శిల్పుల నది.. కృష్ణా కవుల నది.. గోదావరి

భారతదేశ నదీ వ్యవస్థ దేశంలో నదీ వ్యవస్థ అనేది కీలకమైన అంశం. నదీ పరీవాహక ప్రాంతాల్లో పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.

Published : 07 May 2024 00:44 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ

భారతదేశ నదీ వ్యవస్థ దేశంలో నదీ వ్యవస్థ అనేది కీలకమైన అంశం. నదీ పరీవాహక ప్రాంతాల్లో పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో హిమాలయ నదులు ఉత్తర భారతదేశంలో ఉండగా, ద్వీపకల్ప నదులు దక్షిణ భారతంలో ప్రవహిస్తున్నాయి. నదుల జన్మస్థానాలు, వాటి ఉపనదులు, నదుల సంగమాలు, ప్రవహించే రాష్ట్రాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.

ద్వీపకల్ప నదులు

గోదావరి

క్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి. ఇది దేశంలో రెండో పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసికా త్రయంబకం పీఠభూమిలోని బీలే సరస్సు వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ. దూరంలో జన్మిస్తుంది.

నది మొత్తం పొడవు 1465 కి.మీ. కాగా తెలంగాణలో 520 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 250 కి.మీ. దీని పరీవాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ.

ప్రవహించే రాష్ట్రాలు: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి

ఇతర పేర్లు: తేలివాక, వృద్ధగంగా, దక్షిణగంగా, ఇండియన్‌ రైన్‌, కవుల నది

గోదావరి నిజామాబాద్‌ జిల్లాలోని కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

ప్రవహించే జిల్లాలు: నిజామాబాద్‌; నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల.

మంచిర్యాల జిల్లాలోని జంగాం అనే ప్రాంతం వద్ద ఇది అర్ధచంద్రాకారంలో ప్రయాణిస్తుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి గోదావరి ప్రవేశిస్తుంది.

ఆంధ్రలో ప్రవహించే జిల్లాలు: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండల వద్ద ఈ నది బైసన్‌ గార్జ్‌ను ఏర్పరుస్తుంది. పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.

సముద్రంలో కలిసే ముందు ఈ నది ఏడు పాయలుగా విడిపోతుంది. అవి: గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. గౌతమి, వశిష్ఠ మధ్యనున్న ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఈ ప్రాంతం కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. కోనసీమను ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనంగా పిలుస్తారు.

ఉపనదులు - వివరాలు

పూర్ణ, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వైన్‌గంగా, వార్ధా, ఇంద్రావతి, శబరి ఎడమవైపు నుంచి గోదావరికి కలుస్తాయి. మంజీర, మానేరు, కిన్నెరసాని, ప్రవర కుడివైపు నుంచి కలుస్తాయి.

  • వార్ధానది మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా కొండల్లోని ముత్తాయి వద్ద జన్మిస్తుంది. పూర్ణ నది అజంతా కొండల్లో పుట్టి, జంబుల్‌బెట్‌ వద్ద గోదావరిలో కలుస్తుంది. పూర్ణ నది, దాని ఉపనది దుధన నదికి మధ్యలో ఎల్లోరా కొండలు ఉన్నాయి.
  • పెన్‌గంగా, వైన్‌గంగా, వార్ధా నదులు మూడూ కలిసి ప్రాణహిత ఏర్పడుతుంది. పెన్‌గంగా, వైన్‌గంగా కలిసే ప్రాంతం - చెన్నూరు.
  • గోదావరికి అతి పెద్ద ఉపనది - ప్రాణహిత
  • తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలుస్తుంది. గోదావరి ఉపనదుల్లో పుష్కరాలు జరిగేది ప్రాణహిత నదికి మాత్రమే.
  • ఒడిశాలో జన్మించి తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనది ఇంద్రావతి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని చిత్రకూట్‌ జలపాతం ఇంద్రావతి నదిపై ఉంది. శబరి నది ఒడిశాలోని సింకారం కొండల్లో జన్మించి, ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిని ఒడిశాలో కొలాల్‌ నది అంటారు.
  • కడెం నది ఆదిలాబాద్‌ జిల్లాలోని బోతాయి వద్ద జన్మిస్తుంది. తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతం కుంతాల జలపాతం (49 మీ. ఎత్తు). ఇది కడెం నదిపైనే ఉంది.
  • మంజీర నది మహారాష్ట్రలోని బాలాఘాట్‌ కొండల్లో జన్మిస్తుంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు మంజీర నదిపై ఉంది.
  • గోదావరిలో కుడివైపు నుంచి కలిసే ఉపనదుల్లో పెద్దది - మంజీర
  • మానేరు నది తెలంగాణలోని సిరిసిల్ల కొండల్లో జన్మిస్తుంది. కరీంనగర్‌ పట్టణం మానేరు నది ఒడ్డున ఉంది. కిన్నెరసాని ములుగు జిల్లాలోని తాడ్వాయి వద్ద పుడుతుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని బూర్గంపాడు వద్ద కిన్నెరసాని గోదావరిలో కలుస్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టు పాల్వంచ పట్టణం వద్ద ఉంది.

గోదావరి నదిపై ప్రాజెక్టులు: జయక్‌వాడి/పైథాన్‌: మహారాష్ట్రలో గోదావరి నదిపైనున్న అతిపెద్ద ప్రాజెక్టు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు లేదా పోచంపాడు ప్రాజెక్టు: నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు. రామగుండం థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌కు నీటిని సరఫరా చేస్తుంది. తెలంగాణలో పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద గోదావరిపై ఉంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: ఆదిలాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని రీ-డిజైన్‌ చేసి ఈ పథకాన్ని రూపొందించారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టు జయశంకర్‌ భూపాలపల్లిలో ఉంది.
  • పశ్చిమ గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.

కృష్ణానది

మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న మహాబలేశ్వరం వద్దనున్న జోర్‌ గ్రామం వద్ద జన్మిస్తుంది.

  • కృష్ణా నది మొత్తం పొడవు 1440 కి.మీ. తెలంగాణలో ఈ నది పొడవు 235 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో దీని పొడవు 485 కి.మీ.
  • కృష్ణా నదిని శిల్పుల నది అని కూడా అంటారు.
  • ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆంధ్రాలో పొడవైన నది కృష్ణా.
  • ఈ నది మొత్తం పరీవాహక ప్రాంతం 2,58,948 చ.కి.మీ.
  • అత్యధిక పరీవాహక ప్రాంతం కర్ణాటక (43%)లో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26%), తెలంగాణ (19%), ఆంధ్రప్రదేశ్‌ (9%)లు ఉన్నాయి.
  • ఈ నది మహారాష్ట్రలో జన్మించి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.
  • కర్ణాటకలో ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించి తెలంగాణలోకి నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ తాలూకాలో తంగడి వద్ద ప్రవేశిస్తుంది.
  • తెలంగాణలో కృష్ణానది ఆరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. అవి:

1. నారాయణపేట   2. జోగులాంబ గద్వాల   3. వనపర్తి

4. నాగర్‌కర్నూల్‌  5. నల్గొండ   6. సూర్యాపేట

  • కృష్ణానది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే జిల్లాలు: కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్‌, గుంటూరు, కృష్ణా, బాపట్ల.
  • ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది. ఈ నది విజయవాడ సమీపంలో రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని ‘దివిసీమ’ అంటారు. దివిసీమలో ఎక్కువగా పండే పంట వరి. ఇది హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఉపనదులు - వివరాలు

భీమా, పాలేరు, మూసీ, మున్నేరు, డిండి ఎడమవైపు నుంచి కృష్ణాలో కలుస్తాయి ఘటప్రభ, పంచగంగ, తుంగభద్ర, కొయనా కుడివైపు నుంచి కలుస్తాయి.

భీమా నది: మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లోని భీమశంకర్‌ గుట్టల వద్ద జన్మిస్తుంది. కృష్ణా ఉపనదుల్లో అతి పొడవైంది. దీని పొడవు 861 కి.మీ. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహించే నది.
మూసీ నది: వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండల్లో శివారెడ్డిపేట వద్ద జన్మిస్తుంది. నల్గొండలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ప్రవహిస్తుంది. హైదరాబాద్‌ నగరంలో మూసీనదిపై ఉస్మాన్‌నగర్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులున్నాయి.
డిండి నది: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాబాద్‌ కొండల్లో జన్మిస్తుంది. డిండి నదిని మీనాంబరం నది, దుందిభీ నది అని కూడా పిలుస్తారు. ఈ నది నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
మున్నేరు: మహబూబాబాద్‌లోని పాకాల సరస్సులో జన్మిస్తుంది.

  • కృష్ణా నదిని కలిసే చోటు ఏపీలోని జగ్గయ్యపేట.
  • ఖమ్మం పట్టణం మున్నేరు నది ఒడ్డున ఉంది.

తుంగభద్ర నది: కర్ణాటక రాష్ట్రంలోని వరాహగిరి పర్వతాల్లో జన్మిస్తుంది. ఈ నది పొడవు 531 కి.మీ. ఈ నది ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.

  • ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని సంగం వద్ద తుంగభద్ర నది కృష్ణాలో కలుస్తుంది. కృష్ణా, తుంగభద్రల మధ్య బాదామి కొండలు, రాయచూర్‌ పీఠభూమి, రాయచూర్‌ అంతర్వేది ఉన్నాయి.
  • కృష్ణా ఉపనదుల్లో అతి పెద్దది తుంగభద్ర.

తుంగభద్ర ఉపనదులు: హగరీ, హంద్రీ, వేదవతి.

  • కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్‌ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు ఉంది.
  • కృష్ణా నది ఉపనది అయిన కొయానా నదిని మహారాష్ట్ర జీవనరేఖ అని పిలుస్తారు.

కృష్ణా నదిపై ఉన్న ఆనకట్టలు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ఉంది. రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలు

ఎ. వనపర్తి జిల్లాలోని భీమా లేదా రాజీవ్‌గాంధీ ప్రాజెక్టు
బి. గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు లేదా జవహార్‌ ప్రాజెక్టు

  • ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారు.
  • శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ లేదా మాధవరెడ్డి కాలువ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు తాగునీరు,  కుడికాలువ ఆంధ్రప్రదేశ్‌కు తాగు, సాగునీరు అందిస్తాయి.

శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టు లేదా మహాత్మా ప్రాజెక్టు; పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

  • నల్గొండ జిల్లాలోని నందికొండ వద్ద నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఇది ఆంధ్ర, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు.
  • ప్రపంచంలోనే పెద్ద, అతి ఎత్తయిన రాతి డ్యాం. దీని ఎత్తు 127.8 మీటర్లు.
  • బ్రిటిష్‌ వారు 1853లో విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. ఈ బ్యారేజీ నుంచి కాలువల ద్వారా సుమారు 12 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది.
  • పులిచింతల ప్రాజెక్టును గుంటూరు జిల్లాలో నిర్మించారు.
  • దీన్ని కె.ఎల్‌.రావు ప్రాజెక్టు అని అంటారు.
  • భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు కె.ఎల్‌.రావు.

రచయిత: పి.కె. వీరాంజనేయులు, విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని