ఎన్‌సీసీ ఉంటే.. ఈ అవకాశం మీకే!

నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రవేశాలు, ఉద్యోగాల్లో కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆర్మీ అయితే వీరికోసమే ప్రత్యేకంగా నియామకాలూ చేపడుతోంది. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు విడుదల చేస్తోంది.

Published : 17 Jul 2023 00:02 IST

నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రవేశాలు, ఉద్యోగాల్లో కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆర్మీ అయితే వీరికోసమే ప్రత్యేకంగా నియామకాలూ చేపడుతోంది. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు విడుదల చేస్తోంది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూతో శిక్షణకు తీసుకుంటారు. అందులో విజయవంతమైతే లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. వీరికి ఆకర్షణీయ వేతనంతోపాటు ప్రోత్సాహకాలూ దక్కుతాయి. ఇటీవలే వెలువడిన ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ప్రకటన పూర్తి వివరాలు..

పోస్టులకు డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ వారికి బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో రెండు దశల్లో ఐదు రోజులు ఇంటర్వ్యూ కొనసాగుతుంది. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులకే తర్వాతి 4 రోజుల స్టేజ్‌-2లో అవకాశమిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ, వేతనం

వీరికి ఏప్రిల్‌, 2024 నుంచి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నైలో 49 వారాలు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్‌ కమిషన్‌)లోకి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలుగుతారు. లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్‌, ఆరేళ్లకు మేజర్‌, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలిటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. పలు ప్రోత్సాహకాలూ ఉంటాయి. 

పోస్టు: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

మొత్తం ఖాళీలు: 55. (50 పురుషులకు, 5 మహిళలకు) రెండు విభాగాల్లోనూ 6(పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొందాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు.
వయసు: జనవరి 1, 2024 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1999 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 3 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు. 

వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని