స్థిరాస్తి..ఉపాధి జాస్తి!

దేశంలో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోంది రియల్‌ ఎస్టేటే. భవిష్యత్తులో ఇందులో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని నిపుణుల అంచనా.

Updated : 09 Oct 2023 07:05 IST

ప్రత్యేక విద్యాసంస్థల్లో విభిన్న కోర్సులు

దేశంలో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోంది రియల్‌ ఎస్టేటే. భవిష్యత్తులో ఇందులో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని నిపుణుల అంచనా. ఐటీఐ, ఒకేషనల్‌, డిప్లొమా, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఈ రంగంలో ఆకర్షణీయ వేతనాలతో దూసుకుపోవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థకు రియల్‌ ఎస్టేట్‌ కీలకం. సుమారు 7 కోట్ల మంది ఇందులో ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి దేశ జీడీపీలో దీని వాటా 13 శాతానికి చేరుతుందని అంచనా. రియల్‌ ఎస్టేట్‌ అంటే ఇళ్ల నిర్మాణం ఒక్కటే కాదు. ఇల్లు ఇందులో ఒక భాగం మాత్రమే. స్మార్ట్‌ సిటీలు, బిజినెస్‌ హబ్‌లు, ఎకనమిక్‌ జోన్లు, డేటా సెంటర్లు, షాపింగ్‌ మాల్స్‌, గేటెడ్‌ కమ్యూనిటీలు, లగ్జరీ విల్లాలు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు... నగరాల్లో ఏ వైపు చూసినా కనిపించేవి ఇవే!

ప్రస్తుతం నగరాలతోపాటు పెద్ద పట్టణాల్లో ఆకాశహర్మ్యాలు ఆకర్షిస్తున్నాయి. సొంత గూడును కోరుకోవడం, చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఆదాయంతోపాటు ఆదాయ మార్గాలు విస్తరించడం, పట్టణీకరణ, పలు ఇతర రంగాలు గణనీయంగా వృద్ధి చెందడం, పెట్టుబడులు పెరగడం, ప్రధానమంత్రి ఆవాస యోజన, కొత్త కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు నెలకొల్పడం, సరసమైన వడ్డీకి సులువుగా రుణాలు లభించడం..తదితర కారణాలతో స్థిరాస్తి రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోంది.

అర్బన్‌ ప్లానింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ - ఇవన్నీ స్థిరాస్తి పరిధిలోకే వస్తాయి. సివిల్‌ ఇంజినీర్లు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు, కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్లు, ప్రాపర్టీ అసెసర్లు, లీగల్‌ అడ్వైజర్లు, ల్యాండ్‌ సర్వేయర్లు, ఆర్కిటెక్ట్‌లు, టౌన్‌ ప్లానర్లు, సేల్స్‌ మేనేజర్లు... ఇలా పలు రకాల హోదాలతో ఉద్యోగాలు ఈ రంగంలో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, గార్డెనర్లు, బ్రిక్‌ లేయర్లు, ఆన్‌సైట్‌ ఇంజినీర్లు, ఇంటీరియర్‌ డిజైనర్లు, క్వాలిటీ సర్వేయర్లు, ఫెసిలిటీ మేనేజర్లు, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు.. ఇలా పలు రకాల నిపుణుల సేవలు అవసరం. ఈ విభాగంలో కోర్‌, నాన్‌ కోర్‌, స్పెషలైజ్డ్‌ ప్రొఫెషన్లతోపాటు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ వ్యక్తులూ సేవలు అందించవచ్చు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసుకున్నవారు రాణించగలరు. స్థిరాస్తి రంగానికి అవసరమైన సేవలు అందించడానికి విద్యా సంస్థలూ వెలిశాయి. వీటిలో పలు కోర్సులూ ఉన్నాయి. వాటిని పూర్తిచేసుకున్నవారు సంబంధిత విధుల్లో దూసుకువెళ్లవచ్చు. కొన్నిచోట్ల ప్రాంగణ నియామకాలకూ అవకాశం ఉంది.


  • ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసుకున్నవారు రాణించగలరు.
  • స్థిరాస్తి రంగానికి అవసరమైన సేవలు అందించడానికి విద్యా సంస్థలూ వెలిశాయి. వీటిలో పలు కోర్సులూ ఉన్నాయి. వాటిని పూర్తిచేసుకున్నవారు సంబంధిత విధుల్లో దూసుకువెళ్లవచ్చు.

అవకాశాలిలా..

స్థిరాస్తి రంగంలో కోర్‌ (డొమైన్‌) ఉద్యోగాలతోపాటు మార్కెటింగ్‌, సేల్స్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేటివ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పెద్ద ఎత్తున మానవ వనరుల సేవలు అవసరం. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ కోర్సులు పూర్తిచేసినవాళ్లు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సివిల్‌ ఇంజినీర్లు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ లేదా కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ లేదా స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చేయడం ద్వారా పెద్ద నిర్మాణ సంస్థల్లో ప్రవేశించవచ్చు. లోథా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌... ఇలా పలు కార్పొరేట్‌ రియాల్టీ సంస్థలు నైపుణ్యమున్నవారికి ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. టాటా హౌసింగ్‌, రహేజా యూనివర్సల్‌, లార్సెన్‌ అండ్‌ టబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్‌, 99 యాకర్స్‌, మ్యాజిక్‌ బ్రిక్స్‌, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.. తదితర సంస్థలెన్నో క్యాంపస్‌ నియామకాలూ చేపడతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌పై 250 అనుబంధ పరిశ్రమలూ ఆధారపడి ఉన్నాయి. అందువల్ల దాని ప్రభావం వీటిపైనా పడి, మరిన్ని అవకాశాలు దక్కుతాయి.

హోదాలు.. నైపుణ్యాలు..

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌, అప్రయిజర్‌, ఫెసిలిటీ మేనేజర్‌, ప్రాపర్టీ మేనేజర్‌, ఇన్వెస్టిమెంట్‌ కన్సల్టెంట్‌, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌, లీజింగ్‌ కన్సల్టెంట్‌, లీగల్‌ అసిస్టెంట్‌, లోన్‌ ఆఫీసర్‌, మార్ట్‌గేజ్‌ బ్రోకర్‌, రియల్టర్‌.. ఇలా పలు హోదాలున్నాయి. స్థిరాస్తి రంగంలో రాణించడానికి.. డొమైన్‌ పరిజ్ఞానం, సాంకేతిక అవగాహన, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఓపికగా వినడం, చర్చించి, ఒప్పించ గలిగే సామర్థ్యం ఉండాలి.

ఈ రంగంలో సేవలందిస్తోన్నవారిని 3 కేటగిరీలుగా వర్గీకరించవచ్చు.

స్పెషలైజ్డ్‌ ప్రొఫెషనల్స్‌: వాల్యూయర్స్‌, క్వాంటిటీ సర్వేయర్లు, ఫెసిలిటీ మేనేజర్లు, ప్రాపర్టీ మేనేజర్లు, సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్టులు

కోర్‌ ప్రొఫెషనల్స్‌: ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లు

నాన్‌ కోర్‌ ప్రొఫెషనల్స్‌: మేనేజ్‌మెంట్‌ నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, మార్కెటింగ్‌ ప్రొఫెషనల్స్‌, సేల్స్‌ ప్రొఫెషనల్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, ఫైనాన్స్‌ ఎనలిస్టులు, లాయర్లు, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు.

2030 నాటికి...

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పది కోట్ల మందికి ఉపాధి దక్కుతుంది. ప్రస్తుతం 22 లక్షల మంది ఇంజినీర్లు రియల్‌ సేవలు అందిస్తున్నారు. వీరి సంఖ్య అప్పటికి 33 లక్షలకు పెరుగుతుంది.
యంత్రాలు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గురించి తెలిసినవారికి, నిర్మాణ రంగానికి సంబంధించిన సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యం ఉన్నవారికీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
టెక్నీషియన్‌/ఫోర్‌మెన్‌ విభాగంలో 22.71 లక్షల నుంచి 38.11 లక్షలకు ఉపాధి పెరగనుంది. క్లరికల్‌ ఉద్యోగాలు 19.16 లక్షల నుంచి 29.08 లక్షలకు చేరతాయి. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 68.84 లక్షల నుంచి 1.05 కోట్లకు విస్తరిస్తారు.  

ఆ సమయానికి ఒక ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు స్థిరాస్తి రంగం విస్తరిస్తుంది.

ఏయే విధులు?

రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌: వీరు ఇల్లు, ఇళ్ల స్థలాల అమ్మకాల్లో పాలు పంచుకుంటారు. అమ్మే వారికి, కొనేవారికి మధ్య బేరసారాలు జరగడంలో కీలకంగా వ్యవహరిస్తారు. బేరం కుదిరితే కొంత కమీషన్‌ తీసుకుంటారు.

కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌: వీరు వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, కార్యాలయాలకు కావాల్సిన స్థలం సమకూర్చడం, అద్దెకివ్వడం, పెద్ద భవనాలను సంస్థలకు అమ్మడం, అద్దెకివ్వడం లాంటి లావాదేవీల్లో పాలు పంచుకుంటారు.

రియల్‌ ఎస్టేట్‌ అప్రయిజర్‌: వీరు ఇల్లు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల మార్కెట్‌ విలువను మదింపు చేస్తారు. అప్రయిజల్‌ ఫర్మ్‌లు, బ్యాంకు, ప్రైవేటు ఇన్వెస్టర్ల తరఫున పనిచేస్తారు.

ప్రాపర్టీ మేనేజర్‌: వీరు ప్రాపర్టీ ఫర్మ్‌ తరఫున పనిచేస్తారు. సంస్థ తరఫున స్థలం యజమానితో మాట్లాడి, కొంత పెట్టుబడి పెట్టి నిర్మాణం చేపడతారు. దాన్ని లీజు, అద్దెకు ఇస్తారు.

ఫెసిలిటీస్‌ మేనేజర్‌: రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్పులు, ఆఫీస్‌లు, బిల్డింగ్స్‌, మాల్స్‌ లాభదాయకంగా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిని వినియోగదారులకు లీజు, అద్దెకు ఇస్తారు. ఆ నిర్మాణం సాఫీగా కొనసాగేలా చూసుకుంటారు. పనులను పర్యవేక్షిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెంట్‌: స్థిరాస్తి మార్కెట్‌పై వీరికి పట్టు ఉంటుంది. పెట్టుబడిదారులకు తగు సలహాలిస్తారు. ప్రాంతాలవారీ ఎంత వరకు వెచ్చించవచ్చు, అందుకు కారణాలు.. సమగ్రంగా తెలుపుతారు.

ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌: వీరు ప్రాజెక్టు పునాది రాళ్ల నుంచి తుది రూపు వచ్చే వరకు అందులో పాలు పంచుకుంటారు. ప్రారంభంలోనే వినియోగదారులను ఆకర్షించి పూర్తికాకముందే అమ్ముడుపోయేలా చేస్తారు. నిర్మాణదారులకు ఆ ప్రాజెక్టు అభివృద్ధిపై సూచనలిస్తారు. బ్లూ ప్రింట్‌ నుంచి ఆఖరు అంకం వరకు అన్ని వ్యవహారాలూ చూసుకుంటారు.  

ఇవీ సంస్థలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌): ఈ విభాగంలో ప్రాధాన్య సంస్థ ఇదే. దీనికి పుణె, హైదరాబాద్‌, దిల్లీ, గోవాలో క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో పలు రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. డిసెంబరు 17లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు అర్హులు.

కోర్సులు: ఎంబీఏ: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌/ సస్టెయినబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ సస్టెయినబిలిటీ/ ఫ్యామిలీ బిజినెస్‌ అండ్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌/ అడ్వాన్స్‌డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌. క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, ఎంటెక్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌.. తదితర కోర్సులు ఈ సంస్థ అందిస్తోంది.  

అమెటీ యూనివర్సిటీ- ఆర్‌ఐసీఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ఎంబీఏ: రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎకనమిక్స్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌; పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, బీబీఏ: రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోర్సులు చదువుకోవచ్చు.  

నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ హైదరాబాద్‌లో.. ఐదో తరగతి, ఎనిమిది, పది, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్హతలతో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబై సర్టిఫయింగ్‌ బ్రోకర్స్‌ కోర్సు అందిస్తోంది. అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ భారతీయ విభాగం చార్టర్డ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రొఫెషనల్‌ పేరుతో సర్టిఫికేషన్‌ కోర్సు నడుపుతోంది. టెరీ యూనివర్సిటీలో.. ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎంటెక్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి.

నిరెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌, అన్సాల్‌ యూనివర్సిటీ పలు స్థిరాస్తి కోర్సులు అందిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని