Updated : 30 Jun 2022 12:22 IST

Fake job: నకిలీ ఉద్యోగం పసిగట్టేదెలా..?

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ అండీ... కేవలం రూ.5వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే చాలు’.. ‘ఏడాదికి రూ.10 లక్షల ప్యాకేజీ.. మీ బ్యాంకు ఖాతా వివరాలు కాస్త చెప్పండి’ ‘డేటా ఎంట్రీ ఉద్యోగం సార్‌... కన్సల్టెన్సీకి కొంత ఖర్చులు చెల్లిస్తే జాబ్‌ మీదే’ ...ఇలా ఎవరైనా చెబుతుంటే సందేహించాల్సిందే! ఎందుకంటే ఇప్పుడు నకిలీ ఉద్యోగాల బెడద ఎక్కువైపోయింది. అందుకే అభ్యర్థీ... జర భద్రం!

న దేశంలో గత రెండేళ్లలో దాదాపు 13 కోట్ల మంది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. అదేసమయంలో ఆన్‌లైన్‌లో పనిచేయడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఇదే అదనుగా నకిలీరాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఉద్యోగాలపేరిట యువతకు వల విసిరి డబ్బులు గుంజుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం సేకరించి కొల్లగొడుతున్నారు. కొలువు కోసం ఆరాటపడే ఉద్యోగార్థులు వీరికి చిక్కి ఇబ్బందులపాలు కాకుండా ఉండాలంటే... ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసేటప్పుడు, నియామక సమయంలోనూ కొన్ని విషయాలను కచ్చితంగా గమనించాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

1. మనం ఏ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నామో... అందులో నిజంగా నియామకాలు జరుగుతున్నాయా లేదా అన్నది ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కచ్చితంగా సరిచూసుకోవాలి.

2. ఒకేసారి వేలకువేల ఉద్యోగాలు అంటూ ఆన్‌లైన్‌లో పోస్టులు, వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటికి స్పందించేటప్పుడు సంయమనం అవసరం. నిజంగా అన్ని వేల ఉద్యోగ నియామకాలు జరుగుతుంటే మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా వార్తలు ప్రచురించకుండా ఉంటుందా? సర్వసాధారణంగా అలా జరగదు. అంటే అవన్నీ ఫేక్‌ అని అర్థం చేసుకోవాలి. సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

3. డేటా ఎంట్రీ - ఇదో పెద్ద మాయాజాలం. ముందు డిపాజిట్‌ కట్టమంటారు. తర్వాత వర్క్‌ పంపుతాం అని చెబుతారు. ఏదో పని ఇచ్చి, మనం చేశాక వంకలు పెట్టి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. ఆపైన ఇంకా ఏవేవో కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తారు. మన దేశంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలని చెప్పే వాటిలో అధికశాతం ఇటువంటి దొంగ సంస్థలే.

4. మంచి పేరున్న పెద్దపెద్ద కంపెనీల బ్రాండ్‌ను వాడుకుంటూ ఆఫర్స్‌ ఇస్తుంటే నమ్మకూడదు. ఆ కంపెనీల నియామక ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, కాస్త కఠినంగానే ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేస్తే ఆ సంస్థలు అంత పేరుప్రఖ్యాతులు సాధించగలవా? అవన్నీ నకిలీలేనని గుర్తించాలి.

5. విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరిట మాయమాటలు చెబుతున్నా... మోసపోకూడదు. వెంకీ, దుబాయ్‌శీను, లండన్‌బాబులు సినిమాలు చూసే ఉంటారుగా!

6. కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం... ఇది మరో రకమైన మోసం. మన నంబరు తెలుసుకుని కాల్‌ చేసి, మంచి ఉద్యోగం అంటూ మాయమాటలు చెబుతారు. లక్షల ప్యాకేజీ అని అంకెలు చెప్పి మభ్యపెడతారు. కొంత ఖర్చవుతుంది అంటూ డబ్బులు ఖాతాలో వేయమంటారు. ఇలాంటి సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగం ఇచ్చే ఏ సంస్థ అయినా అభ్యర్థి నుంచి డబ్బు తీసుకోదు! ఒకవేళ ఆ కన్సల్టెన్సీ నిజమైనదే అయితే దానికి సదరు సంస్థ చెల్లించుకుంటుంది, లేదా చేరాక ఇమ్మంటారు కానీ ముందే కాదు. ఎవరైనా ముందే డబ్బు అడుగుతున్నారూ అంటే అది మోసమేనని గుర్తించాలి.

8. కొందరు మరో అడుగు ముందుకేసి ఆఫర్‌ లెటర్స్‌ కూడా పంపిస్తుంటారు. వాటిని బాగా చదవాలి. అందులో భాష ప్రొఫెషనల్‌గా లేకపోయినా, అక్షరదోషాలు,   అన్వయలోపాలు ఉన్నా, వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు ఇచ్చినా, మెయిల్‌ ఐడీ సంస్థది కాకుండా వ్యక్తులు వాడే ఉచిత ఐడీల్లా అనిపించినా దాన్ని అనుమానించాల్సిందే.

9. ఉద్యోగంతోపాటు బోలెడన్ని అదనపు ప్రయోజనాలు ఇస్తామని నమ్మబలికితే ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఏ సంస్థా అలా ఆయాచితంగా ఇచ్చేయదు.

10. కంపెనీ వివరాలేవీ చెప్పకుండా పేరున్న ఎంఎన్‌సీ, పెద్ద సంస్థలో జాబ్స్‌ అంటూ మొదలుపెడితే.. అవి చూడటం అక్కడితో ఆపేయడం మంచిది.

11. ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాక్‌డోర్‌ అంటూ కొందరు వ్యక్తులు మోసం చేస్తుంటారు. ఇలాంటివి పట్టణాలు, పల్లెల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అవి కూడా నిజం కాదని గమనించాలి.

మొత్తంగా చెప్పాలంటే కష్టపడకుండా సులువుగా ఏదీ రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలా సులువుగా వస్తుందీ అంటే అది నిజం కాదనే విషయాన్ని గుర్తించండి. ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసేటప్పుడు అది నిజమా కాదా అన్నది ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని, అప్పుడు మాత్రమే స్పందించాలి. ఆధార్‌, పాన్‌ నంబర్లు, అడ్రస్‌, మెయిల్‌ ఐడీ వంటివి ఇచ్చేటప్పుడు తొందరపడొద్దు. ఎటువంటి రుసుమూ చెల్లించొద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా సైబర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వండి.

జాగ్రత్తగా ఉండండి...
ఇలాంటి ట్రాప్‌లో చిక్కుకోకండి!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని