Updated : 23 Mar 2021 19:58 IST

వ్యాయామం ఆహారం!

ఎంత వ్యాయామానికి అంత బలం! అందుకే వాటిపై అంత ఆసక్తి. వ్యాయామాలతో కండరాలు బలోపేతమవుతాయి. అందం, ఆకర్షణ ఇనుమడిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల ముప్పులు తగ్గుతాయి. నియంత్రణలోనూ ఉంటాయి. కాబట్టే నిపుణుల శిక్షణలో చేసే వ్యాయామాలకు రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఎంతోమంది జిమ్‌లలో కఠినమైన కసరత్తులు చేస్తూ కండరాలకు పరీక్ష పెడుతున్నారు. కానీ తిండి విషయంలోనే చాలా సందేహాలు వస్తుంటాయి. వ్యాయామాలకు ముందు తినాలా? వద్దా? ఎప్పుడు వ్యాయామాలు చేస్తే మంచిది? ఎన్నెన్నో అనుమానాలు తొలుస్తుంటాయి. వీటిని నివృత్తి చేసుకోవటం ఎంతైనా అవసరం.
న శరీరమే మన వాహనం! శారీరక శ్రమ, వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇది చతికిల పడకుండా చూసుకోవటం ముఖ్యం. అంటే శరీరం చురుకుగా పనిచేయటానికి సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన ఆహారం, సరైన ద్రవాలు తీసుకోవటం తప్పనిసరి అన్నమాట. వ్యాయామంతో ఆరోగ్యం మెరుగవ్వడటం నిజమే గానీ దీనికి తిండి కూడా తోడైతేనే మంచి ఫలితం కనిపిస్తుంది. గుండెను బలోపేతం చేసేవి, బలానికి పరీక్ష పెట్టేవి, శరీరాన్ని సాగదీసేవి.. ఎలాంటి వ్యాయామాలతో కండరాలకు పని చెప్పినా అవి పోషణ కోసం మనం తినే ఆహారం మీదే ఆధారపడతాన్నది గుర్తుంచుకోవాలి. వ్యాయామాలకు ముందు, తర్వాతా. విరామం ఇచ్చినప్పుడూ నిరంతరం శరీరానికి పోషకాలు అందుతుండాలి. తగినంత సేపు వ్యాయామం చేయటం, అనుకున్న లక్ష్యాలను సాధించటం వంటివన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే గ్లూకోజు స్థాయులు గతి తప్పకుండా ఉండటానికి.. త్వరగా అలసిపోకుండా చూసుకోవటానికి.. వేగంగా కోలుకోవటానికి వ్యాయామాలకు ముందు, తర్వాత తగినంత ఆహారం, ద్రవాలు తీసుకోవటం తప్పనిసరి. దీని విషయంలో కఠినమైన నిబంధనలు, పద్ధతులంటూ ఏమీ లేవు. మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కాకపోతే కొన్ని ముఖ్యమైన సంగతులను తెలుసుకొని, ఆచరించటం మంచిది.


1 కసరత్తులకు ముందు ఏం తినాలి?

చాలామంది పరగడుపున కసరత్తు చేయాలని భావిస్తుంటారు. నిజానికి ఏదైనా కొద్దిగా తిన్న తర్వాత ఆరంభిస్తే ఎక్కువసేపు, ఉత్సాహంగా వ్యాయామాలు చేయొచ్చు. కండలు పెంచుకోవాలని అనుకునేవారికిది మరింత ముఖ్యం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటమంటే పెట్రోలు లేకుండా కారును నడపటం లాంటిదే అనుకోవచ్చు. మరేం తినాలి? తగినన్ని నీళ్లు తాగటం అన్నింటికన్నా ముఖ్యం. వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూడటానికి నీళ్లు, ద్రవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పొట్టుతీయని ధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు తినటం మంచిది. ఉదాహరణకు- కార్న్‌ ఫ్లేక్స్‌ వంటివి వెన్న తీసిన పాలతో కలిపి తినొచ్చు. పొట్టుతో కూడిన గోధుమ టోస్ట్‌, పాస్తా, వెన్న తీసిన పెరుగు, దంపుడు బియ్యం అన్నం వంటివైనా తీసుకోవచ్చు. అరటి, యాపిల్‌, ఎండుద్రాక్ష వంటి పండ్లు  తినొచ్చు. లేదూ వీటితో చేసిన గుజ్జు ద్రవాలు తాగొచ్చు. పీచుతో కూడినవి కాకుండా ఉడకబెట్టిన బంగాళాదుంపల వంటి కూరగాయలు తినొచ్చు. పీచుతో కూడినవైతే త్వరగా జీర్ణం కావు. ఇవి వ్యాయామం చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటివి ఏవైనా సరే.. వ్యాయామాలకు ముందు కనీసం అరగంట ముందుగా తీసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా తినటం తగదు. వీటిని జీర్ణం చేసుకోవటానికి శరీరం ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది మరి. ఇది వ్యాయామాలకు ఇబ్బంది కలిగిస్తుంది. కొందరు కసరత్తులు చేసేటప్పుడు శక్తినిచ్చే పానీయాలు తాగుతుంటారు. ఇది మంచిది కాదు. ఇవి గుండె వేగం, రక్తపోటు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకుల వంటివీ తీసుకోవద్దు. వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఉంటుంది. ఇవి రెండిందాలా హాని చేస్తాయి.


2 పరగడుపున చేయొచ్చా?

వ్యాయమాల ఉద్దేశాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినప్పుడు శరీరం శక్తి కోసం విలువైన కొవ్వు నిల్వలను వినియోగించుకుంటుంది. అందువల్ల బరువు తగ్గాలని భావించేవారికి పరగడుపున వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే పరగడుపున రక్తంలో గ్లూకోజు స్థాయులు తక్కువగా ఉంటాయి. కాబట్టి తల తేలిపోవటం, వికారం, వణుకు వంటి లక్షణాలు తలెత్తొచ్చు. జాగ్రత్త అవసరం. మధుమేహులకు ఇది మరింత ముఖ్యం. నిరంతరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకుంటూ ఉండటం వల్ల మన శరీరం దీనికి సర్దుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలో కోల్పోయిన కొవ్వును భర్తీ చేసుకోవటానికి మరింత కొవ్వును నిల్వ చేసుకునేందుకూ ప్రయత్నిస్తుంటుందనీ గుర్తుంచుకోవాలి. పరగడుపున భారీ కసరత్తులు చేస్తే కండరాలు క్షీణించే ప్రమాదమూ ఉంది.


3 వ్యాయామాల తర్వాత ఏం తినాలి?

తగినన్ని నీళ్లు తాగటంతో పాటు పిండి పదార్థాలు, ప్రొటీన్‌ సరైన మోతాదుల్లో తీసుకోవటం తప్పనిసరి. ఇవి కండరాల్లో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా వ్యాయామాలతో కష్టపడ్డ కండరాలు వేగంగా కోలుకుంటాయి. ఆ తర్వాత వ్యాయామాలు చేస్తున్నప్పుడు కండరాల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఇలా త్వరగా అలసిపోకుండా చూస్తాయి. వ్యాయామం తర్వాత అరటిపండ్లు తినటం చాలా మంచిది. ఇతరత్రా పండ్లేవైనా తినొచ్చు. ఇవి కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి. కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వలు పడిపోకుండా చూస్తాయి. ఇలా కండరాలు త్వరగా కోలుకోవటానికి, బలోపేతం కావటానికి దోహదం చేస్తాయి. వీలైనంత వరకు వ్యాయామాలు చేసిన 45 నిమిషాల్లోపే తినటం మంచిది. ఒకవేళ ఈ సమయంలో తినటం కుదరలేదనుకోండి. ఎప్పుడు తిన్నా కూడా ఆ తర్వాత 2 గంటల అనంతరమే భోజనం చేయటం ముఖ్యమనే సంగతిని గుర్తుంచుకోవాలి.


4 ఎప్పుడు మంచిది?

ఉదయం పూట కన్నా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువసేపు వ్యాయామం చేయటానికి వీలుంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో శరీర ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో శరీరం వ్యాయామాలకు అనుగుణంగా ఉంటుంది. ఎక్కువ శ్రమను తట్టుకుంటుంది. అందువల్ల ఈ సమయంలో వ్యాయామం చేయటం మంచిది. ఎక్కువసేపు, మరింత సమర్థంగా వ్యాయామాలు చేయటానికీ వీలుంటుంది. సాధారణంగా రాత్రిపూట వ్యాయామం చేస్తే నిద్రకు భంగం కలుగుతుంది. అదే సాయంత్రం వేళల్లో అయితే ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే పడుకోవటానికి కనీసం గంట ముందు వరకు మరీ తీవ్రమైన వ్యాయామాలేవీ చేయకపోవటమే ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని