ఆన్‌లైన్‌ టీచింగ్‌.. అవకాశం ఉందిగా!

బోధన.. ఒక అద్భుతమైన కెరియర్‌. జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు పంచుతూ, వారి భవితకు పునాదులు వేసే ఇటువంటి బాధ్యతాయుతమైన కెరియర్‌లోకి వెళ్లాలని ఎందరో కలలు కంటారు.

Published : 12 Mar 2024 00:19 IST

బోధన.. ఒక అద్భుతమైన కెరియర్‌. జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు పంచుతూ, వారి భవితకు పునాదులు వేసే ఇటువంటి బాధ్యతాయుతమైన కెరియర్‌లోకి వెళ్లాలని ఎందరో కలలు కంటారు. వారి కలల సాకారానికి ఇప్పటి ఆధునిక పరిజ్ఞానం మరిన్ని కొత్త అవకాశాలు కల్పిస్తోంది!

సంప్రదాయ పద్ధతుల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులువేం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావడమే కష్టం, వచ్చినా విపరీతమైన పోటీని తట్టుకుని నిలబడాలి. చదువు పూర్తయిన తర్వాత కూడా ఏళ్లతరబడి ప్రిపరేషన్‌లో కాలం గడపాలి. అలా అని ప్రైవేటుగా ప్రయత్నిద్దాం అనుకుంటే ఆ రంగంలో టీచర్లకు ఉన్న ఒత్తిళ్లు అన్నీఇన్నీ కావు.. ప్రవేశాల సంఖ్య పెంచడం దగ్గర్నుంచి విద్యార్థి పరీక్ష పాసయ్యే వరకూ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అటు యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు టీచర్లనే బాధ్యులను చేస్తున్న సందర్భాలు అనేకం. ఇటువంటి పరిస్థితుల్లో టీచింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి ‘ఆన్‌లైన్‌ టీచింగ్‌’ ఒక సమర్థమైన కెరియర్‌ అవకాశంగా కనిపిస్తోంది.

  • చాలా మంది ఆన్‌లైన్‌ టీచింగ్‌ ఉన్నత విద్యారంగంలో కొన్ని ప్రత్యేకమైన కోర్సులకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ ప్రస్తుతం వీరికి కేజీ నుంచి పీజీ వరకూ అన్ని తరగతులకూ బోధించేలా అవకాశాలున్నాయి. సంప్రదాయ రీతిలో తరగతులను దాటి, విద్యార్థులకు శిక్షణ అందివ్వడానికి సంస్థలు రిమోట్‌ టీచర్లపై ఆధారపడుతున్నాయి. కొందరికి పరిశ్రమల్లో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే విధంగానూ, మరికొందరికి కరిక్యులమ్స్‌ సిద్ధం చేసే విధంగా కూడా ఉద్యోగాలుంటున్నాయి. ఇప్పటికీ అనేక విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు తర్ఫీదునందిస్తూ ఉండటం వల్ల ఆన్‌లైన్‌ టీచర్లు, ట్యూటర్లు, ఎడ్యుకేటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది.
  • ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌గా విద్యార్థులకు బోధించే సంస్థల్లో ఇటువంటి ఉద్యోగాలున్నాయి. ఫుల్‌స్టాక్‌ అకాడమీ, గ్రేట్‌ మైండ్స్‌, కల్పన్‌.. వంటి ఎన్నో సంస్థలు ఇలా అవకాశాలు ఇస్తున్నాయి. వీటిలో మరో ముఖ్యమైన లక్షణం- నచ్చిన చోట నుంచి పని చేసుకునే అవకాశం ఉండటం. వివిధ కారణాలతో ఆఫీసులకు వెళ్లలేనివారు, ఊరు మారలేనివారు, ఇంటి బాధ్యతలో ఉండే వారికి.. ఇవి చక్కని మార్గాలను అందివ్వగలవు.
  • ఇలా ఆన్‌లైన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు చూపించేందుకు సంస్థలు కూడా ప్రత్యేకమైన విభాగాలను నడుపుతున్నాయి. వాటిలో పేరు నమోదు చేసుకుని, తాజా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. వీటిలో తొలుత గంటల లెక్కన పారితోషికం తీసుకుంటూ నచ్చితే నెలంతా పనిచేస్తూ జీతం వచ్చేలా మాట్లాడుకోవచ్చు. సాధారణ తరగతుల నుంచి ఉన్నత విద్యాంశాల వరకూ, ప్రవేశ పరీక్షల నుంచి పోటీ పరీక్షల వరకూ.. దేనికి సంబంధించిన సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్నా, ఇలా ఆన్‌లైన్‌ టీచర్‌గా రాణించే అవకాశం ఉంది. ఇందుకు కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ ఉంటే సరిపోతుంది.
  • అయితే సాధారణ పద్ధతులతో పోలిస్తే ఆన్‌లైన్‌ టీచర్లు మరిన్ని వినూత్నమైన విధానాలను అన్వేషించి బోధించాలని సంస్థలు కోరుకుంటున్నాయి. అలాగే వివిధ ట్రైనింగ్‌ సెషన్లు, సర్టిఫికేషన్‌ కోర్సులు వారి ద్వారా చేస్తూ నిరంతరం సబ్జెక్టుకు పదును పెడుతూ ఉండాలని ఆశిస్తున్నాయి.

ఎలా?

ఇలా ఆన్‌లైన్‌ టీచర్లుగా ఎంపిక చేసుకుంటున్న సంస్థలు తొలుత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఎంపిక చేసిన ప్రొఫైల్స్‌కు తమ నియమనిబంధనలు అనుసరించి ప్రాథమిక స్థాయిలో స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాయి. అనంతరం అభ్యర్థులు డెమో క్లాసులు చెప్పాలి. అక్కడా విజయవంతం అయిన వారిని పూర్తిస్థాయిలో రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఇలా వీరు చెప్పే వాటిలో రికార్డెడ్‌ తరగతులతోపాటుగా లైవ్‌ సెషన్స్‌ కూడా ఉంటున్నాయి.

  • ఇటువంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బోధించేందుకు సాధారణంగా సంప్రదాయ రీతిలో ఎలాంటి విద్యార్హతలు, అనుభవం ఉండాలో, ఇక్కడ కూడా అవే అవసరం. అయితే వాటికి అదనంగా కనీస టెక్నికల్‌ పరిజ్ఞానం ఉండాలి. స్కిల్‌షేర్‌, యుడెమీ, వేదాంతు వంటి అనేక వేదికలతోపాటు యూట్యూబ్‌ ఆధారంగా పనిచేసే వాటిలోనూ ఈ విధమైన కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని