చెట్టు మీద పిట్టుంది.. దాని ఒంట్లో విషముంది!

ఈ పక్షి చూడడానికి భలే ముద్దుగా ఉంది కదూ! కానీ దాని ఒళ్లంతా విషమే. రెక్కల్లో, ఈకల్లో, చర్మంలో, చివరికి కండరాల్లోనూ విషమే. ఇది మనుషుల్ని చంపేయగలదు కూడా! ఇంతకీ ఇదేం పక్షి. దీని పేరేంటి? ఇదెక్కడుంది అనేగా మీ అనుమానం.

Published : 02 Aug 2021 01:04 IST

ఈ పక్షి చూడడానికి భలే ముద్దుగా ఉంది కదూ! కానీ దాని ఒళ్లంతా విషమే. రెక్కల్లో, ఈకల్లో, చర్మంలో, చివరికి కండరాల్లోనూ విషమే. ఇది మనుషుల్ని చంపేయగలదు కూడా! ఇంతకీ ఇదేం పక్షి. దీని పేరేంటి? ఇదెక్కడుంది అనేగా మీ అనుమానం.

దీని పేరు హుడెడ్‌ పిటోహుయి. దీని ముక్కుతో మన ఒంటిమీద చిన్న గాటు పెట్టినా చాలు. మన ఒళ్లు మొద్దుబారిపోతుంది. విషం కాస్త ఎక్కువైతే పక్షవాతమూ రావొచ్చు. ఇంకాస్త ఎక్కువైతే ప్రాణమే పోవచ్చు. అయ్యో.. మీరు అలా భయపడకండి. ఎందుకంటే ఈ విషపూరిత పక్షి మన దగ్గర ఉండదు. కేవలం న్యూగినియాలోని అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది.

బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట..!

ఈ పక్షి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. గొంతుకూడా వినసొంపే. కానీ దీని ఒంటి నిండా న్యూరోట్యాక్సిన్‌ ఉంటుంది. ఇది విషాన్ని ఎలా తయారు చేసుకుంటుందో తెలిస్తే మనం అవాక్కవుతాం. అది తీసుకునే ఆహారం నుంచే విషాన్ని ఉత్పత్తి చేసుకుని శరీరంలో నిల్వ చేసుకుంటుంది. తన రక్షణ కోసమే ఈ ఏర్పాటన్నమాట. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పక్షిగా దీని పేరిట గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కూడా ఉంది తెలుసా. ఇంతా చేస్తే ఈ పక్షి కేవలం 23 సెంటీమీటర్ల పొడవు, 65 నుంచి 75 గ్రాముల బరువు ఉంటుందంతే.

విషమున్నా వీటిని తినేస్తారు!

ఈ పక్షిలోని విషం ఏకంగా మనిషినే చంపేయగలదు. కానీ న్యూగినియాలో కొందరు ఆటవిక తెగలవారు తమకు ఏ ఆహారమూ దొరకనప్పుడు వీటిని తింటారు. అది కూడా ఈ పక్షిని చంపిన తర్వాత కాసేపు సంతాపం పాటిస్తారు. దీని చర్మాన్ని, ఈకల్ని జాగ్రత్తగా తొలగించి దానికి బొగ్గుపొడిని అద్దుతారు. తర్వాత దీన్ని నిప్పులపై బాగా కాల్చి ఆహారంగా తీసుకుంటారు. మొత్తానికి ఇవీ విషపక్షి విశేషాలు.

అది విజిలేస్తే..
ఈ పక్షి అరుపులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఓ రకంగా ఈలను తలపిస్తాయి. ఇది చక్కగా పాటలు కూడా పాడుతుంది. సందర్భానుసారంగా ఏడు విధాలుగా ఇది ఈలలు వేయగలదు. కొన్ని చిన్న చిన్న పురుగులు, పండ్లు, గడ్డి విత్తనాలను ఆహారంగా తీసుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని