వానా.. వానా.. వల్లప్పాఇక్కడికెందుకు రావప్పా!

వానలు ఎప్పుడు కురుస్తాయి? ‘ఇదేం ప్రశ్న? వర్షాకాలంలో కురుస్తాయి. ఒక్కోసారి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డప్పుడు...

Published : 24 Jun 2020 00:51 IST

వానలు ఎప్పుడు కురుస్తాయి? ‘ఇదేం ప్రశ్న? వర్షాకాలంలో కురుస్తాయి. ఒక్కోసారి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డప్పుడు వానాకాలం కాకున్నా కురుస్తాయి’ అని చెబుతారేమో! ఇది ఎక్కడైనా నిజమేమో కానీ.. దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో మాత్రం కాదు. ఇక్కడ వర్షం ఊసే ఉండదు. ఆంటోఫాగస్టా, కలమా, కోపియాపోలాంటి చోట్లైతే కొన్ని వందల సంవత్సరాలపాటు అసలు ఒక్క చుక్క వర్షమూ కురవలేదు.

అత్యంత పొడిప్రాంతం

అటకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడిప్రాంతం. 1570 నుంచి 1971 వరకు అయితే అసలు ఈ ఎడారిలో కలమా ప్రాంతంలో ఎక్కడా వానలే పడలేదు. తర్వాత అక్కడక్కడా పడ్ఢా. చాలా చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడ కొన్ని గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి. గాల్లో తేమతో ఎలాగో అవి బతికేస్తున్నాయి.

ఖనిజాల ఖని!

ఈ ప్రాంతంలో సోడియం నైట్రేట్‌ నిల్వలు చాలా ఎక్కువ. వీటిని ఎరువులు, పేలుడు పదార్థాల తయారీ కోసం వాడతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడి మట్టి నమూనాలు.. అచ్చం అంగారక గ్రహంపై ఉన్న మట్టితో సరిపోలుతున్నాయి. చూస్తే ఒట్టి ఎడారి కానీ... ఈ ప్రాంతం మాదంటే మాదే అని చిలీ, బొలీవియా గతంలో తగాదాలకు దిగాయి. ఇక్కడ పెద్ద మొత్తంలో ఖనిజ నిల్వలు ఉండటమే అసలు కారణం. మొత్తానికి తర్వాత ఈ ప్రాంతంపై చిలీ పట్టు సాధించింది.

ఇక్కడా ఉన్నాయి మమ్మీలు

ఈజిప్టు మమ్మీల్లాగే... ఈ ప్రాంతంలోనూ శాస్త్రవేత్తలకు కొన్ని మమ్మీలు దొరికాయి. వీటిని చిన్‌చారో మమ్మీస్‌ అని పిలుస్తారు. ఇక్కడ సంవత్సరంలో 300 రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అసలు మేఘాలే ఉండవు. అందుకే ఇక్కడ పే..ద్ద పే..ద్ద టెలిస్కోపులు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర గ్రహాల గమనాలపై ప్రయోగాలు చేస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని