి

ఈ విద్యా సంవత్సరం (2023-2024) నుంచి దేశవ్యాప్తంగా 42 సంస్థలు నాలుగేళ్ల డిగ్రీ+బీఎడ్‌ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రొగ్రాం (ఐటీఈపీ) పేరుతో ప్రారంభిస్తున్నాయి. వీటిలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ సంస్థలూ ఉన్నాయి. కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. ఇటీవలే ఈ ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు జులై 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌.


ఆర్‌ఐఈలు..

సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యంతో ప్రాంతీయ విద్యా శిక్షణ సంస్థ (ఆర్‌ఐఈ)లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంటర్‌ అర్హతతో ఈ సంస్థల్లో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌, అలాగే ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీఎడ్‌ కోర్సునూ చదువుకోవచ్చు. ఆజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూరుల్లో ఆర్‌ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్‌లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ స్కాలర్‌షిప్పులు లభిస్తాయి. మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయ ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. ఇక్కడి విద్యార్థులకు ఏటా ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారు. బీఎ/ బీఎస్సీ ఎడ్‌ చదువుకున్నవారికి నెలకు కనీసం రూ.30 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీఎడ్‌ కోర్సుల వారికి కనీసం రూ.40వేలు చొప్పున పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

అర్హత: బీఎస్సీ బీఎడ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సుకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్‌ కోర్సుకు సైన్స్‌ / ఆర్ట్స్‌/ కామర్స్‌ ఏదైనా స్ట్రీమ్‌తో ఇంటర్‌ చదివినవాళ్లు అర్హులు. ఏ కోర్సుకైనా ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్‌లో సాధించిన మార్కులతో కోర్సులోకి తీసుకుంటారు. ఆర్‌ఐఈల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తోంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. పరీక్షలో భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాలవారీ సిలబస్‌, పాత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
వెబ్‌సైట్‌: https://ncet.samarth.ac.in/


ఇవీ సంస్థలు...

ఐఐటీలు: ఖరగ్‌పూర్‌, భువనేశ్వర్‌
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు: కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌, ఇగ్నో.
ఎన్‌ఐటీలు: వరంగల్‌, కాలికట్‌, పుదుచ్చేరి, త్రిపుర, జలంధర్‌ ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. (ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీఎస్సీ బీఎడ్‌ కోర్సే ఉంది. ఒక్కో సంస్థలో 50 చొప్పున సీట్లు లభిస్తున్నాయి)

తెలుగు రాష్ట్రాల నుంచి..

తెలంగాణలో.. మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌.. బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, బీకాం బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ఒక్కో విభాగంలో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీ, వరంగల్‌లో బీఎస్సీ బీఎడ్‌లో 50 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలకు బీఏ బీఎడ్‌లో 50 సీట్లు కేటాయించారు
ఏపీలో.. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి బీఏ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది. 50 సీట్లు ఉన్నాయి. బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్లలో బీఎస్సీ బీఎడ్‌, బీఏ బీఎడ్‌ కోర్సులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 50 చొప్పున సీట్లు లభిస్తున్నాయి.
వెబ్‌సైట్‌:https://ncet.samarth.ac.in/


పరీక్ష ఇలా

ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 33 భాషల నుంచి ఏవైనా 2 ఎంచుకోవచ్చు. వీటిలో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ మొదలైనవి ఉన్నాయి. ఒక్కో భాష నుంచి 20 చొప్పున విడిగా ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-2 ఎంచుకున్న విభాగానికి చెందినది. ఇందులో 26 సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్మీడియట్‌ నేపథ్యాన్ని అనుసరించి, వీటిలో ఏవైనా 3 ఎంచుకోవాలి. ఒక్కో సబ్జెక్టు నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌-3 జనరల్‌ టెస్టు. 25 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌. 20 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-3, 4లు అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటాయి. పరీక్ష మొత్తం 160 ప్రశ్నలు. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే వస్తాయి. సెక్షన్‌-3 జనరల్‌ టెస్టులో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, లాజికల్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-1, సెక్షన్‌-2ల్లో ప్రశ్నలు ఎంచుకున్న భాష, సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో వస్తాయి. ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాలపై పట్టున్నవారు ఈ పరీక్షలో రాణించగలరు.


ఈ సంస్థల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌  

తేజ్‌పూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు- మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో
శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ, తంజావూర్‌: బీఏ(ఇంగ్లిష్‌) బీఎడ్‌, బీఎస్సీ (మ్యాథ్స్‌) బీఎడ్‌, బీఎస్సీ (ఫిజిక్స్‌) బీఎడ్‌  
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, గుజరాత్‌ (గాంధీనగర్‌): ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ  ఎడ్‌, ఎమ్మెస్సీ ఎంఎడ్‌ గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, తమిళనాడు (దిండిగల్‌): బీఎస్సీ బీఎడ్‌ జీడీ గోయంకా యూనివర్సిటీ, లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలు: ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌


అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ

బోధన రంగంలో కోర్సులు అందిస్తోన్న పేరున్న సంస్థల్లో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్‌ విధానంలో బీఎస్సీ బీఎడ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌.. మూడు సైన్స్‌ విభాగాల్లోనూ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 18, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ 18 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఎస్సే/ డేటా అనాలిసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో రాత పరీక్షనూ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థి విభాగం బట్టి ఒక ప్రశ్న అడుగుతారు. గంట వ్యవధిలో సమాధానం రాయాలి.

వెబ్‌సైట్‌: http://cee.ncert.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని