నిర్వహిస్తూ.. నియంత్రిస్తూ!

చదివిన పాఠం ఎలా గుర్తుంటుంది? ఆహారపదార్థాలను చూడగానే లాలాజలం ఏవిధంగా ఊరుతుంది? బాధ కలిగితే కన్నీళ్లే వస్తాయి, నవ్వు ఎందుకు రాదు? మనం తింటూ ఉంటే అరిగించమని పొట్టకి ఎవరు చెబుతారు?  

Updated : 22 Mar 2023 03:22 IST

జనరల్‌ స్టడీస్‌ బయాలజీ

చదివిన పాఠం ఎలా గుర్తుంటుంది? ఆహారపదార్థాలను చూడగానే లాలాజలం ఏవిధంగా ఊరుతుంది? బాధ కలిగితే కన్నీళ్లే వస్తాయి, నవ్వు ఎందుకు రాదు? మనం తింటూ ఉంటే అరిగించమని పొట్టకి ఎవరు చెబుతారు?  సమయానికి ఆకలి అనిపించడానికి కారణం ఏమిటి?  గుండెను ఆగకుండా కొట్టుకోమని ఆజ్ఞాపించేది ఎవరు? ముల్లు గుచ్చుకోగానే కాలు అంత వేగంగా వెనక్కి ఎలా వచ్చేస్తుంది? సహజంగా జరిగిపోయే ఈ చర్యల గురించి ఎవరూ ఎప్పుడూ అంతగా ఆలోచించి ఉండరు. కానీ వీటన్నింటి వెనుక ఒక అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తోంది. అదే నాడీ వ్యవస్థ. ఇది రకరకాల రూపాల్లో శరీర క్రియలను నిర్వహిస్తూ, నియంత్రిస్తుంటుంది. ఆ వివరాలపై అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి.


మూడు రకాలు

మెదడు, వెన్నుపాము, వివిధ రకాల నాడులు కలిసి నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇవి మూడు రకాలు.1) స్వయంచోదిత నాడీవ్యవస్థ, 2) పరిధీయ నాడీవ్యవస్థ, 3) కేంద్ర నాడీవ్యవస్థ


స్వయంచోదిత నాడీవ్యవస్థ: మెదడు, వెన్నుపాము నుంచి ప్రారంభమయ్యే ‘గాంగ్లియా’ తంతువుల వల్ల ఏర్పడుతుంది. ఇది తిరిగి 2 రకాలు. 1) సహానుభూత నాడీవ్యవస్థ, 2) సహానుభూత పర నాడీవ్యవస్థ. ఇవి రెండూ పరస్పర వ్యతిరేకంగా చర్యలను నియంత్రిస్తుంటాయి. ఉదాహరణకు సహానుభూత నాడీవ్యవస్థ కన్నీళ్లు, చెమట, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తే వీటి ఉత్పత్తిని సహానుభూత పర నాడీవ్యవస్థ తగ్గిస్తుంది. ఇదే తరహాలో సహానుభూత పర నాడీవ్యవస్థ లాలాజలం, పైత్యరసం, జీర్ణరసాలు, జఠర గ్రంథుల స్రావాల ఉత్పత్తిని పెంచుతుంటే సహానుభూత నాడీవ్యవస్థ వాటిని తగ్గిస్తూ ఉంటుంది.


పరిధీయ నాడీవ్యవస్థ: దీనిలో 43 జతల నాడులుంటాయి. మెదడు నుంచి 12 జతల కపాలనాడులు వెలువడితే, వెన్నుపాము నుంచి మిగతా 31 జతల కశేరు నాడులు వెలువడుతాయి. ఈ నాడీవ్యవస్థలోని నాడులు కేంద్ర నాడీవ్యవస్థ, వివిధ శరీర భాగాల మధ్య పరస్పర సమాచార ప్రసరణ చేస్తుంటాయి.

కేంద్ర నాడీవ్యవస్థ: ఇందులో మెదడు, వెన్నుపాము ఉంటాయి. మానవుడి మెదడు సగటున 1200 - 1400 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో సుమారుగా 10 వేల మిలియన్ల (సుమారు వెయ్యి కోట్ల) న్యూరాన్లు ఉంటాయి. మెదడు మన శరీరంలోని 20% ఆక్సిజన్‌ను, 15% గ్లూకోజ్‌ను వినియోగించుకుంటుంది.


వెన్నుపాము

ఇది వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది. మెదడు నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేస్తుంది. అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. ఇవి వాటంతటవే, యాంత్రికంగా జరిగే పనులు. ఉదాహరణకు తీక్షణమైన కాంతికి కళ్లు మూసుకోవడం, వేడి వస్తువును ముట్టుకున్నప్పుడు చేతిని వెంటనే వెనక్కి తీసుకోవడం, ముల్లు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి లాగడం లాంటివి.
నాడీ సంబంధ వ్యాధులు: అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌, మూర్చ, హంటింగ్‌టన్స్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌, మైస్తీనియా గ్రేవిస్‌.


నాడీ వ్యవస్థ

మన శరీర క్రియలను నియంత్రణ, సమన్వయం చేసే వ్యవస్థల్లో అతిముఖ్యమైంది
నాడీ వ్యవస్థ. ఇది బాహ్య ప్రేరణలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. శరీరంలోని అంతస్రావ వ్యవస్థతో పోలిస్తే నాడీ వ్యవస్థ నియంత్రణ వేరుగా ఉంటుంది. నాడీ కణజాలం, నాడులు, మెదడు, వెన్నుపాముతో కలిసి నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది.

నాడీ వ్యవస్థ విధులు: * శరీర నియంత్రణ, సమన్వయం. * జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని మెదడు, వెన్నుపాముకు చేరవేయడం.
* మెదడు, వెన్నుపాము నుంచి విశ్లేషించిన సమాచారం శరీర భాగాలకు చేరవేయడం.
* సమాచారం నిల్వ, విశ్లేషణ. నీ శరీరంలో సమతాస్థితి నిర్వహణ. శరీరం బయట, లోపల జరిగే మార్పులు గ్రహించడం.

నాడీ కణజాలం: నాడీ వ్యవస్థలోని అనేక రకాల కణాలు నాడీ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. అవి 1) ఎపిండైమల్‌ కణాలు
2) న్యూరోసెక్రెటరీ కణాలు 3) న్యూరోగ్లియా 4) నాడీ కణాలు
ఎపిండైమల్‌ కణాలు: ఇవి శైలికామయ ఉపకళా కణజాలాలు. ఉపకళా కణజాలం నుంచి ఏర్పడి మెదడు, వెన్నుపాము కుహరంలో ఉంటాయి. మస్తిష్కమేరు ద్రవం సమతాస్థితికి, మెదడు జీవక్రియకు, మెదడు నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి తోడ్పడతాయి.

న్యూరోసెక్రెటరీ కణాలు: మెదడులోని హైపోథలామస్‌లో ఉండే ప్రత్యేక నాడీకణాలివి. అంతస్రావ వ్యవస్థ మాదిరిగా హార్మోన్లను స్రవిస్తాయి. వీటినే న్యూరోహార్మోన్లు అంటారు. పీయూష గ్రంథి (పిట్యూటరీ)ని నియంత్రిస్తాయి.
న్యూరోగ్లియా: వీటినే గ్లియల్‌ కణాలు అంటారు. ఇవి 3 రకాలు 1) ఆస్ట్రోగ్లియా
2) మైక్రోగ్లియా 3) ఒలిగోడెండ్రో గ్లియా

న్యూరోగ్లియా విధులు: నీ నాడీ కణాలను అనుసంధానించడానికి తోడ్పడతాయి.నీ రెండు నాడీ కణాల మధ్య ఉంటూ ఇన్సులేటర్‌లా పనిచేసి నాడీ ప్రచోదనాలు బయటకు వెళ్లకుండా సహాయపడతాయి.నీ నాడీకణాల పోషణకు ఉపకరిస్తాయి.నీ కణ భక్షణను చూపుతూ రక్షణ కల్పిస్తాయి.నీ జ్ఞాపక శక్తికి తోడ్పడతాయి.

నాడీ కణాలు: వీటిని న్యూరాన్లు అంటారు. నాడీవ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలే నాడీకణాలు. నాడీ వ్యవస్థ మొత్తం నాడీకణాలతో నిర్మితమవుతుంది. సమాచారం నాడీ ప్రచోదనాల రూపంలో వీటి ద్వారానే ప్రయాణిస్తుంది. మన శరీరంలో అతి పొడవైన కణాలు నాడీ కణాలే. వీటికి విభజన చెందే సామర్థ్యం ఉండదు. నాడీ కణంలో భాగాలు 1) కణదేహం (సైటాన్‌) 2) ఆక్సాన్‌ 3) డెండ్రైట్స్‌
నాడీ కణంలో తల లాంటి భాగం సైటాన్‌. దీనిలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ప్రొటీన్‌ సంశ్లేషణకు ఉపయోగపడే నిస్సల్‌ కణికలుంటాయి. న్యూరాన్‌లో కాండం లాంటి భాగం ఆక్సాన్‌. ఇది నాడీ ప్రచోదనాల ప్రసరణకు తోడ్పడుతుంది. ఆక్సాన్‌ను ఆవరించి మూడు పొరలుంటాయి. లోపలి ఆక్సోలెమ్మా పొర, మధ్యలో మయోలిన్‌ పొర లేదా మెడ్యూలరీ పొర, బయట న్యూరిలెమ్మా. ఈ పొరలు రక్షణకు, ఇన్సులేటర్‌లా ఉపయోగపడతాయి. నాడీ కణంలో మయోలిన్‌ పొర ఆవరించకుండా ఉన్న ప్రాంతాలను రణ్‌వీర్‌ కణుపులు అంటారు.
* కణదేహం, ఆక్సాన్‌ల నుంచి వెలువడే శాఖల లాంటి నిర్మాణాలే డెండ్రైట్స్‌. వీటిపై మయోలిన్‌ పొర ఉండదు. ఈ శాఖల చివర ఉబ్బిన ముడి లాంటి భాగాన్ని ‘సైనాప్టిక్‌ నాబ్‌’గా పిలుస్తారు. ఇది రెండు న్యూరాన్‌ల మధ్య లేదా ఒక న్యూరాన్‌, కండర పోగు మధ్య ఉంటుంది. రెండు వేర్వేరు నాడీకణాల డెండ్రైట్స్‌ మధ్య ఉన్న ప్రదేశాన్ని సైనాప్స్‌ అంటారు. నాడీ ప్రచోదనాలు ఒక నాడీకణం డెండ్రైట్స్‌ నుంచి మరొక నాడీకణం డెండ్రైట్స్‌కు న్యూరో ట్రాన్స్‌మీటర్ల వల్ల ప్రసరిస్తాయి. డెండ్రైట్స్‌ చివర ఉన్న
సైనాప్టిక్‌ నాబ్‌లోని కోశాలు న్యూరోట్రాన్స్‌మీటర్లను స్రవిస్తాయి.
న్యూరోట్రాన్స్‌మీటర్‌లు: సెరటోనిన్‌, డోపమైన్‌, ఎసిటైల్‌కోలిన్‌, గామా అమైనోబ్యుటరిక్‌ ఆమ్లం లాంటివన్నీ సైనాప్స్‌లోకి స్రవించి, నాడీ ప్రచోదనాల ప్రసరణకు తోడ్పడతాయి.
నాడులు: అనేక నాడీకణాల కట్టలు కలిసి ఏర్పడే వాటిని నాడులు అంటారు. ఇవి మూడు రకాలు.
1) జ్ఞాననాడులు: జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీవ్యవస్థకు తీసుకెళతాయి.
2) చాలక నాడులు: సమాచారాన్ని కేంద్ర నాడీవ్యవస్థ నుంచి ప్రభావిత భాగాలకు
చేరవేస్తాయి.
3) మిశ్రమ నాడులు: జ్ఞాన, చాలకనాడీ తంతువులు కలవడం వల్ల ఏర్పడతాయి. ఇవి సమాచారాన్ని తీసుకెళతాయి, తీసుకొస్తాయి. అన్ని వెన్నునాడులు వీటికి ఉదాహరణ.

మెదడు

మెదడును ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడుగా విభజించవచ్చు.
ముందు మెదడు: దీనిలోని ముఖ్య భాగాలు
1) ఘ్రాణలంబిక, 2) మస్తిష్కం, 3) థలామి,
4) హైపోథలామస్‌, 5) పీనియల్‌ దేహం.
ఘ్రాణలంబిక: వాసనను నియంత్రిస్తుంది.
మస్తిష్కం: జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, తెలివితేటలు, నొప్పి, స్పర్శ, ఉష్ణోగ్రత, వినడం, మాట్లాడటం, రుచి లాంటి వాటిని నియంత్రిస్తుంది.
థలామి: రిలే కేంద్రంగా పనిచేస్తుంది.
హైపోథలామస్‌: ఆకలి, దప్పిక, చెమట, నిద్ర, నీటి క్రమత, కోపం, భయం, ఉష్ణోగ్రత, లైంగిక వాంఛ తదితరాలను నియంత్రిస్తుంది.
పీనియల్‌ దేహం: మెలటోనిన్‌ హార్మోన్‌ను స్రవించి అంతస్రావ గ్రంథిలా పనిచేస్తుంది.
మెలటోనిన్‌ మెదడులోని జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది.
మధ్య మెదడు: ఇది ముందు మెదడు, వెనుక మెదడు మధ్య సమన్వయ భాగంలా పనిచేస్తుంది.
వెనుక మెదడు: దీనిలో సెరిబెల్లమ్‌ (అనుమస్తిష్కం), మెడుల్లా అబ్లాంగేటా, పాన్స్‌ వెరోలి అనే భాగాలుంటాయి.
సెరిబెల్లమ్‌: శరీర సమతాస్థితిని నియంత్రిస్తుంది.
మెడుల్లా అబ్లాంగేటా: గుండె కొట్టుకోవడం, శ్వాసక్రియ, లాలాజలం స్రవించడం, దగ్గడం, తుమ్మడం, వాంతి, మూత్ర విసర్జన, ఆహారం మింగడం లాంటి వాటిని సమన్వయం చేస్తుంది.
పాన్స్‌ వెరోలి: శరీరం రెండు వైపులా ఉండే కండరాలను, వాటి సమన్వయాన్ని నియంత్రిస్తుంది.


మాదిరి ప్రశ్నలు

1. మన శరీరంలో నియంత్రణ, సమన్వయానికి ఉపయోగపడే వ్యవస్థలు?
1) అంతస్రావ వ్యవస్థ 2) నాడీ వ్యవస్థ
3) 1, 2       4) కండర వ్యవస్థ
2. మెదడులోని ఏ భాగంలో న్యూరో హార్మోన్లను స్రవించే న్యూరోసెక్రెటరీ కణాలుంటాయి?
1) థలామస్‌   2) హైపోథలామస్‌
3) పీనియల్‌ దేహం  
4) మెడుల్లా అబ్లాంగేటా
3. నాడీకణాలతో కలిసి ఉండి నాడీ కణాల రక్షణకు, పోషణకు, జ్ఞాపక శక్తికి తోడ్పడే కణాలు ఏవి?
1) గ్లియల్‌ కణాలు    
2) ఎపిండైమల్‌ కణాలు
3) న్యూరోసెక్రెటరీ
4) అనుబంధ కణాలు
4. కిందివాటిలో నాడీకణాల ప్రత్యేకతలు?
1) శరీరంలో అతిపొడవైన కణాలు
2) విభజన చెందే సామర్థ్యం ఉండదు
3) సమాచార ప్రసరణకు తోడ్పడతాయి
4) పైవన్నీ
5. సమాచార ప్రసరణకు తోడ్పడే న్యూరోట్రాన్స్‌మీటర్లకు ఉదాహరణ?
  1) సెరటోనిన్‌     2) డోపమైన్‌  
  3) ఎసిటైల్‌కోలిన్‌   4) పైవన్నీ

సమాధానాలు: 1-3, 2-2, 3-1, 4-4, 5-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని