అక్కడే ఆగిపోతున్నారా?

కావాలని ఎవరూ పొరపాట్లు చేయరు కదా... సన్నద్ధత విషయంలో తెలిసో, తెలియకో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరి దిద్దడానికి ప్రయత్నించకుండా కొంతమంది విద్యార్థులు అక్కడితో తమ ప్రయత్నాలను ఆపేస్తుంటారు. దాంతో వరుస వైఫల్యాలనూ ఎదుర్కొంటారు.

Published : 05 Dec 2023 00:20 IST

కావాలని ఎవరూ పొరపాట్లు చేయరు కదా... సన్నద్ధత విషయంలో తెలిసో, తెలియకో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరి దిద్దడానికి ప్రయత్నించకుండా కొంతమంది విద్యార్థులు అక్కడితో తమ ప్రయత్నాలను ఆపేస్తుంటారు. దాంతో వరుస వైఫల్యాలనూ ఎదుర్కొంటారు.

కొందరు విద్యార్థులకు తమ శక్తిసామర్థ్యాలూ, తెలివితేటల మీద నమ్మకం ఉండదు. వారి అభిప్రాయాలూ, ఆలోచనలూ స్థిరంగా ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. తమ అమాయకత్వం వల్లే తప్పులు జరిగాయని భావిస్తారు. వాటిని సరిదిద్దుకోవడానికీ వెనకాడతారు.

కొంతమంది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు. సాధించే క్రమంలో అవరోధాలూ, వైఫల్యాలు ఎదురుకావడం సర్వసాధారణమనే భావిస్తారు. కొత్త మార్గాల్లో అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి విద్యార్థులందరూ ఇలాగే ఉంటే.. లక్ష్య సాధన సులువవుతుంది. అందుకోసం ఏమేం చేయాలో తెలుసుకుందామా...

సెల్ఫ్‌టాక్‌

ఇతరులతో సంభాషిస్తుంటాం కదా. అలాగే మీతో మీరూ మాట్లాడుకోవచ్చు. సాధారణంగా ఒక పనిని మొదలుపెట్టే ముందు.. నా వల్ల అవుతుందా లేదా అని సందేహిస్తుంటాం కదా. అలాంటప్పుడు ‘ఇది అసాధ్యమేమీ కాదు. ఇతరులు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను. కాస్త అదనపు సమయాన్ని కేటాయించి సాధన చేస్తే నేనూ చేయగలను’ అని మీతో మీరు చెప్పుకుని చూడండి. ఇది మీ మీద సానుకూల ప్రభావాన్ని చూపి.. అనుకూల ఫలితాలు వచ్చేలా చేస్తుంది.

సాధారణంగా విద్యార్థులను పరీక్షలు సరిగా రాయలేమేమోననే ఆలోచనలు ఒత్తిడికి గురిచేస్తుంటాయి. దాంతో రాత్రుళ్లు సరిగా నిద్రపోరు కూడా. ఇలాంటప్పుడు ఎవరితో వారు కాస్త సానుకూలంగా మాట్లాడుకుంటూ సన్నద్ధతపై దృష్టి నిలపాలి. ఇప్పటివరకూ చదివిన అంశాలేమిటి? ఇంకా చదవాల్సినవి ఏమేం ఉన్నాయో చూసుకుని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ‘ఇప్పటివరకూ నా సన్నద్ధత మెరుగ్గానే సాగింది. కాబట్టి పరీక్షలో ఫెయిల్‌ అయ్యే ప్రమాదం ఉండద’ని ధైర్యం చెప్పుకోవాలి. ఈ సెల్ఫ్‌టాక్‌ సానుకూల ఫలితాలను అందించడానికి తోడ్పడుతుంది. అలాగని ఊరికే మీకు మీరు సర్దిచెప్పుకోవడం కాకుండా.. హేతుబద్ధమైన కారణాలతో అనుకున్నది ఎలా సాధించగలరో వివరించుకోగలగాలి.

ఇలా ప్రయత్నించేటప్పుడు కూడా మొదట్లో ప్రతికూల ఆలోచనలే రావొచ్చు. అయితే సానుకూల ఆలోచనలతో వాటిని నిరోధించి.. చక్కని ఫలితాలు అందుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి. దీనివల్ల ఒత్తిడీ.. దాంతో వచ్చే వివిధ ఇబ్బందులూ తగ్గి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వెంటాడే భయాలు

‘ఫెయిల్‌ అవుతానేమో, నన్ను చూసి అందరూ నవ్వుకుంటారేమో..’ లాంటి భయాలు కొందరు విద్యార్థులను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. ఇలాంటి ఆలోచనలతో భయపడుతూ కూర్చుంటే అవి మరింతగా కుంగదీస్తాయి. ముందుగా వీటిని ఎదుర్కోవడాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక సబ్జెక్టు అంటే మీకు అంతగా ఆసక్తి లేదు అనుకుందాం. దాంట్లో ఫెయిల్‌ అవుతానని భయపడుతున్నారు. అంతవరకే కాకుండా.. దాని తర్వాతి పరిణామాన్ని గురించీ ఒకసారి ఊహించాలి. భయపడినట్టుగానే ఫెయిల్‌ అయితే తర్వాత ఏం చేయాలనేదాని గురించీ ఆలోచించాలి. అప్పుడు రెండు, మూడు రకాల ఉపాయాలూ తడతాయి. అలా జరుగుతుందేమో అనే అనుమానం నుంచి.. అలా జరిగితే తర్వాత ఏం చేయాలనే దానిపై ఆలోచించడం మొదలుపెడితే.. భయం తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే ఊహలు ఎప్పుడూ భయపెడతాయి. నిజానికి వాస్తవం అంత భయంకరంగా ఉండకపోవచ్చు కూడా. భయాన్ని జయించడం అనేది పెద్ద సవాలే. సానుకూల ఆలోచనలతోనే దాన్ని గెలవగలగాలి. ఒక్కోసారి భయపడినట్టుగా కాకుండా.. భవిష్యత్తులో అపరిమితమైన ప్రత్యామ్నాయ అవకాశాలుండి ఆ భయాలన్నీ అవాస్తవాలూ కావచ్చు.

నేర్చుకునే పద్ధతి

సబ్జెక్టు కాస్త కష్టంగా ఉందనిపించగానే.. ఇక దాంట్లో ఎప్పటికీ మెరుగుపడలేమంటూ ఆలోచించకూడదు. అంతిమ ఫలితం గురించి కాకుండా.. నేర్చుకునే విధానం మీద ఆలోచనలను సాగించాలి. ఈ విధానం ఎప్పుడూ సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈ నైపుణ్యానికి మెరుగులు దిద్దితే అంతిమ లక్ష్యం గురించిన ఆలోచనలు ఇబ్బందిపెట్టవు.
ఒక పనిని.. ఒకే ధోరణిలో చేసుకుంటూ వెళుతూ.. ఫలితాలు మాత్రం భిన్నంగా రావాలని కోరుకోకూడదు. అదే పనిని కొత్త వ్యూహాలు, నైపుణ్యాలతో పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. అవసరమైతే మీ పనితీరు విషయంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవచ్చు కూడా. వాటికి అనుగుణంగా మీ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఇలా చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి మీ ఆలోచనా ధోరణిలో మార్పునూ గమనిస్తారు. ఆ మార్పు చిన్నగా మొదలుకావచ్చుగానీ.. ఆ తర్వాత ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని