ఆ రెండు యుద్ధాలే ఆంగ్లేయ సామ్రాజ్యానికి పునాది!

భారతదేశాన్ని షాజహాన్‌ పరిపాలించే రోజుల్లో ఇంగ్లిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ తన వర్తక స్థావరాలను బెంగాల్‌లోని హుగ్లీ, కాశింబజార్‌లో, బెంగాల్‌ సుభాలోనే అంతర్భాగమైన ఒడిశాలోని బాలాసోర్‌, హరిహరపురంలో నెలకొల్పారు.

Updated : 22 Mar 2024 02:57 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికార స్థాపన

ప్లాసీ  బక్సార్‌ యుద్ధాలు

భారతదేశాన్ని షాజహాన్‌ పరిపాలించే రోజుల్లో ఇంగ్లిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ తన వర్తక స్థావరాలను బెంగాల్‌లోని హుగ్లీ, కాశింబజార్‌లో, బెంగాల్‌ సుభాలోనే అంతర్భాగమైన ఒడిశాలోని బాలాసోర్‌, హరిహరపురంలో నెలకొల్పారు.

  • వీరు క్రీ.శ. 1651లో మొగల్‌ చక్రవర్తికి సంవత్సరానికి మూడువేల రూపాయలు చెల్లించి, రహదారి పన్ను లేకుండా వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందారు.
  • ఔరంగజేబు కాలంలో బెంగాల్‌ గవర్నరైన షాయిస్తాఖాన్‌ ఆంగ్లేయ వర్తకుల నుంచి దిగుమతి పన్ను వసూలు చేశాడు.
  • ఈ పన్ను చెల్లించడానికి ఆంగ్లేయులు నిరాకరించడంతో వారిని ఔరంగజేబు నిర్బంధించాడు. దీనికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు బెంగాల్‌లో విధ్వంసం సృష్టించారు.
  • ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఔరంగజేబు ఆంగ్లేయుల వ్యాపారాన్ని పూర్తిగా స్తంభింపజేశాడు. ఆంగ్లేయులు చక్రవర్తిని క్షమాపణ అడిగి, సంధి కుదుర్చుకున్నారు.
  • క్రీ.శ. 1700 నాటికి చక్రవర్తి అనుమతితో కలకత్తాను పొంది, ఫోర్ట్‌ విలియం కోటను నిర్మించారు.
  • ఔరంగజేబు మరణానంతరం మొగల్‌ చక్రవర్తుల అసమర్థతను, రాజకీయ పరిస్థితులను గ్రహించిన ఆంగ్లేయులు బెంగాల్‌లో స్వతంత్రంగా వ్యవహరించారు.
  • క్రీ.శ. 1740  56 మధ్యకాలంలో అలీవర్ధీఖాన్‌ బెంగాల్‌ నవాబుగా ఉన్నాడు.
  • ఈయనకు కొడుకులు లేకపోవడంతో మూడో కుమార్తె కొడుకైన మీర్జామహ్మద్‌ను తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే సిరాజ్‌ఉద్‌దౌలా అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.
  • బెంగాల్‌ నవాబు పదవి చేపట్టేనాటికి సిరాజ్‌ఉద్‌దౌలా వయసు 23 సంవత్సరాలు.
  • ఇతడు స్వేచ్ఛాపిపాసి, ఆంగ్లేయుల కార్యకలాపాలను అదుపు చేయాలనే కోరికతో పలు రకాల చర్యలు తీసుకున్నాడు.
  • ఢాకా రాణి అయిన గస్తీబేగం, పూర్ణియా రాజకుమారుడైన షౌకత్‌జంగ్‌లు సిరాజ్‌ఉద్‌దౌలా నవాబు కావడాన్ని వ్యతిరేకించారు.
  • సిరాజ్‌కు శత్రువువైన అమీన్‌చంద్‌ అనే వర్తకుడికి ఆంగ్లేయులు బెంగాల్‌లో ఆశ్రయం కల్పించారు. గస్తీబేగం సలహాదారుడి కుమారుడైన కృష్ణదాస్‌కు కలకత్తాలో ఆశ్రయం  ఇచ్చారు. ఈ చర్యలు సిరాజ్‌ఉద్‌దౌలాకు ఆగ్రహం కలిగించాయి.
  • క్రీ.శ.1756 జూన్‌ 4న సిరాజ్‌ సేనలు కాశింజజార్‌ను, మరో పదిరోజుల వ్యవధి తర్వాత కలకత్తాను ఆక్రమించాయి.
  • కలకత్తా ముట్టడిలో బందీలుగా ఉన్న 146 మంది బ్రిటిష్‌ వారిని ఒక మహిళతో సహ్శా సిరాజ్‌ విలియం కోటలోని ఓ చిన్న గదిలో బంధించాడని, వారిలో ఊపిరాడక 123 మంది మరణించారనీ హల్‌వెల్‌ ్బఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడినవారిలో ఒకర్శు అనే చరిత్రకారుడు రాశాడు. దీన్నే చరిత్రకారులు కలకత్తా చీకటిగది ఉదంతంగా పేర్కొన్నారు.
  • ఆధునిక చరిత్రకారులు ్ఞహల్‌వెల్ఠ్‌ ఉద్దేశపూర్వకంగానే సిరాజ్‌ను అప్రతిష్టపాలు చేయడానికే ఈ కథను సృష్టించాడని పేర్కొన్నారు.
  • సిరాజ్‌ సైన్యాలు 1756 జూన్‌ఆగస్టు మధ్యకాలంలో పలు విజయాలు సాధించాయి.
  • ఆంగ్లేయులు కుటిల రాజనీతితో సిరాజ్‌ అనుచరులైన మానిక్‌చంద్‌, జగత్‌సేత్‌లను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు.
  • ఫలితంగా రాబర్ట్‌ క్లైవ్‌, వాట్సన్‌ల నేతృత్వంలో బెంగాల్‌లో ప్రవేశించిన ఆంగ్లేయ సైన్యాలు 1757 జనవరి రెండోరోజు నాటికి కలకత్తాను తిరిగి ఆక్రమించుకున్నాయి. హుగ్లీపై కూడా దాడికి జరిగింది.
  • చివరికి సిరాజ్‌ ్ఞఅలీనగర్ఠ్‌ వద్ద 1757 ఫిబ్రవరి 9న ఆంగ్లేయులతో సంధి చేసుకున్నాడు.
  • అంతవరకు వారి అధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటిపై వారి హక్కులను గుర్తించాడు.
  • క్లైవ్‌ 1757 మార్చిలో సిరాజ్‌ఉద్‌దౌలాను ఓడించి చందానగర్‌ను ఆక్రమించాడు.
  • క్లైవ్‌ సాధించిన చందానగర్‌ విజయంలో హుగ్లీ పౌజ్‌దారు నందకుమార్‌ చేసిన మోసం కూడా కీలక పాత్ర పోషించింది.

రచయిత: డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ప్లాసీ యుద్ధం క్రీ.శ. 1757 జూన్‌ 23

అలీవర్ధీఖాన్‌ కాలం నుంచే బెంగాల్‌లో ఆంగ్లేయులతో ఏర్పడిన ఘర్షణలు సిరాజ్‌ఉద్‌దౌలా కాలం నాటికి శిఖరస్థాయికి చేరుకున్నాయి.

  • ఈ ఘర్షణల వల్ల బెంగాల్‌ నవాబు చివరికి ఆంగ్లేయులతో ప్లాసీ యుద్ధం చేయాల్సి వచ్చింది.
  • ఈ యుద్ధానికి అనేక రాజకీయ పరిస్థితులు దోహదం చేశాయి.
  • ముఖ్యంగా చందానగర్‌ను ఆంగ్లేయులు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్రెంచ్‌ వారికి సిరాజ్‌ఉద్‌దౌలా ఆశ్రయమిచ్చాడు.
  • ఇది ఆంగ్లేయాధికారులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
  • ఏ విధంగానైనా సిరాజ్‌ను కఠినంగా శిక్షించాలనుకున్నారు.
  • రాబర్ట్‌ క్లైవ్‌ సూచన మేరకు, అమీన్‌చంద్‌ ద్వారా, సిరాజ్‌ శత్రువు మీర్‌జాఫర్‌, జగత్‌సేత్‌, రాయ్‌దుర్లబ్‌లతో సంప్రదింపులు జరిపారు.
  • ఈ పరిస్థితుల్లోనే సిరాజ్‌ఉద్‌దౌలా మీర్‌జాఫర్‌ను తన సేనాధిపతిగా నియమించాడు.
  • ఫ్రెంచ్‌ వారితో సిరాజ్‌ రహస్యంగా చర్చలు జరుపుతున్నాడనే నెపంతో ఆంగ్లేయులు అతనిపై యుద్ధం ప్రకటించారు.

యుద్ధం తీరుతెన్నులు

ఇరుపక్షాల సైన్యాలు 1757 జూన్‌ 22 నాటికి భగీరథీ నది తీరాన ఉన్న దిగువ భాగానికి చేరాయి.

  • రాబర్ట్‌ క్లైవ్‌ ఆంగ్లేయ సేనలతో మరుసటిరోజు ప్లాసీ చేరాడు.
  • క్లైవ్‌ తన ఫిరంగి దళంలో ఒక భాగాన్ని శత్రువుపైకి పంపి, మిగిలిన సేనలను వెనకవైపు నిలిపాడు.
  • సిరాజ్‌ పక్షాన ఉన్న ఫ్రెంచ్‌ సైనికుల భాగం మాత్రమే వాస్తవంగా ఆంగ్లేయ సైనికులతో యుద్ధంలో పాల్గొంది.
  • సిరాజ్‌ సేనాధిపతి మీర్‌జాఫర్‌ సైన్యాలు, రాయ్‌దుర్లభ్‌ నేతృత్వంలోని బెంగాల్‌ సైన్యాలు మాత్రం శత్రుపక్షంతో యుద్ధం చేయలేదు.
  • ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం మీర్‌జాఫర్‌, అతని అనుచరులు నవాబ్‌ను యుద్ధంలో మోసం చేశారు.
  • సిరాజ్‌ఉద్‌దౌలా సాయంత్రం వరకు ఒంటరిగానే ఆంగ్లేయ సైన్యాలను ప్రతిఘటించాడు. చివరికి పరిస్థితిని గ్రహించి కుటుంబంతో రాత్రికి ముర్షిదాబాద్‌కు చేరుకున్నాడు.
  • ప్రాణ రక్షణ కోసం పారిపోతున్న నవాబ్‌ను మీర్‌జాఫర్‌ సైనికులు బంధించారు. 1757 జూన్‌ 28న సిరాజ్‌ను మీర్‌జాఫర్‌ కొడుకు మీరాన్‌ ఉరితీయించాడు.

కారణాలుఫలితాలు

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధాన్ని చరిత్రాత్మక యుద్ధంగా గుర్తించారు.

  • రాబర్ట్‌ క్లైవ్‌ కుటిల రాజనీతి, బ్రిటిష్‌ సైనిక శక్తి ముందు సిరాజ్‌ఉద్‌దౌలా శక్తి సామర్థ్యాలు, సైనిక శక్తి విఫలమయ్యాయి.
  • అతడి వ్యక్తిగత బలహీనత కంటే అతని సన్నిహితులు, బంధువులు, అధికారులు చేసిన నమ్మక ద్రోహమే సిరాజ్‌ పతనానికి కారణమైంది.
  • కంపెనీ అండతో మీర్‌జాఫర్‌ బెంగాల్‌ నవాబుగా 1757 నుంచి 1760 వరకు కొనసాగాడు.  
  • రాబర్ట్‌క్లైవ్‌, అతని సైనికుల పేరు ప్రతిష్టలు ప్లాసీ విజయంతో రెట్టింపయ్యాయి.
  • సుప్రసిద్ధ ఆధునిక భారతదేశ చరిత్రకారుల్లో ఒకరైన ఆర్‌.సి.మజుందార్‌ రాబర్ట్‌ క్లైవ్‌ విజయానికి అతడి సైనికశక్తి, వ్యూహ రచన కంటే కూడా రాయ్‌దుర్లభ్‌, మీర్‌జాఫర్ల కుతంత్రాలే సిరాజ్‌ఉద్‌దౌలా అపజయానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
  • ఆంగ్లేయులతో చేసుకున్న సంధి ప్రకారం మీర్‌జాఫర్‌ కంపెనీకి కలకత్తాకు దక్షిణంగా 900 చదరపు మైళ్ల విస్తీర్ణం గల 24 పరగణాలపై జమీందారీ హక్కు ప్రదానం చేశాడు.
  • బెంగాల్‌లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
  • ప్లాసీ యుద్ధ విజయానంతరం క్లైవ్‌ భారతభూమిపై ఆంగ్లేయ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాడు.
  • బెంగాల్‌ నవాబులు కంపెనీ చేతిలో కీలుబొమ్మలయ్యారు.

బక్సార్‌ యుద్ధం 1764 అక్టోబరు 22

ప్లాసీ యుద్ధ విజయంతో బెంగాల్‌లో ఆంగ్లేయులు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పినప్పటికీ, సంపూర్ణంగా వారి అధీనంలోకి రాలేదు. పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించడానికి వారికి మరో ఏడేళ్ల సమయం పట్టింది.

  • బెంగాల్‌ నవాబైన మీర్‌జాఫర్‌, కంపెనీ అధికారుల మధ్య ప్లాసీ సంధి షరతుల ఆచరణ విషయంలో విభేదాలు తలెత్తాయి.
  • ఆర్థిక, అధికారపరంగా మీర్‌జాఫర్‌ దివాలా తీశాడు. ప్రతి విషయంలో ఆంగ్లేయుల జోక్యం మితిమీరింది.
  • ఇదే సమయంలో మీర్‌జాఫర్‌ కొడుకు మీరాన్‌ చనిపోగా, అతడి అల్లుడైన మీర్‌ఖాసీం ఆంగ్లేయులకు సన్నిహితుడయ్యాడు. చివరికి పెన్షన్‌ అంగీకరించి మీర్‌జాఫర్‌ నవాబు పదవికి రాజీనామా చేశాడు.
  • 1760లో రాబర్ట్‌ క్లైవ్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడు. కొత్త ఆంగ్లేయ గవర్నర్‌ వాన్‌సిత్తార్‌ మీర్‌ఖాసీంను బెంగాల్‌ కొత్త నవాబుగా గుర్తించాడు. ఇతడు 1763 వరకు పదవిలో కొనసాగాడు.
  • ఈ మూడేళ్ల కాలంలో ఆంగ్లేయులకు, నవాబుకు అనేక విషయాల్లో తగాదాలు ఏర్పడ్డాయి. నవాబు ఆంగ్లేయుల వర్తకంపై ఆంక్షలు విధించాడు.
  • దీంతో ఇరుపక్షాల మధ్య 1762లో యుద్ధం జరిగింది.
  • మేజర్‌ ఆడమ్స్‌ 1762 జనవరిలో 1100 మంది ఆంగ్లేయ సైనికులతో మీర్‌ఖాసీంతో యుద్ధం చేశాడు. కానీ పరాజితుడై బెంగాల్‌ వదిలి పారిపోయాడు.
  • ఈ సంఘటన బక్సార్‌ యుద్ధానికి అతి ముఖ్యమైన కారణమైంది.

యుద్ధ ఫలితం

1763లో మీర్‌జాఫర్‌ రెండోసారి బెంగాల్‌ నవాబు అయ్యాడు. మొగల్‌ చక్రవర్తి రెండో షాఆలం, అయోధ్యకు చెందిన షుజాఉద్దౌలాతో చర్చలు జరిపి, వాన్‌సిత్తార్‌కు వ్యతిరేక కూటమి ఏర్పాటు చేశాడు.

  • వీరందరి సైన్యం సంఖ్యపరంగా పెద్దదైనప్పటికీ 1764 అక్టోబరు 22న బక్సార్‌ వద్ద జరిగిన యుద్ధంలో ఓటమి పాలయ్యారు.
  • ఆంగ్లేయ సైనిక శక్తి, వ్యూహ రచన, తుపాకీ బలం ముందు మీర్‌ఖాసీం, షుజాఉద్దౌలా నిలువలేకపోయారు.
  • మొగల్‌ చక్రవర్తి షాఆలం ఆంగ్లేయులకు లొంగిపోయాడు. దీంతో బెంగాల్‌ శాశ్వతంగా ఆంగ్లేయుల వశమైంది.
  • షాఆలం అలహాబాద్‌ వద్ద 1765లో ఆంగ్లేయులతో సంధి కుదుర్చుకున్నాడు.
  • ఆంగ్లేయులు బెంగాల్‌, బిహార్‌, ఒడిశాలపై దివాన్ఠీ లేదా రెవెన్యూ పాలనాధికారాన్ని పొందారు.
  • ఈ విధంగా 1757  65 మధ్యకాలంలో బెంగాల్‌, బిహార్‌, ఒడిశాలపై కంపెనీ స్థిరమైన అధికారాన్ని సాధించింది.
  • ఈ యుద్ధం తర్వాత క్లైవ్‌ క్రీ.శ.1765లో రెండోసారి బెంగాల్‌ గవర్నర్‌గా వచ్చాడు.
  •  ప్లాసీ, బక్సార్‌ యుద్ధాలు బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని