ఓటమి, ఒప్పందాల ఫలితం కశ్మీర్‌, కోహినూర్‌ ఆంగ్లేయుల పరం

క్రీ.శ. 15, 16వ శతాబ్దాల్లో భారతదేశ చరిత్రలో సంభవించిన మతోద్ధరణ ఉద్యమాల సమయంలో సిక్కులు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు.

Updated : 27 Apr 2024 03:50 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ్స్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర

 

ఆంగ్లో - సిక్కు యుద్ధాలు
సిక్కులు

క్రీ.శ. 15, 16వ శతాబ్దాల్లో భారతదేశ చరిత్రలో సంభవించిన మతోద్ధరణ ఉద్యమాల సమయంలో సిక్కులు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు.

  •  సిక్కు మతాన్ని గురునానక్‌ (1469 - 1539) స్థాపించారు. ఈయన తల్వాండీలోని ఖత్రీ కుటుంబంలో జన్మించారు.
  •  చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక, వేదాంత ధోరణిని కనబరిచిన నానక్‌ ఉపనిషత్‌లలో చెప్పిన ఏకేశ్వరోపాసన సిద్ధాంతాన్ని విశ్వసించారు. దేవుడు ఒక్కడే అని ప్రవచించి సిక్కు మతాన్ని స్థాపించారు. పరమత సహనంలాంటి నియమాలను బోధించి 1539లో తన శిష్యుడైన అంగద్‌ను తన వారసుడిగా ప్రకటించి మరణించారు.
  •  సిక్కు గురువుల్లో నాలుగోవాడైన గురురామదాస్‌ (1574 - 1581) అక్బర్‌ గౌరవాభిమానాలను చూరగొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ ప్రాంతాన్ని రామ్‌దాస్‌ అక్బర్‌ నుంచి కానుకగా పొందారు.
  •  సిక్కు పవిత్ర గ్రంథమైన ఆదిగ్రంథ్‌ను సంకలనం చేసింది అయిదో గురువైన గురు అర్జున్‌ దేవ్‌. జయదేవుడి కాలం నుంచి హిందూ, మహ్మదీయ సాధువుల బోధనలు, గురునానక్‌ ఇతర సిక్కు గురువుల బోధనలు, గీతాలన్నింటినీ ఈయన ఈ గ్రంథంలో పొందుపరిచారు.
  •  సిక్కు మతసంస్థల ఆర్థిక వనరులను బలపర్చడం కోసం సిక్కులందరిపై నిర్దిష్టమైన ఆధ్యాత్మిక పన్ను విధించాడు.
  •  జహంగీర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఖుస్రూకు ఆశ్రయం ఇవ్వడంతో గురు అర్జున్‌పై మొగల్‌ చక్రవర్తి ఆగ్రహించాడు. రాజద్రోహం నేరం కింద జహంగీర్‌ అర్జున్‌ దేవ్‌కు మరణశిక్ష విధించాడు. ఇది సిక్కుల చరిత్రలో ఒక ముఖ్యఘట్టం.
  •  గురు అర్జున్‌ కుమారుడైన గురు హరగోవింద్‌ గొప్ప సామర్థ్యాలు కలిగినవాడు. తన తండ్రిని హత్య చేసిన మొగలులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యాన్ని సమీకరించాడు.
  •  షాజహాన్‌ కాలంలో మొగలులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1628లో అమృత్‌సర్‌ వద్ద మొగల్‌ సైన్యాన్ని ఓడించాడు.
  •  ఇతని తర్వాత వచ్చిన 9వ గురువు గురు తేజ్‌బహదూర్‌ ఆనందాపూర్‌ వద్ద సిక్కుల సైనిక స్థావరాన్ని ఏర్పరిచాడు. ఇతడిని 1675లో ఔరంగజేబు హతమార్చాడు.
  •  తేజ్‌ బహదూర్‌ మరణం సిక్కుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

గురు గోవింద్‌ సింగ్‌

తేజ్‌ బహదూర్‌ కుమారుడు, 10వ సిక్కు గురువు గురుగోవింద్‌ సింగ్‌. ఈయన సిక్కులను క్రమశిక్షణతో, తిరుగులేని సైనికశక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు.

  •  సిక్కు సైనికశక్తి, సామర్థ్యాలకు నిజమైన నిర్మాతగా గురు గోవింద్‌ సింగ్‌ను పేర్కొనవచ్చు.
  •  ‘పాహుల్‌’ అనే ఆచారాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, అయిదు మత సంబంధమైన గుర్తులను పాటించాలని ఆదేశించాడు.
  •  పొడవైన జుట్టు
  •  దువ్వెన
  •  లంగోటి
  •  కడియం
  •  కృపాణం (కత్తి)
  •  ఈయన ఖల్సాను స్థాపించాడు.
  •  మొగలులకు ముఖ్యంగా ఔరంగజేబుకు వ్యతిరేకంగా గురుగోవింద్‌ సింగ్‌ సుదీర్ఘ పోరాటం సాగించాడు. ఈ పోరాటంలోనే తన ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాడు.
  •  ఔరంగజేబు మరణానంతరం జరిగిన వారసత్వ యుద్ధంలో షా ఆలం - 1కు (బహదుర్‌ షా) మద్దతిచ్చి, అతడు చక్రవర్తి అయిన అనంతరం మొగల్‌ సైన్యంలో చేరాడు.
  •  గురు గోవింద్‌ సింగ్‌ దక్కన్‌లో ఉండగా ఒక ఆఫ్గాన్‌ అతడిని హత్య చేశాడు.
  •  సిక్కుల చరిత్రలో గురుగోవింద్‌ సింగ్‌కు విశిష్ట స్థానం ఏర్పడింది.

బందా బహదూర్‌

గురు గోవింద్‌సింగ్‌ తర్వాత బందా బహదూర్‌ సిక్కులకు నాయకత్వం వహించి, మొగలుల అధికారాన్ని ధిక్కరించి గందరగోళాన్ని సృష్టించాడు.

  •  సట్లెజ్‌, యమునా నది మధ్యగల ప్రాంతాన్ని ఆక్రమించి లోహ్‌ఘర్‌ వద్ద కోటను నిర్మించాడు.
  •  తన పేరు మీద సొంతంగా నాణేలను ముద్రించాడు.
  •  మొగల్‌ చక్రవర్తి బహదుర్‌షా స్వయంగా లోహ్‌ఘర్‌పై దాడి చేయగా, బందా తప్పించుకున్నాడు. లోహ్‌ఘర్‌ను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  •  బహదూర్‌షా మరణానంతరం బందా బహదూర్‌ లోహ్‌ఘర్‌, సిర్‌హింద్‌లను తిరిగి ఆక్రమించాడు.
  •  1715లో బందా గురుదాస్‌పూర్‌లో ఉండగా అతడిని మొగల్‌ సైన్యం బందీగా చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. బందా కళ్ల ముందే అతడి కుమారుడిని చంపారు.
  •  ఏనుగు పాదాల కింద తొక్కించి బందా బహదూర్‌నూ చంపేశారు.
  •  1716 నాటికి సిక్కుల ప్రాబల్యం బాగా క్షీణించింది.
  •  బందా బహదూర్‌ అనంతరం సిక్కులు తమ ప్రాబల్యాన్ని చాలావరకు కోల్పోయినప్పటికీ, పూర్తిగా క్షీణించలేదు. కపూర్‌సింగ్‌ సిక్కుల మతాధికారాన్ని ధాల్‌ఖల్సా పేరుతో తిరిగి స్థాపించాడు.
  •  నాదిర్‌షా దండయాత్ర అనంతరం ఏర్పడిన రాజకీయ అస్థిరత, అల్లకల్లోల పరిస్థితులను ఆధారంగా చేసుకొని సిక్కులు తిరిగి సైనికంగా బలోపేతులయ్యారు. రావి తీరంలోని దేల్‌వాల్‌ వద్ద పటిష్టమైన కోటను నిర్మించారు.
  •  అహ్మద్‌షా అబ్దాలీ దండయాత్ర సిక్కులను మరింత బలోపేతులను చేయడంలో తోడ్పడింది.
  •  క్రీ.శ. 1764 నాటికి సిక్కులు లాహోర్‌ను ఆక్రమించుకున్నారు.
  •  1773 నాటికి తూర్పు సహారాన్‌పూర్‌ నుంచి పశ్చిమాన అట్టాక్‌ వరకు, ఉత్తరాన కాంగ్రా నుంచి దక్షిణాన మూత్రాన్‌ వరకు సిక్కుల అధికారం విస్తరించింది. వీరు తమ భూభాగాన్ని 12 మిజిల్‌్్సగా విభజించి పాలించడం ప్రారంభించారు.

రెండో ఆంగ్లో - సిక్కు యుద్ధం (1848 - 49)

మొదటి సిక్కు యుద్ధానంతర సంధితో అవమానం పాలైన సిక్కులు పూర్వప్రతిష్టలు పొందాలనే ప్రయత్నంలో ఉండేవారు.

  •  దీనిలో భాగంగా ముల్తాన్‌ గవర్నర్‌ మూల్‌రాజు, లాహోర్‌లో చత్తర్‌సింగ్‌ బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేశారు.
  •  నాటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ సిక్కులపై యుద్ధం ప్రకటించి సర్‌ హ్యూజ్‌ గాఫ్‌ అనే జనరల్‌ను పంజాబ్‌కి పంపాడు.

యుద్ధంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు:

1) రామ్‌నగర్‌ యుద్ధం - 1848 నవంబరు 22
2) చిలియన్‌వాలా యుద్ధం - 1849 జనవరి 13
3) గుజరాత్‌ యుద్ధం - 1849 ఫిబ్రవరి 21

  •  పై యుద్ధాల్లో చత్తర్‌సింగ్‌, లాహోర్‌ సేనాధిపతి షేర్‌సింగ్‌ అత్తరీవాలాలు బందీలయ్యారు. తర్వాత డల్హౌసీ దిలీప్‌సింగ్‌ను రాజుగా తొలగించి, ఏడాదికి 50 లక్షల రూపాయల భరణమిచ్చి, పంజాబ్‌ను పూర్తిగా ఆక్రమించాడు.
  •  క్రైస్తవ మతం స్వీకరించి ఇంగ్లండ్‌కు వెళ్లిన సిక్కు పాలకుడు - దిలీప్‌సింగ్‌
  •  డల్హౌసీ పంజాబ్‌ ఆక్రమణ తర్వాత గ్రాండ్‌ట్రంక్‌ రోడ్డును పెషావర్‌ వరకు పొడిగించాడు.

మహారాజా రంజిత్‌ సింగ్‌

సిక్కు రాజ్యమైన సుకిర్‌చికియా నాయకుడు మహాసింగ్‌. ఇతడి కుమారుడే రంజిత్‌ సింగ్‌. ఈయన పంజాబ్‌లోని గుజ్రన్‌వాలా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో 1780లో జన్మించాడు.

  •  రంజిత్‌ తన చిన్నతనంలో మశూచి వ్యాధికి గురై ఒక కంటిని కోల్పోయాడు.
  •  12 ఏళ్ల వయసులోనే రాజ్యపాలన చేపట్టాడు.
  •  ఆఫ్గాన్‌ రాజు జమాన్‌ షా ఇతడిని లాహోర్‌ గవర్నర్‌గా నియమించి రాజా అనే బిరుదును ప్రసాదించాడు.
  •  నాటి నుంచి రాజా రంజిత్‌ సింగ్‌ వరుసగా మిజిల్స్‌ను ఆక్రమిస్తూ, సట్లెజ్‌ నదికి కుడివైపు ఉన్న అన్ని సిక్కు మిజిల్స్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
  •  లాహోర్‌లో ఆయుధ కర్మాగారాన్ని నిర్మించాడు.
  •  1802లో అమృత్‌సర్‌ను ఆక్రమించి తన మత రాజధానిగా ప్రకటించాడు.
  •  వాయవ్య సరిహద్దు నుంచి ఫ్రెంచ్‌ వారితో కలిగే ఇబ్బందులు ఊహించి, బ్రిటిష్‌వారు రంజిత్‌ సింగ్‌తో మైత్రి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
  •  ఫ్రెంచ్‌ వారు దాడి చేస్తే రంజిత్‌సింగ్‌ ఆంగ్లేయులకు సహాయపడాలనే షరతుతో 1807లో బేరసారాలు ప్రారంభించారు.
  •  మెట్‌కాఫ్‌ మధ్యవర్తిత్వంతో లార్డ్‌ మింటో, రంజిత్‌ సింగ్‌ల మధ్య 1809లో అమృత్‌సర్‌ సంధి జరిగింది.

అమృత్‌సర్‌ సంధి షరతులు

ఈ సంధి ప్రకారం సట్లెజ్‌ నది తీరానికి కుడివైపునున్న ప్రాంతాల విషయంలో రంజిత్‌సింగ్‌కు పూర్తి స్వేచ్ఛ లభించింది.

  •  సట్లెజ్‌ నది తీరానికి అవతలి ప్రాంతాల విషయంలో బ్రిటిష్‌ వారికి స్వేచ్ఛ, అధికారాలుంటాయి.
  •  దీని వల్ల రంజిత్‌సింగ్‌ అధికారం సట్లెజ్‌ నది కుడి తీరానికి పరిమితం కాగా, బ్రిటిష్‌ వారి అధికారం సట్లెజ్‌ నది వరకు విస్తరించింది. బ్రిటిష్‌ సైన్యాన్ని లుథియానాలో కూడా ఉంచారు.
  •  ఈ సంధి తరువాత రంజిత్‌సింగ్‌ పశ్చిమంపై దృష్టి కేంద్రీకరించాడు. కాంగ్రా, అట్టాక్‌, పెషావర్‌లను ఆక్రమించాడు.
  •  1831లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింక్‌తో సింధు నావికా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు వర్తకం కోసం సింధూనదిని ఉపయోగించుకోవచ్చు.

మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధం (1845 - 46)

1839లో రంజిత్‌సింగ్‌ మరణానంతరం సిక్కుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇతడి తర్వాత ఖరక్‌, షేర్‌ తదితర బలహీన పాలకులు పంజాబ్‌ను పాలించారు. దీంతో ఆంగ్లేయులు పంజాబ్‌ ఆక్రమణకు పూనుకున్నారు.

  •  రంజిత్‌ చిన్నకుమారుడైన దిలీప్‌సింగ్‌ను 1843లో సింహాసనం అధిష్టింపజేసి అతని తల్లి రాణి జిందాన్‌కౌర్‌ పరిపాలనా బాధ్యతలు స్వీకరించింది.
  •  కంపెనీ పాలనను తగ్గించి, తమ సైన్యాన్ని బ్రిటిష్‌ వారిపైకి ఉసిగొల్పింది.
  •  ఆ సమయంలో హార్డింజ్‌ సిక్కులపై యుద్ధం ప్రకటించాడు. దీన్నే మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధం అంటారు.
  •  మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధంలో మొత్తం 5 యుద్ధాలు జరిగాయి.

ఈ యుద్ధాల్లో హార్డింజ్‌-1 తరపున బ్రిటిష్‌ సైనిక జనరల్‌ సర్‌ హ్యూజ్‌ గాఫ్‌ పాల్గొన్నాడు.

1) మడ్కి యుద్ధం - 1845 డిసెంబరు 18
2) ఫిరోజా యుద్ధం - 1845 డిసెంబరు 21
3) బుద్ధేవాల్‌ యుద్ధం 
4) ఆలీవాల్‌ యుద్ధం - 1846 జనవరి 28
5) సోబ్రాన్‌ యుద్ధం (తుపాకుల యుద్ధం) - 1846 ఫిబ్రవరి 10

  •  తుపాకుల యుద్ధంలో వేల మంది సిక్కులు మరణించారు.
  •  దీంతో సిక్కులు తమ ఓటమిని అంగీకరించి 1846లో ఆంగ్లేయులతో లాహోర్‌ సంధిని కుదుర్చుకున్నారు.

లాహోర్‌ సంధి (1846 మార్చి 9):

కశ్మీర్‌ ప్రాంతాన్ని బ్రిటిష్‌ వారికి ఇచ్చారు.

  •  కోహినూర్‌ వజ్రాన్ని ఆంగ్లేయుల పరం చేయాలి.
  •  బ్రిటిష్‌ వారికి 1.5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిక్కులు ఒప్పుకున్నారు.
  •  సట్లెజ్‌, బియాస్‌ నదుల మధ్యనున్న జలంధర్‌ దోఆబ్‌ ప్రాంతాన్ని ఇంగ్లిష్‌ వారికి ఇచ్చారు.
  •  జమ్మూ రాజైన గులాబ్‌సింగ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి 7.5 మిలియన్‌ రూపాయలకు కశ్మీర్‌ను కొనుగోలు చేశాడు.
  •  తర్వాతి కాలంలో జరిగిన అమృత్‌సర్‌ సంధి (1846) ప్రకారం గులాబ్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ మహారాజుగా గుర్తింపు పొందాడు.
  •  లాహోర్‌ సంధికి కొన్ని మార్పులు చేస్తూ 1846 డిసెంబరు 26న బ్రిటిషర్లకు, సిక్కులకు మధ్య భైరోవల్‌ ఒప్పందం కుదిరింది.

భైరోవల్‌ సంధి:

భైరోవల్‌ సంధి 1846 డిసెంబరు 26న జరిగింది.

  •  మహారాణి జిందాన్‌కౌర్‌కు ఏడాదికి లక్షా యాభై వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలి.
  •  ఈ సంధి ప్రకారం పంజాబ్‌ను పాలించడానికి 13 మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్‌ ఆఫ్‌ రీజెన్సీని ఏర్పాటు చేశారు.
  •  గవర్నర్‌ జనరల్‌ ద్వారా ఈ కౌన్సిల్‌ ఆఫ్‌ రీజెన్సీకి అధ్యక్షుడు నియమితుడవుతాడు.ఇతని ఆధ్వర్యంలో పంజాబ్‌ను పాలిస్తారు.
  •  మొదటి అధ్యక్షుడిగా హెన్రీ లారెన్స్‌ నియమితుడయ్యాడు.

రచయిత : డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని