ప్రశ్నలు అడిగినా.. వేసుకున్నా నేర్చుకోవటంలో భాగమే!

తరగతిలో పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత.. సందేహాలేమైనా ఉంటే అడగమంటారు అధ్యాపకులు. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగతావాళ్లంతా సాధారణంగా  నిశ్శబ్దంగానే ఉండిపోతారు.

Published : 16 Aug 2023 00:02 IST

తరగతిలో పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత.. సందేహాలేమైనా ఉంటే అడగమంటారు అధ్యాపకులు. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగతావాళ్లంతా సాధారణంగా  నిశ్శబ్దంగానే ఉండిపోతారు. అసలు ఎవరికీ సందేహాలే రావా అంటే వస్తాయిగానీ.. అందరిముందూ అడగడానికి మాత్రం సంకోచిస్తారు.

మీకు కొన్ని సందేహాలు వచ్చాయంటే దాని అర్థం.. మీకేమీ బోధపడలేదనీ.. మీరు అందరికంటే వెనకబడి ఉన్నారనీ కాదు. కొంత అర్థమైనా మరికొంత సమాచారంలో కొన్ని సందేహాలు ఉన్నాయనే. కాబట్టి వెంటనే స్పందించి.. ప్రశ్నించి సందేహాలను నివృత్తి చేసుకోవాలి.

  • ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోవడానికి మొహమాటం, భయం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయనుకుందాం. దాంతో ప్రశ్నించడాన్ని వాయిదా వేయకూడదు. ప్రశ్నిస్తేనే అప్పటికప్పుడు సందేహ నివృత్తి కలిగి.. విషయం బోధపడుతుంది. లేకపోతే అవి భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతాయి.
  • నిజానికి నేర్చుకునే ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం.. ప్రశ్నించడం. ఒక విషయాన్ని లోతుగా      విశ్లేషించినప్పుడే అనేక సందేహాలు వస్తాయి. పైపైన విని.. వదిలేస్తే ప్రశ్నించే అవకాశమే రాదు.
  • ఒక పాఠ్యాంశాన్ని చదివినప్పుడు అది ఎంతవరకూ అర్థమైందీ   తెలుసుకోవాలంటే.. మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సరైన సమాధానాలను రాబట్టలేకపోతే అది మీకు అర్థం కానట్టే. అప్పుడు మరింత క్షుణ్ణంగా చదవడం    మొదలు పెట్టాలి.
  • పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను మీరే సొంతంగా తయారుచేసుకోవచ్చు. ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో ఆలోచించి అందుకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల పరీక్షల్లో ఎన్ని రకాలుగా మార్చి ప్రశ్నించినా సమాధానాలు రాయడానికి తడబాటుపడరు.
  • ప్రతి చాప్టర్‌ చదివిన తర్వాతా కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకోవాలి. వాటికి సమాధానాలను రాబట్టగలిగితే ఆ అధ్యాయం మీద పట్టు సాధించినట్లే.
  • పరీక్షల ముందు ప్రతి చాప్టర్‌లోనూ తయారుచేసుకున్న ప్రశ్నలను ఒకసారి చూసుకుంటే దాంట్లోని ముఖ్యాంశాలు గుర్తుకొస్తాయి.
  • ఒక చాప్టర్‌కు సంబంధించి కొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని ప్రశ్నలను తయారుచేసుకోవాలి. వాటిల్లో అన్నిటికంటే భిన్నంగా ఉన్న వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
  • పరీక్షల్లో ప్రశ్నలను ఎప్పుడూ ఒకేవిధంగా అడగాలనేం లేదు. వాటిని మార్చి విభిన్నంగానూ అడగొచ్చు. అలాంటప్పుడు విద్యార్థులు తికమకపడుతుంటారు. ప్రశ్నలను సొంతంగా తయారుచేసుకోవడం తెలిస్తే ఎలాంటి గందరగోళానికీ అవకాశం ఉండదు.
  • కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనే ప్రశ్నలు వేయడానికి పునాది అవుతుంది. ఏవిధమైన ఆసక్తీ లేకపోతే సందేహమే తలెత్తదు. కాబట్టి ప్రశ్నించడమూ, ప్రశ్నలు తయారుచేసుకోవడమూ రెండూ అవసరమే కాదు, అవి మంచి ఫలితాలనూ అందిస్తాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని