ఆసనాల్లో తేజం

రెండు యోగాసనాలు వేస్తేనే అబ్బో అనుకుంటాం.. అలాంటిది ఓ చిన్నారి ఏకంగా అవార్డు సాధిస్తే.. అదీ అయిదు నిమిషాల్లోనే అంటే.. నిజంగా రికార్ఢే. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!

Updated : 20 Sep 2020 01:39 IST

రెండు యోగాసనాలు వేస్తేనే అబ్బో అనుకుంటాం.. అలాంటిది ఓ చిన్నారి ఏకంగా అవార్డు సాధిస్తే.. అదీ అయిదు నిమిషాల్లోనే అంటే.. నిజంగా రికార్ఢే. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!

హైదరాబాద్‌కు చెందిన తేజస్వి మూడో తరగతి చదువుతోంది. చిన్నారి తాతయ్య, అత్తయ్య యోగాలో వివిధ స్థాయిల్లో అవార్డులు సాధించారు. వారి స్ఫూర్తిగా తేజస్వి చిన్నతనం నుంచే యోగాసనాలు సాధన చేసింది. క్లిష్టమైన ఆసనాలు వేస్తే పురస్కారాలు వస్తాయని తెలియని వయసు. అప్పుడే పెద్దల సూచన మేరకు ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆసనాలు కసరత్తు చేయడం దినచర్యగా మార్చుకుంది.

క్లిష్టమైన ఆసనంతో రికార్డు

యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. అందులో గండభేరుండ కొంత క్లిష్టమైంది. సంస్కృతంలో గండ అంటే ముఖం, భేరుండ అంటే భయంకరమైన అని అర్థం. ఇందులో వీపు భాగం మొత్తాన్ని విల్లులా వంచి.. కాళ్లను చేతుల దగ్గరకు తీసుకురావాలి. ఇటీవల జరిగిన కార్యక్రమంలో 5.13 నిమిషాల్లో 150 సార్లు గండభేరుండ ఆసనం వేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ‘ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదు. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఆసనాలు సాధన చేస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధిస్తా’ అని చెబుతోంది తేజస్వి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని